ప్రసాదం తినేముందు అలా చేయకూడదు

మనకు ఆలయాలలో అర్చకస్వాములు ప్రసాద వితరణ చేసినప్పుడు, అక్కడున్న వ్యక్తులు లేదా స్వాములు ఒక ఆజ్ఞాపన చేస్తారు, అదేంటంటే….. “ప్రసాదం తినేటప్పుడు, చేయి నోటికి తగలకుండా తినాలి… ప్రసాదం నేరుగా నోట్లో వేసుకోవాలి” అని, చాలా చోట్ల మన మిది వింటూనే ఉన్నాము …ఆచరిస్తూ కూడా ఉండుంటాము, పైగా ఇది కేవలం ఆలయాలలో , మఠాలలో, ఇళ్లలో మాత్రమే చూస్తాము… అసలు ప్రసాదం స్వీకరించేటప్పుడు చేతులు నోటికి ఎందుకు తగలకూడదు?
నివృత్తి :
వైదికమైన ఆలయాల్లో కొలువై ఉన్న భగవంతుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే.. ముందుగా మనకీ భావన ఎంతో అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అర్చక స్వాములు భగవంతునికి ఒక తల్లి లా ఉంటూ ఆయన పోషణ కోసం వివిధ రకాలైన వంటకాలని తయారు చేసి నివేదన చేస్తుంటారు. ఆ పదార్ధాలని స్వామి స్వీకరించి మనకి తిరిగి అనుగ్రహిస్తాడు. అది శేషప్రసాదంగా మారుతుంది.
ఆయన దయని, జ్ఞానాన్ని, శక్తిని ఆ ప్రసాదం ద్వారా మనకి అందిస్తాడు. ప్రపన్నులు అయిన శ్రీ వైష్ణవులు కేవలం భగవద్ శేషమే ఆహారం గా స్వీకరిస్తారు …అందిన ప్రసాదం భగవద్ శేషము.
అప్పుడు ఆ ప్రసాదాన్ని అలాగే చేతుల్లోకి తీసుకుని నోట్లో వేసుకోవాలి. మన చేయి నోటికి తగలకూడదు. చేయి నోటికి తగిలితే ఆ చేయి మళ్ళీ పాత్రలో ఉండే ప్రసాదాన్ని తాకితే అది… భగవద్ శేషం కాకుండా….మన శేషంగా మారిపోతుంది. ఆ తరువాత తీసుకునేదంతా మన శేష ప్రసాదమే..
ఎన్నో హేయ గుణాలు కలిగిన వారం అవ్వడం వల్ల మనం ముందు స్వీకరించిన ప్రసాదం కూడా ఏ ప్రభావము చూపకుండా, నిష్ప్రయోజనం గా మారుతుంది.(మందు వేసుకున్న తరువాత విషం స్వీకరించినట్టే).
ప్రతీ రోజు ప్రసాదాలు స్వీకరించినా మార్పు లేదు అనుకుంటుంటే ముందుగా మనం తినేది నిత్య సంసారీ అయిన, ఎన్నో కష్టాలలో ఉంటున్న, అన్ని దుర్గుణాలు కలిగిన మన శేషమే కాబట్టి నిష్ప్రయోజనం… పాపం.. మనం ఉన్న పరిస్థితులలోనుంచి ఉద్ధరింపబడటం అసాధ్యం. అదే సకల కల్యాణ గుణాలు కలిగిన భగవంతుని శేష ప్రసాదం ఆయన అనుగ్రహించిన విధంగానే స్వీకరిస్తే ఆత్మోద్ధరణకి హేతువవుతుంది. సరైన పద్ధతిలో తీసుకుంటే అది ఎంతో విశేష ప్రభావాన్ని చూపుతుంది.
అందుకని పెద్దలు, స్వామి యొక్క దివ్య మంగళ రూపాన్ని, ఆయన కల్యాణ గుణాలని ధ్యానిస్తూ ఆయన దయా రూపమైన ప్రసాదం స్వీకరిస్తే మంచి మార్పు ఆత్మ గుణ వృద్ధి అవుతుందని చెప్పారు.
అందుకనే ప్రసాద విషయంలో ఎంతో ముఖ్యమైన విశేషమైన ఈ నియమాన్ని పెట్టారు మన పూర్వాచార్యులు. ఇక ముందు ప్రసాదం స్వీకరించేటప్పుడు సరైన పద్ధతిలో తీసుకుంటే ఎన్నో విశేష మార్పులని మనకి మనమే చూడవచ్చు.
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

Leave a Reply