Suryaa.co.in

Editorial

సవాంగ్‌ను సర్కారు సమస్యల్లోకి నెట్టిందా?

– రాజీనామా చేయకుండానే రాజ్యాంగపదవి ఇవ్వవచ్చా?
-తెలంగాణలో జనార్దన్‌రెడ్డికి రాజీనామా చేసిన తర్వాతనే చైర్మన్ పదవి
– ఇంతకూ ఏపీపీఎస్‌సి చైర్మన్ ఎందుకిచ్చినట్లు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇంకా 17 నెలల పదవీకాలం ఉన్న ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌పై అవమానకర రీతిలో వేటు వేసిన జగన్ సర్కారు.. తాజాగా ఆయనకు ఏపీపీఎస్‌సి చైర్మన్ పదవి ఇచ్చి మరో సమస్యలోకి నెట్టిందన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. రాజ్యాంగబద్ధ పదవి అయిన ఏపీపీఎస్‌సి చైర్మన్ పోస్టులో ఒక అధికారిని నియమించాలంటే ముందు, సదరు అధికారి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చే సిన తర్వాతనే, వారిని ఆ పదవిలో నియమించాలన్న కనీస స్పృహ ప్రభుత్వానికి లేకపోవడంపై అధికారుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

జగన్ సీఎం అయిన తర్వాత డీజీపీగా నియమితులయిన గౌతం సవాంగ్‌ను, ఆ పదవి నుంచి తొలగిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. అంతకుముందు సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంపై కూడా జగన్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అయితే ఆత్మాభిమానం ఉన్న ఎల్వీ, బాపట్లకు వెళ్లకుండా లీవులో వెళ్లి, రిటైరయిన విషయం తెలిసిందే. కాగా ఈ ఇద్దరినీ సీఎం జగన్.. ఎల్వీ అన్న, సవాంగన్న అంటూ పిలిచేవారు కావడం విశేషం. తాజాగా సవాంగ్‌కు వెంటనే ఏదో ఒక పదవి ఇవ్వకుండా, జీఏడీలో రిపోర్టు చేయాలంటూ ఉత్తర్వు ఇవ్వడం కూడా సవాంగ్‌ను అవమానించడమేనన్న వ్యాఖ్యలు అధికార వర్గాల్లో వినిపించాయి. అంతకుముందు వివాదరహితుడిగా పేరున్న సవాంగ్, ఈ రెండున్నరేళ్ల కాలంలో డీజీపీ హోదాలో ‘వైసీపీ అనుకూల అధికారి’గా ముద్రపడాల్సి వచ్చింది.కొన్ని సందర్భాల్లో హైకోర్టులో కూడా ఆయన నిలబడాల్సి వచ్చింది.

అధికార పార్టీ విపక్షంపై దాడి చేసిన పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ప్రధానంగా భావప్రకటన స్వేచ్ఛపై ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దానితో విపక్షాలు సవాంగ్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలు.. రాష్ట్రంలో గంజాయి-డ్రగ్స్ కేసులు వెలుగుచూసినప్పుడు పరాకాష్టకు చేరాయి. ఆ సందర్భంలో సవాంగ్ సైతం రాజకీయ నేతల మాదిరిగానే మాట్లాడారన్న విమర్శలు వినిపించాయి.

అంతకుముందు డీజీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా హెడ్‌క్వార్టర్‌లో ఫైళ్లు శరవేగంగా కదిలాయి. విచారణ సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు అడిగిన ఏ ఒక్క పత్రం కూడా ఇవ్వలేదన్న అంశం అప్పట్లో చర్చనీయాంశమయింది. నిజానికి సర్కారు పెద్దలే సవాంగ్ భుజంపై తుపాకీ పెట్టి, ఏబీని బలి చేశారన్న వ్యాఖ్యలు అప్పట్లో ఐపిఎస్ వర్గాల్లో వినిపించాయి.

ఏబీ సస్పెన్షన్‌పై నాటి నుంచి నేటివరకూ ఐపిఎస్ అధికారుల సంఘం పెదవి విప్పకపోవడం అటుంచి.. కనీసం సంఘం వార్షిక సమావేశం కూడా పెట్టకపోవడం బట్టి, చివరకు ఐపిఎస్‌లను కూడా ప్రభుత్వ పెద్దలు ఏ స్థాయిలో కంట్రోల్‌లో ఉంచారో అర్ధమవుతుందన్న చర్చ కూడా అప్పట్లో జరిగింది.
ఆ రకంగా అధికార పార్టీ అధికారిగా ముద్రవేయించి, ఆయనను ప్రభుత్వం వీలైనంత వాడుకుని వదిలే సిందన్న వ్యాఖ్యలు పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. ఏబీ వెంకటేశ్వరరావు మాదిరిగా సవాంగ్‌ను కూడా, జీఏడీలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులివ్వడమే తమను ఆశ్చర్యపరిచిందని పలువురు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.

దానికి తోడు ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై కేసులు పెట్టిస్తున్న ఒక విభాగ అధిపతిని.. ప్రభుత్వంలో ఉన్న వారు సవాంగ్‌కు వ్యతిరేకంగా ప్రోత్సహించారంటున్నారు. ఆ ధీమాతోనే డీజీపీని సదరు అడిషనల్ డీజీ స్థాయి ఖాతరు చేయలేదన్న వ్యాఖ్యలు అటు ఐపిఎస్ వర్గాల్లోనూ వినిపించాయి. ఆరు నెలల క్రితమయితే సవాంగ్‌ను డీజీపీ నుంచి తొలగిస్తారన్న ప్రచారం ఊపందుకున్న సమయంలో, దానిపై ఆయన వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. అయితే .. నాన్ క్యాడర్ ఎస్పీలకు సవాంగ్ నెలల తరబడి సమయం ఇవ్వడం లేదన్న ఫిర్యాదు కూడా ఆయనపై బదిలీ వేటుకు ఒక కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా సవాంగ్‌కు ఏపీపీఎస్‌సి చైర్మన్ ఇచ్చిన ప్రభుత్వం, ఆయనను కొత్త సమస్యలోకి నెట్టిందన్న చర్చ అధికార వర్గాల్లో మోదలయింది. ఆయన డీజీపీ పదవికి రాజీనామా చేయకుండా, చైర్మన్ బాధ్యతలు తీసుకోవడం చెల్లదని న్యాయనిపుణులు, సీనియర్ అధికారులు చెబుతున్నారు. గతంలో ప్లానింగ్ శాఖలో పనిచేసిన ఒక అధికారితోపాటు, మరొక మహిళా అధికారి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాతనే, ఏపీపీఎస్‌సి సభ్యులుగా నియమితులయ్యారని అధికారులు గుర్తు చేస్తున్నారు. అటు తెలంగాణలో కూడా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన జనార్దన్‌రెడ్డి, తన పదవికి రాజీనామా చేసిన తర్వాతనే టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ పదవి తీసుకున్నారు.

‘సవాంగ్‌కు ఇంకా ఏడాదికి పైగా సర్వీసు ఉండగనే బదిలీ ఉత్తర్వులివ్వడం విచారకరం. ఆయనకు ఏపీపీఎస్‌సి చైర్మన్ ఇచ్చారని విన్నా. మంచిదే. అయితే, ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్‌సి చైర్మన్ పదవి తీసుకోలేరు. తీసుకుంటే కొత్త సమస్యలు వస్తాయి. ఒకవేళ ఇన్చార్జి చైర్మన్‌గా పదవీబాధ్యతలు తీసుకున్నా, అక్కడ ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవు. ఈ విషయంలో సవాంగ్‌కు రాజ్యాంగం గురించి తెలుసనుకుంటున్నా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు’ అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, తన ఉద్యోగానికి రాజీనామా చేయకుండా, చైర్మన్ పదవి తీసుకుంటే సవాంగ్‌కు కొత్త సమస్యలు తప్పవంటున్న అధికార వర్గాలు… ఒకవేళ ఇన్చార్జి చైర్మన్‌గా ఉన్నా, ఆయన చేసేదేమీలేదని స్పష్టం చేస్తున్నారు. ‘ఇన్చార్జి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. సభ్యులతో సమావేశం కూడా నిర్వహించి, నిర్ణయం తీసుకునే వెసులుబాటు లేదు. ఆయన కేవలం ఆఫీసు వ్యవహారాలు పర్యవేక్షించడం తప్పఎలాంటి అధికారాలూ తీసుకోలేరు. ఒకరకంగా సవాంగ్‌కు కంటితుడుపుగానే ఈ పదవి ఇచ్చినట్లు కనిపిస్తోంద’ని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. డీజీపీగా రెండున్నరేళ్ల పాటు ఒక వెలుగువెలిగిన సవాంగ్, ఈ విధంగా ఎలాంటి ప్రాధాన్యం లేని పదవి తీసుకుంటారా? లేక ఎల్వీ మాదిరిగానే సెలవుపై వెళతారా అన్న చర్చ కూడా పోలీసువర్గాల్లో జరుగుతోంది.

అయితే.. ఎలాగూ ప్రభుత్వోద్యోగులకు మరో రెండు సంవత్సరాల పదవీకాలం పెంచినందున, రాష్ట్రంలో అప్పటివరకూ కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. పైగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు, విద్యార్ధి సంఘాలు ఇప్పటికే ఉద్యమబాట పట్టారు. జగన్ సర్కారు ఆర్ధిక సంక్షోభంలో ఉన్నందున, ఇప్పట్లో కొత్త ఉద్యోగాలు కలే. కాబట్టి సవాంగ్ ఒకవేళ ఉద్యోగానికి రాజీనామా చేసి, చైర్మన్ పదవి తీసుకున్నా పెద్దగా సాధించేది ఏమీ లేదని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నారు.

LEAVE A RESPONSE