Suryaa.co.in

Features National

సమతాస్ఫూర్తి.. ఈ దివ్యమూర్తి

– 216 అడుగుల ఎత్తున రామానుజాచార్యుల విగ్రహం
– ఫిబ్రవరి 5న ఆవిష్కరణకు సన్నాహాలు
పంచలోహాలతో ప్రతిష్ఠించిన స్వర్ణశోభిత విగ్రహం.. ప్రపంచానికి సమతాస్ఫూర్తిని చాటిన దివ్యమానవ రూపం.. రామానుజాచార్యుల మూర్తి శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ సమీపంలోని శ్రీరామనగరంలో కొలువుదీరింది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల పంచలోహ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నారు. సమతామూర్తి (స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ)గా పిలిచే ఈ విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇలాంటి మూర్తుల్లో ఇది ప్రపంచంలోనే రెండో ఎత్తయినది. దాదాపు రూ. 1200 కోట్లతో సమతామూర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. చుట్టూ ఉన్న ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా పనులు కొంత ఆలస్యమయ్యాయి. ఈ విగ్రహ ప్రత్యేకతలపై ప్రత్యేక కథనం.
చుట్టూ 108 ఆలయాలు :
విగ్రహం చుట్టూ 108 దివ్యక్షేత్రాల నమూనా ఆలయాలను కృష్ణ శిలలతో నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 108 దివ్యక్షేత్రాలలోని దేవతామూర్తులు వీటిలో కొలువు దీరనున్నారు.
మూడంచెల్లో సాక్షాత్కారం
సమతామూర్తి మొత్తం మూడు అంచెల్లో ఉంటుంది. రామానుజాచార్యులు కూర్చుని ఉన్న రూపంలో సాక్షాత్కరిస్తారు. మొదటి అంచెలో ఆయన కూర్చున్న పీఠం ఉంటుంది. దీన్ని భద్రవేదిగా పిలుస్తారు. ఇది అన్నింటికంటే కింది భాగాన ఉంటుంది. దీని ఎత్తు 54 అడుగులు. దీనిపైకి చేరుకునేందుకు మెట్ల మార్గం ఉంటుంది. ఇందులో మూడు అంతస్తులు ఉంటాయి. రెండో అంచెలో భద్రవేదిపై 108 అడుగుల వెడల్పు, 27 అడుగుల ఎత్తులో పద్మపీఠం ఉంటుంది. దీనికి మూడు వరసల్లో బంగారు వర్ణంలోని పద్మదళాలు ఉంటాయి. పద్మదళాలకు కింది భాగాన పీఠం చుట్టూ 36 ఏనుగుల విగ్రహాలు ఉంటాయి. వీటి తొండాల నుంచి జలాలు జాలువారుతుంటాయి. మూడో అంచెలో పద్మాకార వృత్తంపై రామానూజచార్యుల మూర్తి కొలువుదీరి ఉంటుంది.
త్రిదండి, శ్రీశఠారితో నమస్కరిస్తున్న రూపంలో కనిపిస్తుంది. ఈ మూర్తి ఎత్తు 108 అడుగులు. త్రిదండం ఎత్తు 144 అడుగులు. దాని బరువు 54 టన్నులు.
ప్రత్యేక ఫౌంటెయిన్‌ :
సమతామూర్తి ఎదురుగా ఆహ్లాదకర వాతావరణాన్ని తలపించేలా 36 అడుగుల ఎత్తులో ఫౌంటెయిన్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తోంది.
ఏ భాషలోనైనా క్షేత్ర విశిష్టత:
ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి ఏటా వేలమంది భక్తులు వచ్చే వీలుంది. ఆధునిక సాంకేతికత సాయంతో వివిధ భాషల్లో క్షేత్ర ప్రాశస్త్యాన్ని తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్షేత్ర పరిసరాల్లో సందర్శకులు సెల్ఫ్‌ గైడెడ్‌ టూల్‌ సాయంతో ప్రత్యేక ఇయర్‌ఫోన్లు ఉపయోగించి తమకు నచ్చిన భాషలో ఈ క్షేత్రం గురించి తెలుసుకోవచ్చు.
‘9’ అంకె వచ్చేలా : ఈ క్షేత్రంలోని ప్రతిదీ విశేషమే. ఎక్కడా చూసినా వేటిని లెక్కించినా మొత్తం 9 అంకె వచ్చేలా తీర్చిదిద్దారు. విగ్రహం ఎత్తు 216 అడుగులు ఉండడం, 108 ఆలయాలు.. ఇలా వేటిని కూడినా 9 అంకె వస్తుంది.

LEAVE A RESPONSE