Suryaa.co.in

Editorial

‘పొత్తు రామాయణం’లో జోగయ్య పిడ’కుల’వేట!

– సొంత సొల్లుతో జనసేనకు అనుగ్రహభాషణం
– జనసేనకు సలహాదారుగా మానసిక భావన
– గత ఎన్నికల్లో పవన్‌ను రెండు చోట్లా ఎందుకు గెలిపించలేదు?
– ప్రజారాజ్యంలోనూ జోగయ్యది ఇదే తీరంటున్న కాపు సంఘాలు
– జనాభా దామాషా డిమాండ్‌తో పవన్‌కు పితలాటకం తెచ్చిన జోగయ్య
– ఆ ప్రకారమైతే బీసీలకే ఎక్కువ సీట్లు ఇవ్వక తప్పదు
– మరి పొత్తు సీట్లలో కాపులకు ఎన్ని ఇవ్వాలి?
– గతంలో జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయన్న వాదన
– మరి దాని ప్రకారం జనసేనకు 9 సీట్లు ఇవ్వాలన్నదే జోగయ్య డిమాండా?
– సొంత ఉనికి కోసమే జోగయ్య ఉబలాటం
– పొత్తు సీట్లపై పవన్‌కు స్పష్టత ఉందంటున్న సీనియర్లు
– ఎవరెంత రెచ్చగొట్టినా పవన్‌కు ఒక వ్యూహం ఉందని స్పష్టీకరణ
– జోగయ్య తీరుపై కాపు సంఘాల కన్నెర్ర
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ కాపు రాజకీయ రామాయణంలో ఇదో పిడ‘కుల’వేట. సీనియర్ వృద్ధనేత, ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురై, ఆ పరిస్థితుల్లోనే జనసేన ఆఫీసుకు వచ్చిన చేగొండి హరి రామ జోగయ్య.. టీడీపీ-జనసేన పొత్తుపై చేసిన తాజా వ్యాఖ్యలు ఇలాంటి పిడ‘కుల’ వేట సామెతనే గుర్తుచేస్తున్నాయి. కాపు నాయకుడిగా, జనసేన సిద్ధాంతకర్తగా తనకు తాను భావించుకునే జోగయ్య సూత్రీకరించిన పొత్తు సీట్ల సిద్ధాంతం.. జనసేన దళపతి పవన్‌ను ఇరుకున పెడుతున్నాయి. జనాభా దామాషా, గత ఎన్నికల్లో ఓట్ల శాతం వంటి అంశాలను తెరపైకి తెచ్చిన జోగయ్య తెవివి, తెల్లారినట్లే ఉందని అటు కాపు సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి.

టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా చంద్రబాబు-పవన్ చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పంచుకోవాలన్నది, జోగయ్య తెపైకి తెచ్చిన ప్రతిపాదన. ఇక పొత్తులో కనీసం జనసేన 60 సీట్లు అడగాలన్నది మరో ప్రతిపాదన. గత ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించినందున, ఆ ప్రకారం వ్యవహరించాలన్నది మరో సూచన. ప్రధానంగా జనాభా దామాషా సూత్రాన్ని పాటించాలన్నది మరో సలహా. ‘‘వైఎస్సార్‌సీపీని తప్పించడమంటే టీడీపీకి అధికారం కట్టబెట్టడం కాదు. బాబును అధికారంలోకి తెచ్చేందుకు కాదు కాపులు పవన్ వెంట నడిచేది’’అన్నది జోగయ్య సూత్రీకరణ.

ఆంధ్రాలో రాజకీయాలతో ఎక్కువ సంబంధాలు ఉండే కమ్మ-రెడ్డి-కాపు వృద్ధనేతలు.. అంటే జోగయ్య వయసుకు అటు ఇటుగా ఉండే నాయకులంతా.. తమ ఆచలోన ప్రకారం తాము అభిమానించే పార్టీ నాయకత్వాలు నడవాలని కోరుకుంటారు. ఆ మేరకు ‘కుల గుల’ ఎక్కువగా ఉండే, జోగయ్య లాంటి నేతలైతే పార్టీ అధినేతలకు లేఖలు రాస్తుంటారు. అది అందరికీ తెలిసి, తాను కూడా కులం కోసం పోరాడుతున్నానని చెప్పేందుకు.. ఆ కాపీని మీడియాకు ఇస్తుంటారు. మళ్లీ దానిపై మీడియాలో చర్చలు, రచ్చలూ వగైరా జరుగుతుంటాయి. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ-టీడీపీ-కొత్తగా జనసేనలో.. ఇలాంటి స్వయంప్రకటిత సలహాదారులు సర్వత్రా కనిపిస్తుంటారు.

అయితే ఇలాంటి జోగయ్యలను ఆయా పార్టీలేమైనా సలహాలు, సూచనలూ అడుగుతాయా అంటే, అసలు వీరిని పార్టీలు పట్టించుకోవు. దానితో నడిచే ఓపిక లేకపోయినా.. కళ్లు కనిపించకపోయినా..చెవులు వినిపించకపోయినా.. చివరాఖరకు వీల్‌చైర్‌లో వెళ్లి పార్టీ అధ్యక్షుల కోసం, ఆ వయసులో కూడా గంటలు వేచి చూస్తుంటారు. ఆ తర్వాత ఒక వినతిపత్రం ఇచ్చి ఆ ఫొటోను మీడియాకు రిలీజు చేసి, దానిని మీడియాలో చూసుకుని మురిసిపోతుంటారు. అదో అలౌకిక ఆనందం! అంటే అదేదో సినిమాలో ఏవీఎస్ చెప్పినట్లు.. ‘అదో తుత్తి’ అన్నమాట. ఇలాంటి జోగయ్య వంటి స్వయంప్రకటిత సలహాదారుల వంటి సీనియర్ సిటిజన్లు, అన్ని పార్టీల్లోనూ కనిపిస్తుంటారు.

ఇలాంటి బాపతు నేతలు పార్టీ నాయకత్వాలతో సంబంధం లేకుండా.. వారంతట వారే పాలిసీలను డిసైడ్ చేస్తుంటారు. సిద్ధాంతకర్తలుగా ఊహించుకుంటారు. నేను ఫలానా నేతతో మట్లాడానని ప్రచారం చేసుకుని సంబరపడుతుంటారు. నేను ఆ కాలంలో అంత పొడిచేశాను, ఇంత పొడిచేశానని చెప్పుకుని బతికేస్తుంటారు. ఆరోజుల్లో ఫలానా అధినేత నేను చెప్పిన సలహా పాటించేవాళ్లని గొప్పలు చెప్పుకుని సంతృప్తిపడుతుంటారు. టీ స్టాళ్లు.. బార్లు.. పార్కులు.. బాతాఖానీలలో తమ పార్టీలకోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందిస్తుంటారు.

అధినేత ఇలా వ్యవహరించాలని ఆశిస్తుంటారు. తాము చెప్పినట్లు వ్యవహరించాలని కోరుకుంటారు. కార్యకర్తల మనోభావాలకు ప్రతినిధుల్లా ఫీలవుతుంటారు. ఇంత హడావిడి చేసే ఇలాంటి వారిని, ఆయా పార్టీల అధినేతలు గుర్తుపడతారా అంటే అదీ లేదు. మళ్లీ ఎవరో ఒక బడా నేత, ఈ గొప్పలరాయుళ్లను అధినేతలకు పరిచయం చేయాల్సిందే. మళ్లీ ఆ ఫొటోలతో ఇంకో పబ్లిసిటీ. పోనీ వీరికేమైనా పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించే సత్తా ఉందా అంటే అదీ లేదు. పిలిస్తే పదిమంది వస్తారా అంటే అదీ లేదు. అసలు వీళ్లనే పదిమంది పట్టుకుని లేపాలి.

జనసేనకు మానసిక సలహాదారు’గా తనకు తాను ఫీలయ్యే జోగయ్య.. ఇదే జనసేన దళపతి పవన్ రెండు చోట్లా ఓడిపోకుండా చూడలేకపోయారు. గతంలో చిరంజీవికి ఇలాంటి చచ్చు పుచ్చు సలహాలిచ్చిన ఇదే జోగయ్య లాంటి వాళ్లు.. పీఆర్పీని గెలిపించలేకపోవడంతోపాటు, చిరంజీవిని ఆయన సొంత జిల్లాల్లో ఘోరంగా ఓడించినా ప్రేక్షకపాత్ర పోషించారు.

చివరకు తిరుపతిలో బలిజలు ఆదుకుని, చిరంజీవి పరువు నిలబెట్టారు. లేకపోతే ఆయన ప్రస్థానం మరోలా ఉండేది. అందుకే ఆంధ్రా కాపులను నమ్మడం కష్టమని రాయలసీమ బలిజలు బహిరంగంగానే చెబుతుంటారు. ‘ఆంధ్రాలో కాపులు చిరంజీవిని మోసం చేస్తే రాయలసీమలో బలిజలు, ఆయనను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు. లేకపోతే ఆయన పరిస్థితి ఏమిటి? కులరాజకీయాలు చేసే ఇలాంటి జోగయ్యలను నమ్ముకుంటే కష్టం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఈ కాపు నేతలు అప్పుడు చిరంజీవిని, గత ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ను ఎందుకు గెలిపించలేకపోయారు? అంటే వాళ్లకి మీడియాలో తప్ప కాపుల్లో బలం లేదని, కాపుజాతి ఇప్పటికైనా అర్ధం చేసుకోవాల’ని బలిజనాడు కన్వీనర్ డాక్టర్ ఒవి రమణ వ్యాఖ్యానించారు.

తాజాగా జోగయ్య రాసిన లేఖ.. ఎవరికి చేరాలో వారికి చేరిందో లేదో తెలియదు. అంటే పవన్ అడ్రసుకు అది చేరిందో లేదో తెలియకపోయినా.. ఆ రోజు మీడియా- పొద్దున పేపర్లలో అయితే వచ్చింది. జోగయ్య లాంటి రాజకీయ వృద్ధ సింహాలకు కావలసింది కూడా అదేననుకోండి. అది వేరే విషయం.

అసలు జోగయ్య లేఖ కాపులలో పవన్ కల్యాణ్ ప్రతిష్ఠను పెంచాలనా? తుంచాలనా? అర్ధం కావడం లేదన్నది కాపునేతల ప్రశ్న. గత ఎన్నికల్లో జనసేనకు 6 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని జోగయ్య ప్రస్తావించారు. అంటే ఆయన వాదన ప్రకారం ఇప్పుడు పొత్తులో జనసేనకు 9 సీట్లు ఇస్తే సరిపోతుందా? అన్నది కాపునేతల ప్రశ్న.

ఆ ప్రకారమైతే టీడీపీకి వచ్చిన 40 శాతం ఓట్లకు ఆ పార్టీకి పొత్తుల్లో ఎన్ని సీట్లు దక్కాలి? జోగయ్య ఈ లాజిక్కు తెలిసే మాట్లాడి, పవన్‌ను ఇరుకున పెడుతున్నారన్నది కాపు నేతల విమర్శ. గత ఎన్నికల్లో టీడీపీకి 39.75 శాతం, జనసేనకు 5.5 శాతం, బీజేపీకి .8 శాతం కాంగ్రెస్‌కు ఒక శాతం ఓట్లు వచ్చాయన్న విషయాన్ని వారు విశ్లేషిస్తున్నారు.

సహజంగా పార్టీల బలాలు, ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలప్పుడు మారుతుంటాయి. ఆ మేరకు పొత్తుల్లో సీట్ల సర్దుబాట్లు జరుగుతుంటాయి. ఇలాంటి కనీస పరిజ్ఞానం-అవగాహన కూడా జోగయ్యకు లేకుండా పోయిందేమిటని కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు.జోగయ్య వ్యాఖ్యలన్నీ జనసేనపై కాపులను రెచ్చగొట్టేవేనని పలువురు కాపు నేతలు స్పష్టం చేస్తున్నారు.

జనాభా దామాషా సూత్రాన్ని తెరపైకి తెచ్చిన జోగయ్య పవన్‌ను తెలివిగా ఇరికించారని చెబుతున్నారు. జోగయ్య చెప్పిన జనాభా దామాషా సిద్ధాంతం ప్రకారమైతే బీసీలకే ఎక్కువ సీట్లు ఇవ్వాలి. మరి పొత్తులో జనసేనకు దక్కిన సీట్లలో సగానికి పైగా బీసీలకే ఇవ్వాల్సి ఉంటుంది. మరి జోగయ్య సిద్ధాంతం ప్రకారమే అయితే కాపులకు అన్యాయం జరుగుతుంది కదా? అంటే కాపులకు పవన్ అన్యాయం చేయాలన్నదే జోగయ్య ఆలోచనా?‘ అని కృష్ణా జిల్లాకు చెందిన ఓ కాపు నేత ప్రశ్నించారు.

నిజానికి ఎన్నికల్లో ఎన్ని సీట్లకు పోటీ చేయాలన్న అంశంపై, చంద్రబాబు-పవన్‌కు స్పష్టమైన అవగాహన ఉందని ఓ కాపు నేత స్పష్టం చేశారు. ఈ అంశంలో పవన్ ఇప్పటికి జనసైనికులకు మూడుసార్లు స్పష్టత ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.

‘‘సీట్లు తీసుకోవడం కాదు. నిలబెట్టిన చోట అభ్యర్ధులను గెలిపించుకునే సత్తా ఉండాలి. నేలమీద నిలబడి పనిచేయండి. కలలు కనవద్దు. ప్రత్యర్ధి బలమైనవాడు. ముందు మన బలం-మన బలహీనతలేంటో గ్రహించాలి. మనం ప్రత్యర్ధికి ఎట్టి పరిస్థితిలో అవకాశం ఇవ్వకూడదు. నాకో వ్యూహం ఉంది. ఇష్టం లేని వారు నిరభ్యంతరంగా బయటకు వెళ్లిపోవచ్చు. సీనియారిటీ పేరుతో నన్ను బెదిరిస్తే ఎలా? మాట్లాడటం లేదని, నేను మౌనంగా ఉన్నానని అనుకోవద్దు. మనకు తగిన సీట్లు వస్తేనే సీఎం పదవి అడగవచ్చు. అది లేకుండా సీఎం సీటు ఎలా అడగుతాం? మీరు నన్ను సీఎం అనడం కాదు. క్షేత్రస్థాయిలో ప్రత్యర్ధులకు పోటీ ఇచ్చేంత ఎదగాలి. మీతో వచ్చిన కార్యకర్తలకు అన్నం కూడా తినిపించకపోతే ఎలా? నేను ఎన్నికల సంఘం పరిథిలో ఖర్చు చేయమన్నా తప్ప, ఓటర్లకు డబ్బులు పంచమనలేదు’’ అని స్పష్టం చేసిన విషయాన్ని కాపు నేతలు గుర్తు చేస్తున్నారు. అంటే పవన్‌కు పొత్తు-సర్దుబాట్లపై ఏ స్థాయిలో అవగాహన ఉందో తెలుస్తుంది.

‘అయినా జోగయ్య 1994 తర్వాత రాజకీయాల్లో ఎక్కడా లేరు. అప్పటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆయన సమకాలీకులు, ఆయన అనుచరులు కూడా ఇప్పుడు లేరు. ఇప్పుడు ఆయన చెబితే వినేవారే లే రు. రాజకీయ నేతలు కాలం ప్రకారం అప్‌డేట్ కావాలి. లేకపోతే వారిని సమాజం మర్చిపోతుంది. అయినా ఇన్ని చెబుతున్న జోగయ్య తన ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో చిరంజీవి, పవన్‌ను ఎందుకు గెలిపించలేకపోయారు? చిరంజీవిని మా బలిజలు తిరుపతిలో గెలిపించి ఆయన ప్రతిష్ఠ కాపాడాం. మీరు కాపు జాతితో లబ్థిపొంది ఆ ఇద్దరినీ ఓడించారు’’ అని బలిజనాడు కన్వీనర్, టీటీడీ మాజీ సభ్యుడు డాక్టర్ ఓ.వి.రమణ వ్యాఖ్యానించారు.

పొత్తు-సీట్లపై చంద్రబాబు-పవన్‌కు స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు, మధ్యలో జోగయ్యలాంటి రామాయణంలో పిడకల వేట ఎందుకని ప్రశ్నించారు.‘‘ఇలాంటి వాళ్ల వల్లనే చిరంజీవి ప్రజారాజ్యం ఇబ్బందులు పడింది. అసలు వీళ్లను ఎవరు సలహాలు అడిగారని మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు?

పోనీ జోగయ్య జనసేన నేత కూడా కాదు. ఆయన లాంటి కాపు సంఘ నేతలు ఆంధ్రాలో చాలా ఉన్నాయి. వాళ్లంతా పవన్ విధానాలు సరైనవని నమ్మినందుకే మాట్లాడటం లేదు. 1994 తర్వాత క్రియాశీల రాజకీయాల్లో లేని జోగయ్య, ఇంట్లో కూర్చుని సిద్ధాంతాలు రూపొందిస్తామంటే బలిజ-కాపులు ఎందుకు సహిస్తారు? జనసేన శ్రేణుల్లో అపోహలు సృష్టించాలన్న కుట్ర తప్ప, పవన్‌కు మేలుచేయాలన్న ఆలోచన జోగయ్యకు లేద’’ని రమణ స్పష్టం చేశారు. ఇప్పటికే జనసేన-టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలసి కదనరంగంలో ఉన్నారని గుర్తు చేశారు.