Suryaa.co.in

Devotional

తులసి పూజ ఎలా చేయాలి? తులసి దళాలను మహిళలు కోయకూడదా?

తులసి – స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు మన సనాతన ధర్మంలో. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు.
మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టటం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలది. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి పత్రాలు అమృతముతో సమానము
అనన్యదర్శనాః ప్రాతః మే పశ్యంతి తపోధన
జగత్త్రితయ తీర్థాని తైర్దృష్టాని న సంశయః
ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది.
తులసిచెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్యమునిస్తుంది.

తులసి పూజ ఎలా చేయాలి?

తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి.
తులసి వనమున్న గృహము పుణ్య తీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.
ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.
నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!
నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!
ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్
అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం
అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.
తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే
అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.
పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః – పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.
తులసి చెట్టు నుండి దళాలను మంగళ , శుక్ర , ఆది వారములలో, ద్వాదశి , అమావాస్య , పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు . ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది.
తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి.
సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథి,వారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. “స్నానము చేయకుండా మరియు పాద రక్షలు ధరించి” తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది.

తులసి దళాలను ఎలా తెంపాలి?

తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను త్రెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసీ మంజరులు ( అంతే తులసికి వచ్చే పుష్పాలు ) అత్యంత శ్రేష్ఠమని , ఈ మంజరులను కోసేటప్పుడు వాటితోపాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది.
తులసిమొక్కకు ఎదురుగా నిలబడి, రెండు చేతులు జోడించి, కింది మత్రాన్ని చదువుతూ పూజా భావంతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను త్రెంపాలి. దీనివలన పూజాఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం చెప్పింది.
మాతస్తులసి గోవింద హృదయానందకారిణి
నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే
తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియా
చినోమి కేశ్వస్యార్థే వరదా భవ శోభనే
త్వదంగసంభవైః పత్రై పూజయమి యథా హరిం తథా కురు కురు పవిత్రాంగి! కలౌ మలవినాశిని!(ఆహ్నిక సూత్రావళి)
శ్రీ హరికి ఆనందాన్ని కలిగించే తులసీ మాతా ! నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతమునుండి జన్మించిన , ఎల్లప్పుడు శ్రీహరికి ప్రియమైన తులసీమాతా ! ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను త్రెంపుతున్నాను. నాకు అభయమునివ్వు శుభకరీ! నీ శరీరమునుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లీ! నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయుము.
పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని “అచ్యుతానంతగోవింద” అని స్మరిస్తూ నోట్లో వేసుకొని తినాలి. ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసిదళాన్ని సేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి, రాబోయే రోగాలు నిరోధించబడుతాయి.

తులసి

తులసిని స్త్రీ కోయరాదు. పురుషుడే కోయాలి. పూజ మాత్రం ఇరువురూ చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు.
ఆధ్యాత్మిక పరంగా ,ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలననే తులసి భూలోక కల్ప వృక్షం గా దేవతా వృక్షంగా పేరు పొందింది. భగవంతుని పూజకు తులసి అతి ప్రసస్తము .తులసి గా శ్రీ మహాలక్ష్మి ఏ స్వయముగా అవతరించినట్లు పురాణములు చెబుతున్నాయి .తులసి విష్ణువు ప్రియురాలు కనుక విష్ణువును తులసి దళాలతో పూజించేటప్పుడు పాదాల వద్దనే తులసి దళాలను వుంచవలెను .
పవిత్ర దినములలో తులసి కోయరాదు. , గోళ్ళతో తుంచ రాదు .సూర్యాస్తమయము తర్వాత తులసి కోయరాదు . మిట్ట మద్యాహ్న్నం ,అర్ధ రాత్రి వేల లో గాని తులసిని త్రుంచ రాదు . ఒకవేళ అలా చేస్తే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి .
ఎవరి గృహములో తులసి మొక్క వుంటుందో , వారి గృహం తీర్ధ స్వరూపముగా వుంటుంది. తులసి దళా ల తో శివ కేశవులను పూజించిన వానికి మరల జన్మ ఉండదు, ముక్తిని పొందుతాడు. నర్మదా నదిని చూడడం, గంగా స్నానము చేయడం,తులసి వనాన్ని సేవిచడం ఈ మూడు సమాన ఫలములను ఇస్తాయి .ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక సుద్ధ పౌర్ణమి వరకు చాత్రుమాస దీక్ష కావున ఈ సమయములో తులసి మొక్కను చోటు మార్చి పాత రాదు.
తులసి సన్నిదానము నందు విష్ణుమూర్తి ఏకాంతముగా ఉండును కనుక స్త్రీలు దళములు కోయరాదు. పురుషులు మాత్రమే కోయవలెను. తులసి ఆకును కోసిన లగాయతు ఒక సంవత్సరము, మారేడు మూడు తామర పూలు ఏడు రోజుల వరకు పూజకు పనిచేస్తాయి .తులసి మాల ఎక్కువుగా రాముడికి , కృష్ణుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది . బుద్ధిని , మనస్సును ప్రశాంతముగా ఉంచుటకు ఈ మాల ఎంతో ఉపయోగాదాయకం. తులసి మాలను ధరించడం వలన సర్వ పాపాలు నసిస్తాయి.
తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ తులసి చెట్టుమీదా అధికంగా పసుపు, కుంకుమ , అక్షతలు వేయడం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసిచెట్టు ఎక్కువకాలం నిలువదు. కనుక పసుపు, కుంకుమ, అక్షతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదటిలో కాక , తులసి కోట మొదటిలో వేయడం ఉత్తమం.
స్త్రీలు ఎన్నడూ తులసీ దళాలను కోయరాదు. పురుషులచేతనే కోయించాలి. ఆపురుషులు కూడా బహుళ పక్షంలోని అష్టమీ, చతుర్దశీ, అమావాస్యా తిథులలో గానీ – పౌర్ణమినాడుగానీ ఉభయ పక్షాలలో ఏకాదశీ,ద్వాదశీ తిథులలో గానీ ఆది,మంగళ,శుక్రవారాలలో గానీ అస్సలు కోయకూడదు. ద్వాదశినాడు తులసిని తాకకూడదు. తులసీ దళాలను ఒడిలోకి కోయకూడదు. ఆకులోకి కానీ, ఏదైనా పళ్లెంలోకి కానీ కోయాలి. తులసీ దళాలను ఒట్టి నేలమీద ఉంచకూడదు.
గమనిక; తులసి మొక్క శ్వాస కోరకు ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క కనుక ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కను పెంచండి. ఉభయ సంధ్యలలోను పూజ చేయండి.

LEAVE A RESPONSE