ఏనాడైనా సకాలంలో పరిహారం అందించావా బాబూ..?

– చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హతే లేదు
– ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం ఇస్తున్న ప్రభుత్వం మాది
– డైవర్షన్‌ రాజకీయాల్లో చంద్రబాబు బాగా బిజీ..
– ఆర్‌5 జోన్‌పై హైకోర్టు తీర్పు మరల్చేందుకే బాబు తంటాలు
– బాబు పబ్లిసిటీ స్టంట్స్‌ రైతులకూ తెలుసు
– అందుకే, ఆయన మాటల్ని ఎవరూ నమ్మడంలేదు
– పంటనష్ట అంచనా, పరిహారంపై బాబువి అర్ధంలేని విమర్శలు
– వర్షం కురుస్తుండగానే ఏనాడైనా బాబు పరిహారమిచ్చాడా..?
– బస్తాకు రూ.1530 ఇస్తున్నారని రైతులే చెబుతున్నారు..
– నేడు ఆర్బీకే కేంద్రాల పనితీరుపై షాకవుతున్న బాబు
– రైతుల పట్ల ఉదారంగా ఉండాలన్నది జగన్‌గారి ఆలోచన
– పండించిన ప్రతీ గింజా కొనుగోలు చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయం
– లోకేశ్‌ కోసమే జూనియర్‌ ఎన్టీఆర్‌ను బాబు పక్కనబెట్టాడు
– అందుకే, రజినీకాంత్‌ను పిలిపించుకుని పొగిడించుకున్నాడు
రాజమండ్రి ఎంపి మార్గాని భరత్‌ 

రైతులపై బాబుది మొసలికన్నీరుః
ప్రస్తుతం రాష్ట్రంలో అకాలవర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పంటనష్టంపై అంచనాలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తూనే ఉన్నాయి. అయితే, చంద్రబాబు పనిగట్టుకుని ఇప్పుడు గోదావరి జిల్లాల్లో పర్యటించాల్సిన పనేంటి..? రైతులకు రబీసీజన్ పంట నష్టపరిహారం సకాలంలో అందివ్వడంలేదని ఈరోజు బాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మరి, ఈ సందర్భంలో మేము బాబును ఒక ప్రశ్న అడుగుతున్నాం. బాబు హయాంలో ఏనాడైనా వర్షాలు కురుస్తుండగానే అధికారులు పర్యటించి పంటనష్టం అంచనాలు వేశారా..? పరిహారాన్ని కూడా వర్షం కురిసిన మరుసటిరోజే అందించిన దాఖలాలున్నాయా..? అని అడుగుతున్నాను. అసలు, మీ హయాంలో పంటనష్టం జరిగిన రెండేళ్ల తర్వాతనే రైతులకు పరిహారం చెల్లించినమాట వాస్తవం కాదా..? రైతులకు ఇవ్వాల్సిన పరిహారం బకాయిలు పెట్టి వెళితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలూ మేమే రైతుకు అందించాం. దీనిపై బాబు సమాధానం చెప్పాలి.

డైవర్షన్‌ రాజకీయంలో భాగంగా బాబు పర్యటనలివిః
ప్రభుత్వ నిర్ణయాలపై దశలవారీగా న్యాయవ్యవస్థల్లో పిటీషన్‌లు దాఖలు కావడంలో ప్రధాన కుట్రదారు చంద్రబాబే. ఇది వాస్తవం. నేడు ఆర్‌5 జోన్‌ విషయంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనుకూలంగా తీర్పును వెలువరిస్తుందని ముందుగానే అంచనా వేసిన బాబు తన డైవర్షన్‌ రాజకీయాల్లో భాగంగా ఉభయగోదావరి జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. తమ ప్రయత్నాలకు వ్యతిరేకంగా తీర్పులొస్తున్నప్పుడు ప్రజల ఆలోచనను మరల్చేందుకు బాబు రకరకాల ట్రిక్కులు ప్రయోగించడంలో దిట్టగా చెప్పాలి.

బాబుదే దరిద్రపాదంః
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కరువు ఎంతగా తాండవించిందో అందరికీ తెలుసు. కరువు పరిహారం ప్రకటించిన పాలన బాబుదే కావడంతో ఆయనది దరిద్రపుపాదం అని అందరూ భయపడిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాగానే రాష్ట్రమంతా సకాలంలో వర్షాలు కురిసి పంటలు ఏపుగా పెరిగి రైతులంతా ఆనందంగా ఉంటే.. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ గారి పాదం బంగారు పాదం అని అనుకున్న మాట వాస్తవమే కదా.. ? ఈరోజు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు హయాంలో కూడా వరుణుడు కరుణిస్తూ రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షాల్ని కురిపిస్తున్నాడు.

రైతులకు అండగా సీఎం జగన్‌ 
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, పంటనష్టంపై మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ప్రభుత్వ అధికారులతో వరుసగా సమీక్షలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడా రైతుల్లో ఆందోళన కనిపించకూడదని, కోతకోసిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని, గోనెసంచుల దగ్గర్నుంచి మిల్లర్లకు తరలింపు, రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపు తదితర అంశాల్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తున్నారు. ప్రతీ గింజ కూడా కొనుగోలు చేయాల్సిందేనని మిల్లర్లకు టార్గెట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. తడచిన ధాన్యం కొనుగోలులో కూడా తేమశాతం తదితర అంశాలకు సంబంధించి రైతుల పట్ల ఉదారంగా ఉండాలని.. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించడంలో కూడా అధికారులు మానవతాధృక్పథంతో వ్యవహరించాలని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి మా జగన్‌ గారు. అలాంటిది, చంద్రబాబు గోదావరి జిల్లాల్లో పనిగట్టుకుని పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద 75 కిలోల బస్తాకు రూ.1530 కొనుగోలు చేస్తున్నారని బాబుకు స్వయంగా రైతులు చెప్పడం గమనార్హం. ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతుల దగ్గరున్న ప్రతీ గింజ కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్బీకే కేంద్రాల్లో ఎక్కడైనా లోపాలు గుర్తించినప్పుడు కూడా బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని స్పష్టంచేస్తున్నాను.

వ్యవసాయం దండగ అన్నది బాబే కదా..?
చంద్రబాబు రైతుల దగ్గరకి వెళ్లి ఏవేవో మాయకబుర్లు చెప్పి వారిని తన మాటల గారడితో నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ, ఆయన మాటల్ని ఎవరూ నమ్మేపరిస్థితుల్లో లేరు. ఎందుకంటే, ఇదే చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అన్న మాటను రైతులెవరూ మరిచిపోలేరనేది సుస్పష్టం. అదేవిధంగా గతంలో మహానేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ గారు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తానన్నప్పుడు.. అది సాధ్యం కాదని.. కరెంటు లేని తీగలపై బట్టలు ఆరేసుకోవడమేనని వ్యంగ్యంగా మాట్లాడింది ఇదే చంద్రబాబు కాదా..? అని రైతులకు గుర్తు చేస్తున్నాను. ఒక హంతకుడిగా మారి ఈ చంద్రబాబు కాల్పులు జరిపించిన బషీర్‌బాగ్‌ ఘటన దేశంలో ఎవరూ మరిచిపోరని గుర్తుచేస్తున్నాను. ఏమొఖం పెట్టుకుని ఈరోజు గోదావరి జిల్లాల్లో తిరుగుతున్నాడని అడుగుతున్నాను. రాజకీయలబ్ధికోసం రకరకాల డ్రామాలు చేసే వ్యక్తే ఈ చంద్రబాబు అని ప్రజలంతా ఎప్పుడూ గుర్తించారు.

లోకేశ్‌ కోసమే జూనియర్‌ ఎన్టీఆర్‌ను పక్కనబెట్టిః
రాష్ట్ర ప్రజలు టీడీపీని, ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబును మరిచిపోతున్నారు కనుకనే సినీనటుడు రజినీకాంత్‌ను పిలుచుకుని మరీ బాబు పొగిడించుకున్నాడనేది అందరికీ తెలిసిపోయింది. సెల్‌ఫోన్‌ దగ్గర్నుంచి హైదరాబాద్, సైబరాబాద్‌లను తానే కనిపెట్టి డెలప్‌మెంట్‌ చేశారని బాబు ఊకదంపుడు ప్రసంగాల్లో వింటున్నాం. గతంలో మిగులు నిధులుండ బట్టి హైదరాబాద్, సైబరాబాద్‌ను అభివృద్ధి చేశావంటూ రజినీతో పొగిడించుకున్నావు. మరి, ఐదేళ్ల అధికారహయాంలో అమరావతిలో ఏమ్రాతం అభివృద్ధి చేశావనేది రజినీకాంత్‌ చేత ఎందుకు పొగిడించుకోలేదు బాబు..? అని ప్రశ్నిస్తున్నాను. టీడీపీ ఆవిర్భావ అధ్యక్షుడైన సీనియర్‌ ఎన్టీఆర్‌ మనువడిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ను బాబు ఎందుకు పక్కనబెట్టాడు..? లోకేశ్‌ కోసమే జూనియర్‌ ఎన్టీఆర్‌ను బాబు పైకిరానివ్వడం లేదనేది స్పష్టం చేస్తున్నాను. ఎంతమందినైనా ఆంధ్రకు పిలిపించుకుని బాబు పొగిడించుకున్నా.. మా నాయకుడు జగన్‌ గారి కాలివెంట్రుక కూడా పీక్కోలేరని.. రాబోయే ఎన్నికల్లో ఘోరపరాభవంతో ఓటమి పొందడం ఖాయమని చెబుతున్నాను.

రాజమండ్రిలో బాబు చిల్లరరాజకీయంః
రాజమండ్రిలో చంద్రబాబు చిల్లర రాజకీయం చేస్తూ ఢాంబికాలు పలుకుతున్నాడు. నిజంగా, రాజమండ్రిలో ప్రతీ వీధిన పర్యటించి, మా అధికారంలో పూర్తయిన ప్రతీ రోడ్డును చూస్తే చంద్రబాబుకు ఇప్పటికైనా బుద్ధొస్తుంది. రాజమండ్రిలో అక్రమమార్గంలో చిట్‌ఫండ్‌ సంస్థ నడిపిస్తున్న వారిని సీఐడీ అరెస్టు చేస్తే.. దానిలోనూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు. అగ్రిగోల్డ్, శారదా వంటి సంస్థల మాదిరిగానే మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ కూడా డిపాజిట్ల సేకరణ, వాటిని మరల్చడం సీఐడీ విచారణలో వెల్లడవుతున్న వాస్తవం. దోచుకో, పంచుకో సూత్రాలతో ముందుకెళ్తున్న చంద్రబాబు బినామీలు కూడా రాజమండ్రిలో జగత్‌ జనని చిట్‌ఫండ్‌ పెట్టి అడ్డంగా దొరికారు. అయితే, దీనిపై కూడా రాజకీయం చేస్తున్నారు. ప్రజలు ఈ వాస్తవాల్ని గ్రహించాలని కోరుతున్నాను.

ఆర్‌5 జోన్‌పై సుప్రీం తీర్పు హర్షణీయంః
ఈరోజు చాలా శుభపరిణామం అని చెప్పాలి. పేదలందరికీ రాజధానిలో ఇళ్ల స్థలాలివ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సాక్షాత్తూ హైకోర్టు సమర్ధించింది. అమరావతి ప్రాంతంలో పేదలందరికీ ఇళ్లస్థలాలివ్వాలని ఆర్‌5 జోన్‌కు సంబంధించి ప్రభుత్వ జీవో నెం.45పై దాఖలైన పిటీషన్ ను ఈరోజు హైకోర్టు కొట్టేస్తూ తీర్పు ఇవ్వడం హర్షణీయం. డెమెగ్రాఫిక్‌ ఇన్‌బ్యాలెన్స్‌ వస్తుందని అమరావతి రైతుల పేరిట పెత్తందార్లు చేసిన వాదనను కూడా కోర్టు తప్పు పట్టింది. రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదా..? అని కోర్టు ప్రశ్నించడాన్ని ప్రజలంతా గమనించాలని కోరుతున్నాను.

Leave a Reply