కడప వాళ్లకు సీటిస్తే ఓడించి తీరతా

– అవసరమైతే నేనే పోటీ చేస్తా
– నా ఫ్యామిలీకి రెండు సీట్లు కావాలని అడిగా
– నేను పోటీలోకి దిగితే వీళ్లు ఎవరూ పనికి రారు
– నా సీటు వేరే ఎవరికో ఇస్తానంటే చూస్తూ ఊరుకోం
– పుత్తా సుధాకర్‌యాదవ్ కొడుకు పోటీకి రాయపాటి రెడ్‌సిగ్నల్
– టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు
– టీడీపీ హైకమాండ్‌కు రాయపాటి హెచ్చరికలపై పార్టీలో చర్చ

టీటీడీ మాజీ చైర్మన్ పుత్తా సుధాకర్ యాదవ్ తనయుడు నర్సరావుపేట టీడీపీ ఎంపీగా పోటీ చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో, టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ నాయకత్వానికి షాక్ హెచ్చరించారు. కడప వాళ్లకు టికెట్ ఇస్తే ఓడిస్తామని హైకమాండ్‌ను హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది. రాయపాటి వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

నరసరావుపేట ఎంపీ సీటును కడప వాళ్లకిస్తే ఓడిస్తామని, తమ వర్గం సహకరించదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. తాడికొండ నియోజకవర్గ తెదేపా నేత తోకల రాజవర్ధన్‌రావు ఆధ్వర్యంలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను గుంటూరు అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించారు. తొలుత మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్‌ ఇంటి నుంచి బండ్లమూడి గార్డెన్స్‌లో వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ 40 కిలోల కేకు కోశారు.

ఈ సందర్భంగా రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ… ‘వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయాలనుకోవడం లేదు. మా కుటుంబం నుంచి (మా అబ్బాయి, అమ్మాయికి) రెండు అసెంబ్లీ సీట్లు కావాలని గతంలోనే చంద్రబాబును అడిగాం. తాడికొండ సీటును తోకల రాజవర్ధన్‌రావుకు ఇవ్వాలి. ఆయన అక్కడ గెలుస్తారు. నరసరావుపేట ఎంపీ సీటు కడపోళ్లకు ఇస్తే ఓడించి తీరతాం. అవసరమైతే నేనే ఎంపీగా పోటీ చేస్తా. నేను పోటీలోకి దిగితే వీళ్లు ఎవరూ పనికి రారు. నా సీటు వేరే ఎవరికో ఇస్తానంటే చూస్తూ ఊరుకోం’ అని రాయపాటి స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌తో పొత్తు ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు.

Leave a Reply