Suryaa.co.in

Editorial

పవన్ మౌనమే జోగయ్య జోరుకు కారణమా?

– పొత్తుపై కాపులలో జోగయ్య వ్యాఖ్యల ప్రభావం
– ఎవరి కోసం జోగయ్య వివాదాస్పద వ్యాఖ్యలు?
– జోగయ్య వ్యాఖ్యల వెనుక ఎవరు?
– బీజేపీకి ఆరెస్సెస్.. జనసేనకు జోగయ్య కూడా అలాగేనట
– స్పష్టం చేసిన కాపు సంక్షేమ సంఘం నేత మధుబాబు
– పవన్, మనోహర్ మౌనంపై కాపుల్లో గందరగోళం
– ఇప్పటిదాకా ఖండించని జనసేన నాయకత్వం
– జోగయ్యతో జనసేనకు సంబంధం ఉన్నట్లా? లేనట్లా?
– జనసేన మౌనం పార్టీకే నష్టమంటున్న సీనియర్లు
– తెరపైకి అనుమానాలు వేయి
– ‘పరోక్ష ఒత్తిడి’ వ్యూహమైతే నష్టమేనంటున్న నేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన జనసేనలో నాయకుడు కాదు. ఆ పార్టీ సభల్లో ఎప్పుడూ కనిపించరు. ఆ పార్టీలో ఎలాంటి పదవీ లేదు. కానీ జనసేన దళపతి పవన్ ఫలానా విధంగా నడవాలని సలహాలిస్తుంటారు. జనసేన దళపతికి నేరుగా కాకుండా, మీడియాముఖంగా లేఖలు రాస్తుంటారు. పవన్ కల్యాణ్ కూడా ఆ వృద్ధనేతను పరామర్శించారు. పెద్దవాడన్న గౌరవంతో కాళ్లకు నమస్కరించారు. టీడీపీ పొత్తులో పవన్ ఎన్ని సీట్లు తీసుకోవాలో సదరు పెద్దాయన సూచిస్తుంటారు. ‘చంద్రబాబును గెలిపించడానికి కాదు పవన్ పొత్తు’ అని సూత్రీకరిస్తుంటారు. కారణం ఆయనకు చంద్రబాబుతో పొసగదు. పాతకాలం నాటి కాపుల భావజాలంలో మార్పులొచ్చి.. ప్రస్తుత కాలానికి అనుగుణంగా మారుతున్నా, ఆయన శైలి మాత్రం మారదు.

ఇప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు కాపులలో గందరగోళం రేపుతున్నాయి. పార్టీ శేణుల్లో అయోమయానికి కారణమవుతున్నాయి. అసలు ఆయన తనంతట తానే మాట్లాడుతున్నారా? లేక ఎవరైనా తెర వెనుక ఉండి ఆయనతో అలా మాట్లాడించే ఒత్తిడి వ్యూహమా? ఆ పెద్దాయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా, జనసేన దళపతి పవన్.. ఉప దళపతి మనోహర్ మౌనం వహించడానికి కారణమేమిటి? వారిద్దరి మౌనమే ఆ పెద్దాయన జోరుకు కారణమా? ఇది కూడా చదవండి: ‘పొత్తు రామాయణం’లో జోగయ్య పిడ‘కుల’వేట!

ఆయనకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్న ప్రకటన, ఇప్పటిదాకా వెలువడకపోవడానికి కారణమేమిటి? అసలు జోగయ్యతో జనసేనకు సంబంధం ఉందా? లేదా? ఆయన ప్రకటనలపై పార్టీ వైఖరి ఏమిటి?.. ఇదీ జనసైనికులు, కాపులలో నెలకొన్న గందరగోళం. ఇంతకూ ఈ గందరగోళానికి కారణమవుతున్న పెద్దాయన ఎవరంటే.. చేగొండి హరిరామ జోగయ్య. ఆయన చేస్తున్న వ్యాఖ్యలూనూ!

టీడీపీ-జనసేన పొత్తు బంధం బలంగా బిగుసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటికి జనసేనాధిపతి పవన్… జనసేన దళపతి పవన్ ఇంటికి చంద్రబాబునాయుడు రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా-రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల సమన్వయ కమిటీలు ఏర్పడ్డాయి. ఇరు పార్టీల కార్యకర్తలు కలసి కదం తొక్కుతున్నారు. చంద్రబాబయితే నేరుగా జనసేన ఆఫీసుకే వెళ్లారు. ఇద్దరూ కలసి ఒకరోజు పాదయాత్ర, బహిరంగవేదికలను పంచుకోవాలని కూడా నిర్ణయమయి పోయింది. తన పార్టీకి ఎన్ని సీట్లు కావాలన్న దానిపై, పవన్ మిత్రపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేశారు.

ఆ మేరకు ఎవరికి వారు చేయించుకుంటున్న సర్వేల ప్రాతిపదికన చర్చలు జరుపుతున్నారు. రెండు పార్టీలకు ఎన్ని సీట్లన్న విషయం, ఇప్పటిదాకా అటు టీడీపీ-జనసేన పార్టీ సీనియర్లకూ తెలియదు. రాష్ట్ర స్థాయి సమన్వయకమిటీకీ తెలియదు. అది వారిద్దరికే పరిమితమైన అంశంగా మారింది. వైసీపీని దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు వారిద్దరూ ఒక అవగాహనకొచ్చి పాటిస్తున్న రహస్యం అది! ఇక మీడియాలో వచ్చేవన్నీ ఊహాగానాలే. పొత్తును పెటాకులు చేసేందుకు.. వైసీపీ సోషల్‌మీడియా-దాని అనుబంధ మీడియా తనవంతుగా, సాధ్యమైనంత శ్రమదానం చేస్తూనే ఉంది. ఇదీ ఇప్పటివరకూ చూసిన టీడీపీ-జనసేన పొత్తు ప్రకియ ముఖచిత్రం.

అయితే కాపులలో పెద్దమనిషిగా వ్యవహరించే వృద్ధనేత చేగొండి హరిరామజోగయ్య.. గత కొంతకాలం నుంచీ టీడీపీ-జనసేన పొత్తుపై చేస్తున్న వ్యాఖ్యలు, అటు కాపులు-ఇటు జనసైనికుల్లో గందరగోళం రేపుతున్నాయి. జనసైనికుల్లో ఎక్కువగా కాపులు ఉన్నప్పటికీ, మొత్తం కాపులుకాదు. పవన్‌ను వ్యక్తిగతంగా అభిమానించే అన్ని కులాల వారూ జనసేనలో ఉన్నారు.

అలాంటి వారికి అసలు జోగయ్య ఎందుకు ఆ తరహా వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు? అయినా వాటిని జనసేన నాయకత్వం ఎందుకు అధికారికంగా ఖండించడం లేదు? అదే జోగయ్య జోరుకు కారణమా? అసలు ఆయనను తెరవెనుక ఉండి, టీడీపీపై ఒత్తిడి వ్యూహం కోసం వ్యూహాత్మకంగానే ఆయనతో కావాలని మాట్లాడిస్తున్నారా? లేకపోతే అటు పవన్-ఇటు నాదెండ్ల మనోహర్ ఎందుకు జోగయ్య వ్యాఖ్యలను ఖండించడం లేదు?

అసలు ఆయనతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఎందుకు ప్రకటించడం లేదు? అయినా నాయకత్వం మౌనంగా ఉందంటే, జోగయ్యతో పార్టీకి సంబంధం ఉందని భావించాలా? లేకపోతే..కాపు సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు మధుబాబు చెప్పినట్లు.. బీజేపీకి ఆరెస్సెస్ మాదిరిగా.. జనసేనకు జోగయ్య అలాంటి సిద్ధాంతకర్త అని భావించాలా? అన్నది జనసైనికుల సందేహాలు.

తాజాగా తిరుపతిలో కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మధుబాబు చేసిన వ్యాఖ్యలు.. జనసేనకు జోగయ్య సిద్ధాంతకర్త అన్న అనుమానాలకు, బలం చేకూర్చేలా ఉండటం ప్రస్తావనార్హం. పవన్‌ను సీఎం చేసేందుకు జనసేనకు జోగయ్య సలహాలిస్తే తప్పేమటని మధుబాబు ప్రశ్నించారు.

కాగా అటు కోస్తాకు చెందిన కొందరు కరుడుగట్టిన పాతకాలపు కాపు నేతలు.. ‘‘జోగయ్యలాంటి నేతలతో ఎవరు మాట్లాడిస్తున్నారన్నది కాదు ముఖ్యం. అలా గట్టిగా మాట్లాడితేనే, టీడీపీపై ఎక్కువ సీట్లకు ఒత్తిడి చేయవచ్చు. అలా మాట్లాడితే చంద్రబాబు కూడా జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తారు. లేకపోతే తక్కువ సీట్లతో సరిపెడతార ’’ని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జనసేన-కాపులలో నెలకొన్న గందరగోళానికి తెరదించాల్సిన బాధ్యత జనసేన నాయకత్వానిదేనని యువ జనసైనికులు స్పష్టం చేస్తున్నారు. లేకపోతే నాయకత్వమే, జోగయ్యతో మాట్లాడిస్తోందన్న తప్పుడు సంకేతాలకు కారణమవుతుందని విశ్లేషిస్తున్నారు. ఆ అంశంలో జనసేన నాయకత్వం ఏ ప్రకటన చేసినా తాము ఆహ్వానించి, ఆ మేరకు సోషల్‌మీడియాలో ఎదురుదాడి చేస్తామని స్పష్టం చేస్తున్నారు. సో.. జోగయ్య ప్రకటనలతో పార్టీకి సంబంధం ఉందా? లేదా అన్నది స్పష్టం చేయాల్సింది ఇక జనసేన దళపతులదే.

LEAVE A RESPONSE