భక్తిలో తేడాలు

Spread the love

గురూరమ్మ ( 1570-1640) అనే సాధ్వి కేరళ రాష్ట్రంలో పాలక్కాడు సమీపానగల పరయణ్ణూరు అనే ఊరులో జన్మించారు.
గురూరమ్మకు తన పదహారవ ఏటనే వైధవ్యం ప్రాప్తించింది. తనవారంటూ చెప్పుకునే బంధువులెవరూ లేరు. తన మనసును ఆధ్యాత్మిక చింతనపై లగ్నం చేసి శ్రీకృష్ణ భక్తురాలిగా జీవించింది. సర్వకాల సర్వావస్థలలో కృష్ణ నామ జపమే పరమావధిగా గడిపింది. కృష్ణుడే తన పుత్రునిగా భావించి అపరిమితమైన మాతృ ప్రేమ చూపించేది. కల్లా కపటం లేని నిర్మలమైన మనసు కలిగిన గురూరమ్మ, శ్రీ కృష్ణుడే అందరి రూపాల్లో వుండి తన లీలలు చూపిస్తున్నడనే భావంతో లోకంలో వున్న వారందరిని తనవారిగానే భావించేది. ఆ ఊరి వారందరూ కూడా ఆమెను తమ తల్లిగా తలచేవారు.
‘బిల్వమంగళం’ అనే ఊళ్ళో బిల్వమంగళస్వామి (1575 – 1660) అనే శ్రీవైష్ణవ భక్తుడు ఒకరు వుండేవారు. ఆయన పూజచేసేటప్పుడు కృష్ణుడే ఆయన ఎదుట నిలబడేవాడని ప్రతీతి. ఆయనకు నిత్యమూ శ్రీకృష్ణుని దర్శనం లభిస్తూవుండేది.
అంతేకాక బిల్వమంగళ స్వామి నిత్యం కృష్ణునితో మాట్లాడేవారు. ఆ విషయం అందరికి తెలియడంతో భక్తులు ఆయన వద్దకు వెళ్ళి తమ మంచిచెడ్డలు గురించి చెప్పమని అడిగేవారు.
కొంతకాలానికి బిల్వమంగళస్వామి ఆ ప్రాతం వారికి గురువుగా ఉన్నతస్థానం పొందారు.
ఒకసారి ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపునెప్పితో బాధపడుతూ నివారణ కోసం బిల్వమంగళస్వామి వద్దకు వచ్చి, తన కడుపునొప్పి గురించి అన్ని వివరాలు తెలిపాడు.అది విన్న బిల్వమంగళ స్వామి “నేను యిప్పుడు కృష్ణునికి పూజ చేస్తాను, పూజా సమయంలో కృష్ణునికి మీ గురించి అడుగుతాను. మీరు నా పూజ అయ్యేదాకా ఆగండి” అన్నాడు.
బిల్వమంగళస్వామి తన పూజ ఆరంభించాడు. రోజూలాగే కృష్ణుడు దర్శనమిచ్చాడు.
బిల్వమంగళస్వామి కృష్ణునికి తన దగ్గరకు వచ్చిన బ్రాహ్మణుని కడుపునొప్పి గురించి చెప్పాడు. దానికి కృష్ణుడు, “అది పూర్వజన్మలో అతను చేసిన పాపం కారణంగా ఇప్పుడు అనుభవిస్తున్నాడు. కడుపునొప్పితో భాధపడుతున్నాడు. అది అతని ప్రారభ్దకర్మ” అని అన్నాడు. దీనిని గురించి బిల్వమంగళస్వామి కృష్ణుని మరేమి అడుగలేదు, మాటాడలేదు.
బిల్వమంగళస్వామి పూజ ముగించి బ్రాహ్మణునికితో’నీ గురించి కృష్ణుని అడిగాను, దానికి, కృష్ణుడు, ‘నీ పూర్వజన్మకర్మ అని చెప్పాడు. ఇది నువ్వు అనుభవించి తీరవలసినదే. తప్పించుకునేందుకు వీలులేదు.” అని చెప్పి పంపేశాడు బిల్వమంగళస్వామి.
ఆయన చెప్పిన దానికి బాధపడుతూ ఆ బ్రాహ్మణుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
రోజులు గడిచినకొద్దీ కడుపు నొప్పి ఎక్కువై ఆ బ్రాహ్మణునికి జీవితం మీద విరక్తి కలిగిన సమయంలో ఎవరో అతనికి గురూరమ్మ గురించి చెప్పి ఆమె వద్దకు పంపారు. ఆ బ్రాహ్మణుడు గురూరమ్మ వున్న వూళ్ళోని ఆమె ఇంటికి వెళ్ళాడు కడుపునొప్పితో దేహం బక్కచిక్కి బలహీనంగా వున్న ఆ బ్రాహ్మణుని చూసి గురూరమ్మ, అతను ఆకలితో వున్నాడని భావించింది. గురూరమ్మ, బ్రాహ్మణుడు తినడానికి ఆహారము పెట్టింది.
ఆ బ్రాహ్మణుడు “అమ్మా, నేను చాలాకాలంగా కడుపునొప్పితో భాధపడుతున్నాను. దానివల్ల
నేను ఏమీ తినలేకపోతున్నాను.” నా కడుపునొప్పి తగ్గే మార్గం చెప్పండని ప్రాధేయపడ్డాడు. గురూరమ్మకి, బ్రాహ్మణునికి సంభాషణ జరుగుతుండగా కృష్ణుడు, గురూరమ్మ సమీపమున అదృశ్యంగా నిలబడి వున్నాడు. ఆ విషయం గురూరమ్మకు తెలుసు.
కాని గురూరమ్మ కృష్ణునికి ఆ బ్రాహ్మణుని గురించి ఏమీ చెప్పలేదు. కడుపునొప్పి పోవడానికి మార్గం ఏమిటి అని అడగలేదు. గురూరమ్మ, బ్రాహ్మణునితో “నాయనా! “ఓం రామాయనమః” అనే రామ తారక మంత్రాన్ని జపం చేయి. నీ కడుపునొప్పి నిన్ను వదలి పోతుంది. ఇప్పుడే నీవు రామనామ జపం చేయడం ఆరభించు. ఏ మాత్రం సందేహించకు. అని చెప్పింది గురూరమ్మ.
ఆ బ్రాహ్మణుడు గురూరమ్మకి వందనం చేసి అప్పుడే జపం చేయడం ఆరంభించాడు. జపం ఆరంభించగానే, అతని కడుపునొప్పి తగ్గడం ఆరంభమైనది. ఆ విషయం గురూరమ్మకి చెప్పాడు.
వెంటనే గురూరమ్మ, ‘నీవు ప్రక్కనే వున్న పుష్కరిణిలో శ్రీకృష్ణుని నామం జపిస్తూ స్నానం చేసి రమ్మని చెప్పింది. ఆ బ్రాహ్మణుడు ఆవిధంగానే చేశాడు. స్నానం చేసి రాగానే, గురూరమ్మ ఆ బ్రాహ్మణునికి రుచికరమైన భోజనం పెట్టింది. కడుపునొప్పితో బాధపడిన ఆ బ్రాహ్మణుడు చాలా రోజులకి తృప్తిగా భోజనం చేశాడు.
భోజనమైన పిదప కూడా “ఓం రాం రామాయ నమః ” అని జపం చేస్తూనే వున్నాడు. కొద్ది సేపటిలోనే కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోయింది. గురూరమ్మకి తన కృతజ్ఞతలు తెలిపి బయలుదేరాడు. నాటినుండి అతను కూడా కృష్ణునికి భక్తుడైనాడు. సమయం దొరికినప్పుడల్లా నామసంకీర్తన చేస్తూ సత్సంగాలకి వెళ్ళేవాడు.
ఒకనాడు ఆ బ్రాహ్మణుడు బిల్వమంగళస్వామిని కలుసుకున్నాడు.
బిల్వమంగళ స్వామికి, తాను గురూరమ్మని కలుసుకోవడం, శ్రీరామ నామ జపం వలన తనకి కడుపునొప్పి తగ్గడం మొదలైన విషయాలు చెప్పాడు. అది విన్న బిల్వమంగళస్వామి విస్తుపోయాడు. కృష్ణభక్తుడైన తనవల్ల కాని పని ఒక స్త్రీ వలన జరగడం ఆశ్చర్యం కలిగించింది.
మరునాడు తన పూజలో కృష్ణుని పూజించినప్పుడు కృష్ణుడు దర్శనమిచ్చాడు. అప్పుడు బిల్వమంగళస్వామి, “కృష్ణా.. నేను ఆ బ్రాహ్మణుని గురించి నీకు చెప్పినప్పుడు నీవు నాకు రామ మంత్రం గురించి ఎందుకు చెప్పలేదు? అని నిష్టూరంగా అడిగాడు.
దానికి కృష్ణుడు చిరునవ్వుతో, “నువ్వు , ఆ బ్రాహ్మణుని కడుపునొప్పి గురించి నాతో చెప్పావు. నేను ఆ బ్రాహ్మణుని పూర్వజన్మ పాపం కారణంగా కడుపునెప్పితో వేదనపడుతున్నాడు. అది అతని
ప్రారబ్ధకర్మ అన్నాను.
భగవన్నామస్మరణ అన్ని సమస్యలను తీరుస్తుంది అన్న సంగతి నీకు తెలుసు. కానీ నీవు బ్రాహ్మణునికి చెప్పలేకపోయావు. కానీ, ఆ గురూరమ్మ భగవంతుని మీద వున్న పరిపూర్ణ విశ్వాసంతో రామనామ జపం చేయమని సూచించింది. నీకు ఆవిధమైన నమ్మకం లేదు. అందుకే బ్రాహ్మణునికి నీవు ఏ సలహా ఇవ్వలేదు. అందుకే నేను నీకు ఆనాడు భగవన్నామస్మరణ గురించి తెలుపలేదు అన్నాడు.
భక్తిలో వున్న తరతమ భేదం గురించి కృష్ణుని నోటితోనే విన్న బిల్వమంగళస్వామి, తను నిలబడిన చోటు నుండే గురూరమ్మకు తన మనసులో వందనాలు సమర్పించాడు.

– శేషశ్రీ
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

Leave a Reply