వైకల్యం కేవలం శరీరానికి మాత్రమే: చంద్రబాబు నాయుడు

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగుల్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సత్కరించారు. కేక్ కట్ చేశారు.
వైకల్యం కేవలం శరీరానికి మాత్రమేనని, దివ్యాంగులు తలచుకుంటే అన్నీ ఉన్నవారికంటే ఎక్కువే చేయగలరని ఎంతో మంది నిరూపించారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రెండు సార్లు ఐఏఎస్ క్వాలిఫై అయ్యి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి.. CSB IAS అకాడమీ ఏర్పాటు చేసిన మల్లవరపు బాలలతను సత్కరించారు. దివ్యాంగులు అంటే విధివంచితులు అనే భావనకు సవాల్ విసురుతూ.. బాల లత పోరాటాన్ని అభినందించారు. ఉద్యోగం చేస్తే ఒక్కరం మాత్రమే బాగుపడతామనే ఉద్దేశ్యంతో.. ఉద్యోగానికి రాజీనామా చేసి వందలాది మంది ఐఏఎస్ లను తయారు చేయడం గర్వకారణమన్నారు. తెలుగుదేశం ప్రారంభం నుండి ఎన్టీఆర్ వెన్నంటే ఉంటూ.. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీతోనే ఉన్న గోనుగుండ్ల కోటేశ్వరరావు నిబద్దత అనిర్వచనీయమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దివ్యాంగుడైనప్పటికీ రాష్ట్రమంతా నాతో కలిసి పర్యటించారన్నారు.
దివ్యాంగుల పట్ల ప్రభుత్వాలు గానీ.. ప్రజలు గానీ చూపించాల్సింది జాలి కాదని, కేవలం ప్రోత్సాహం మాత్రమేనని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. దివ్యాంగులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా నిలిచింది. నిలుస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఐదేళ్లలో 15వేల మందికి స్వయం ఉపాధి కోసం రూ.2లక్షల చొప్పున రుణాలిచ్చాం. ట్రై సైకిల్స్, స్కూటర్స్ అందించాం. ప్రోత్సహించి.. వ్యాపారస్తులుగా ఎదిగేలా చేశాం. రూ.500 ఉన్న పెన్షన్ రూ.3000 చేశాం. జీవో నెం.188 తీసుకొచ్చి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాం. ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాం. సంక్షేమ పథకాల్లో 3% రిజర్వేషన్లు కల్పించాం.
అమరావతి నిర్మాణంలో కూడా దివ్యాంగులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. రోడ్లు, ర్యాంపులు, రోడ్ క్రాసింగ్ సమయంలో సదుపాయాలు ఏర్పాటు చేశాం. వైకల్యం అనేది అభివృద్ధికి అడ్డం కాదు, కాకూడదు అనేలా ప్రోత్సహించాం. అదే సమయంలో వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి నాయకుల్ని చేస్తాం.
జగన్ పాలనలో దివ్యాంగులకు ఒరిగిందేమిటి.?
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. చివరికి దివ్యాంగులపట్ల కూడా వివక్ష చూపిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన కార్పొరేషన్ రుణాలు, ట్రై సైకిళ్ళ పంపిణీ, స్కూటర్ల పంపిణీ వంటి అన్ని రకాల పథకాలను రద్దు చేశారు. కరెంటు బిల్లుల్ని, ఫోన్ బిల్లుల్ని చూపించి పెన్షన్లు కోత కోస్తున్నారు. జగన్ రెడ్డికి చేతనైతే.. రూ.3000 ఉన్న పెన్షన్ రూ.5000 చేయాలి.
నేను స్కూటర్లు ఇచ్చా.. చేతనైతే కార్లు ఇవ్వు. పెళ్లి కానుకగా నేను లక్ష ఇచ్చా.. నీకు చేతనైతే రూ.2లక్షలివ్వు. అంతే గానీ పతకాల్లో కోతలు కోస్తాం, వేధిస్తాం అంటే ఊరుకునేది లేదు. రెండున్నరేళ్లలో సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. వాలంటీర్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓటీఎస్ పేరుతో పెన్షన్లు రద్దు చేస్తున్నారు. బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ.. చివరికి కాల్ మనీ వ్యాపారానికి తెరలేపారు. నా ఇంటికి రిజిస్ట్రేషన్ పేరుతో నువ్వు డబ్బులు వసూల్ చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమ వేదిక నుండి జగన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. పోలీసులు, అధికారం ఈ రోజు మీ చేతుల్లో ఉండచ్చు.దాన్ని ఉపయోగించి వేధింపులకు పాల్పడొచ్చు. కానీ.. రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, దానికి ఎవరైనా తలొంచాల్సిందే అనే విషయం మరిచిపోవద్దు. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే. వచ్చిన వెంటనే కమిషన్ వేసి.. తప్పు చేసిన ఏ అధికారినీ వదలను. ప్రత్యేకంగా కొంత మంది పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. వారంతా గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రకరకాలుగా వేధిస్తున్నారు. ఆర్ధికంగా, సామాజికంగా, భౌతికంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు.
గతంలో నేను ఇచ్చిన విజన్ 2020 ఎలా ఉందో హైదరాబాద్ చూస్తే తెలుస్తుంది. అదే విధంగా నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉంటూ.. విజన్ 2029 ప్రకటించాను. జగన్ రెడ్డి దాన్ని నాశనం చేశాడు. పేదలకు అన్నం పెట్టే పథకాలను కూడా రద్దు చేశారు. నవరత్నాల పేరుతో నవమోసాలకు తెగబడ్డారు. మోసపోయిన ప్రజలు ఈ శని పోవాలంటూ ఈ రోజు నవగ్రహాలకు పూజలు చేయాల్సి వస్తోంది. ఎవరినైనా శాశ్వతంగా మోసం చేయడం కష్టమని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. దానికి ఈ దివ్యాంగ దినోత్సవం రోజు సమర శంఖం పూరిస్తున్నాం.
దివ్యాంగులు నాయకులుగా ఎదగాలి..
దివ్యాంగులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో రాణించగలం. దేశంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక విభాగం ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని గర్వంగా చెబుతున్నాను. ప్రతి ఒక్కరికీ అవసరమైన శిక్షణ ఇప్పిస్తా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాయకుడు కావాలి. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుడుగా ఎదగాలి. తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీని త్వరలోనే ప్రకటిస్తాను. రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా సునీల్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా గోనుగుండ్ల కోటేశ్వరరావును నియమిస్తున్నా. మరో పది రోజుల్లో పార్లమెంట్ నియోజకవర్గం నుండి.. గ్రామ స్థాయి కమిటీ వరకు అన్ని కమిటీలను నియమిస్తానని ప్రకటించారు. ఐఏఎస్ శిక్షణ ఇస్తున్న బాల లత గారితో రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
చట్ట సభల్లో దివ్యాంగులకు అవకాశం :
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక.. తప్పనిసరిగా దివ్యాంగుల్ని చట్ట సభల్లోకి తీసుకెళ్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అదే సమయంలో స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయకత్వ లక్షణాలు, ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉన్నవారికి తగు రీతిలో సత్కరించేందుకు తెలుగుదేశం ఎప్పుడూ ముందుంటందన్నారు.
సభలో దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోనుగుండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులతో హైదరాబాద్ లో 10 వేల మందితో సభ నిర్వహించింది. చంద్రబాబు అంటే.. హైదరాబాద్ నగరం, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ పరిశ్రమలు గుర్తొస్తాయి. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు కనిపిస్తాయి. కానీ.. జగన్ రెడ్డి గురించి మాట్లాడితే.. చంచల్ గూడ జైలు, నాసిరకం మద్యం, దాడులు, రక్తపాతం తప్ప ఇంకేవీ గుర్తు రావడం లేదు. రెండున్నరేళ్లలో దివ్యాంగులను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా.. దివ్యాంగులు ధైర్యంగా వెళ్లి కలిసేవారు.
నేడు మంత్రులకే దిక్కులేదు. ప్రజల సంగతి సరే సరి. విశాఖపట్నం నుండి సంతోష్ అనే దివ్యాంగుడు జగన్ రెడ్డిని కలుద్దామని తాడేపల్లి వచ్చి 15 రోజులు తిరిగి తిరిగి.. విసిగిపోయినా అపాయింట్ మెంట్ దొరక్క చివరికి మీడియా ముందుకెళ్లి సమస్య చెప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరికోసం ఉన్నారో, ఎవరికి ముఖ్యమంత్రో అర్ధం కావడం లేదు. జగన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో.. దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు తప్ప సాధించిందేమీ లేదు. దివ్యాంగులమని కూడా చూడకుండా దాడులు చేయించారు. దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పెన్షన్లు తీసేశారు. మేం జగన్ రెడ్డిని ఏమీ చేయలేకపోవచ్చు.. కానీ.. దేవుడు చూస్తూ ఊరుకోడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ట్రైసైకిళ్లు, స్కూటర్లకు రంగులు మార్చాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. వాటి రంగులు మార్చమంటే.. జగన్ రెడ్డి మొహం రంగు మార్చడం తధ్యమని హెచ్చరించారు.
తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. ప్రతి ఒక్క దివ్యాంగుడికీ పెన్షన్ ఇస్తాం. వాహనాలు అందిస్తాం. స్వయం సమృద్ధి రుణాలు అందించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ వేధికగా.. మా దేవుడు నారా చంద్రబాబు నాయుడిని, మా దేవత నారా భువనేశ్వరి గారిని అవమానించిన ఏ ఒక్కరినీ వదిలేది లేదన్నారు. దేవత లాంటి భువనేశ్వరి గారిని మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానించడం పట్ల ప్రసంగిస్తూనే ఆవేదనకు గురయ్యారు. చట్ట సభ సాక్షిగా అవమానించిన ఏ ఒక్కరినీ ఒదిలేది లేదన్నారు. తిరుమల వెంకన్న సాక్షిగా.. బెజవాడ దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నాం.. భువనేశ్వరి గారిని అవమానించిన వారు తగిన శాస్తి అనుభవించక తప్పదన్నారు.
కుంటి, గుడ్డి అంటూ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. విభిన్న ప్రతిభావంతుల్ని అవమానించేలా మాట్లాడిన మంత్రి క్షమాపణలు చెప్పకుంటే త్వరలేనే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏ దివ్యాంగుడినైనా అవమానించేలా మాట్లాడితే మంత్రి నాలుక కోస్తామన్నారు.
బాల లత మాట్లాడుతూ.. రెండుసార్లు సివిల్స్ సాధించడానిక చంద్రబాబు నాయుడు ఆదర్శమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి గమనిస్తున్నానని, చిన్న గ్రామం నుండి వచ్చి.. ప్రపంచ స్థాయికి ఎదిగారన్నారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల కంటే దివ్యాంగులు ఎక్కువ అవస్థలు ఎదుర్కొన్నారని, అయినా ఏ ప్రభుత్వమూ వారికి అండగా నిలవలేదు. 2016లో పార్లమెంటులో దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు.
కానీ.. ఆ సభలో ఒక్క దివ్యాంగుడు కూడా లేకపోవడం బాధాకరం అన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి చూపిస్తే.. దివ్యాంగుడి సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. ప్రభుత్వాలు.. ప్రజా సమస్యలు పరిష్కరించేవిగా ఉండాలే తప్ప సమస్యలు సృష్టించకూడదన్నారు. తెలుగుదేశం పార్టీ దివ్యాంగులకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని మరువలేమని కొనియాడారు.

Leave a Reply