-1,2 తరగతులకు స్మార్ట్ టివీలు
-ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే రద్దు
-వారంలో రెండుసార్లు పాఠశాలలు సందర్శించాలి
-సమన్వయంతో ప్రజలకు సేవలందించాలి
-రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో 3వ తరగతి నుంచి డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 1,2 తరగతులకు స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తామన్నారు. వీటి రక్షణ కోసం ప్రతీ పాఠశాలకు ఒక వాచ్‌మెన్‌ను నియమించడమే కాకుండా, సిసి కెమేరాలను కూడా అమర్చనున్నట్లు వెళ్లడించారు. ఎంపిపి మీసాల విజయలక్ష్మి అధ్యక్షతన ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం జరిగిన గరివిడి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వ్యవసాయం, విద్య, వైద్యారోగ్యం, గృహనిర్మాణం, స్త్రీశిశు సంక్షేమం తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, విద్య, వైద్యారోగ్యం, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఎటువంటి సమస్యనైనా చర్చించి, పరిష్కరించడానికి సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. నాడూ-నేడు కార్యక్రమం ద్వారా దశలవారీగా అన్ని పాఠశాలల్లో మౌలిక, అధునాతన సదుపాయాలను కల్పించడం జరుగుతోందని అన్నారు. సంక్రాంతి పండుగ లోగా రాష్ట్రంలోని సుమారు 5 లక్షలమంది, 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లను అందజేయనున్నట్లు తెలిపారు. ఆంగ్ల మాధ్యమం చాలా అవసరమని, ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమని సభ్యులు అభిప్రాయపడ్డారు. సభ్యుల సూచనల మేరకు ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం కోసం ప్రతీ శనివారం వారం ఒక పీరియడ్‌ను కేటాయించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సర్పంచ్‌లు, ఎంపిటీసీలు వారంలో రెండు రోజులు పాఠశాలలను సందర్శించి, మధ్యాహ్న భోజనం, పారిశుధ్యం, తరగతుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించాలని కోరారు. దీనికోసం అన్ని పాఠశాలల్లో త్వరలో విజిటర్స్ బుక్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలన్న ఉద్దేశంతోనే, అమ్మ ఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రవేశపెట్టారని మంత్రి స్పష్టం చేశారు.
గృహ నిర్మాణ శాఖపై సమీక్షిస్తూ, నిర్మాణం ప్రారంభించని ఇళ్లను రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు. మండలంలో 176 మంది ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదని, మరికొంతమంది గోతులు తవ్వేసి వదిలేశారని అధికారులు తెలిపారు. వీరికి నోటీసులు ఇచ్చి, డిసెంబరు 15 వరకు గడువు ఇవ్వాలని, అప్పటికీ నిర్మాణాన్ని ప్రారంభించకపోతే రద్దు చేయాలని ఆదేశించారు. వారి స్థానంలో అర్హత ఉన్నకొత్త వారికి ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరికీ పోషకాహారం అందించాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు.
పాలు కొరత మళ్లీ తలెత్తకుండా చూడాలని, సంబంధిత అధికారులతో మాట్లాడారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి, ప్రతిపాదిత పనులన్నిటినీ త్వరలో మంజూరు చేస్తామని చెప్పారు. అర్హులందరికీ నేరుగా సంక్షేమ పథకాలను అందించాలన్నది ముఖ్యమంత్రి విధానమని మంత్రి స్పష్టం చేశారు. అర్హులు ఎవరైనా ఏదైనా కారణం వల్ల పథకాలు అందకుండా మిగిలిపోతే, అటువంటి వారికి కూడా ఇప్పించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా, సమన్వయంతో ప్రజలకు సేవలందించాలని మంత్రి కోరారు.
జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, త్వరలో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుందని, పారదర్శకంగా, పకడ్డంధీగా నిర్వహించాలని కోరారు. ఈ ప్రక్రియపై ముందుగానే రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సభ్యుల కోరిక మేరకు మొక్కజొన్న పంటకు కూడా అవసరమైన ఎరువులను వెంటనే సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు అందరికీ అందేలా చూడాలన్నారు. ఒక సచివాలయం పరిధిలో రెండు గ్రామాలు ఉంటే, ఒక విడత ఒక గ్రామానికి, రెండో విడత రెండో గ్రామానికి వెళ్లి వైద్య సేవలను అందించాలని ఛైర్మన్ సూచించారు.
ఈ సర్వసభ్య సమావేశంలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్‌డిఓ ఎం.అప్పారావు, డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణ చక్రవర్తి, డిఇఓ కె.వెంకటేశ్వర్రావు, ఆర్‌విఎం పీవో డాక్టర్ స్వామినాయుడు, ఎపిఎంఐపి పిడి పిఎన్‌వి లక్ష్మీనారాయణ, పశు సంవర్థకశాఖాధికారి డాక్టర్ వైవి రమణ, డిపిఓ నిర్మలాదేవి, డిప్యుటీ సిఈఓ కె.రాజ్‌కుమార్, జెడ్‌పిటిసి వాకాడ శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ధన్నాన జనార్ధన్, తాశీల్దార్ తాడ్డి గోవింద, ఎంపిడిఓ గొర్లె భాస్కరరావు, సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.