వైసీపీకి ఉండవల్లి ‘అరుణా’రుణ వందనాలు!

– సీఎం సీటు పవన్‌కే అప్పగించాలట
– చంద్రబాబు తగ్గాల్సిందేనట
– లేకపోతే జగన్ టీడీపీని భూ స్థాపితం చేసేస్తారట
– ఇంతకూ ఉండవవల్లి ఉపదేశమేమిటి?
– మిత్రుడి కొడుకు జగనన్నకు అరుణన్న ఉడతసాయం
– ఉండవల్లి మేధోత్యాగం ఎవరికోసం?
( మార్తి సుబ్రహ్మణ్యం)

హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభ, లక్డీకాపూల్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమాలకు, కొందరు పర్మినెంట్ గెస్టు ఆర్టిస్టులు కనిపించేవారు. జయంతి-వర్ధంతి-నృత్య, నాటిక-సన్మాన కార్యక్రమాలకు వారే ఆస్ధాన అతిథులన్నమాట.

అంటే సభాసామ్రాట్ భాస్కరరావు, సినారె, దైవజ్ఞశర్మ, కళాదీక్షితులు, ఇంకా ఒకరిద్దరు వేదికపై తరచూ కనిపించేవారు. వీరంతా న గరంలో ‘సాంస్కృతిక పెద్ద మనుషుల’ కింద లెక్క. ఇందులో వీఐపీలకు జాతకాలు చెప్పే ఒకాయనను, వేదికపై ఎవరూ పిలవరు. కానీ పేపర్లలో రోజూ వచ్చే ‘నగరంలో నేడు’ కార్యక్రమాలు చూసి, ఆయనే ఓ గంట ముందు అక్కడికి వెళతారు. సరే.. ఎలాగూ పెద్ద ముత్తయిదువ కదా అన్న గౌరవంతో, ఆయనను కూడా వేదికపై పిలుస్తుంటారు. అంటే అదో బలవంతపు బ్రాహ్మణార్ధం అన్నమాట!

ఇది చాలామందికి తెలిసిన బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అలాంటి ముత్తయిదువలు బయలుదేరారు. కాకపోతే ఈ ‘రాజకీయ పెద్దముత్తయిదువ’లను ఎవరూ పిలవరు. ఎందుకంటే అవుట్‌డేటెడ్ కాబట్టి. ప్రతి మందుకూ ఎక్సపయిరీ డేట్ ఉన్నట్లే.. రాజకీయనేతలకూ ఎక్సపయిరీ డేట్ ఉంటుంది. కాకపోతే దానిని వారు గుర్తించరు. ఒకవేళ గుర్తించినా, ఇంకా తాము పనిచేసే సరుకనుకుంటారు. దానితో తమకున్న పాత హోదాతో, రాజకీయంగా బాగా బతికున్న రోజుల్లో తెచ్చుకున్న పేరును వాడుకుని… వారానికో, నెలకో మీడియా పేరంటం పెట్టి, పిలుస్తుంటారు.

గత ఎనిమిదేళ్లుగా ఆంధ్రా రాజకీయాల్లో అలాంటి రాజకీయ ముత్తయిదువలు, రాజమండ్రి వేదికగా అప్పుడప్పుడు … తాము రాజకీయ వైధవ్యాన్ని కోల్పోయామన్న బాధ దిగమింగుకునేందుకు, జాతినుద్దేశించి ప్రసంగిస్తుంటారు. అవన్నీ .. ‘తాము కూడా రాజకీయంగా బతికే ఉన్నామన్న’ సంకేతాలన్నమాట.

మీడియా కూడా ‘పాతకాపు’ కదా అన్న కోణంలో, వాటికి ప్రాధాన్యం ఇస్తుంటుంది. అందులో కొంత కులం కోణం కూడా ఉంటుంది లెండి. అది వేరే విషయం. మాజీ ఎంపీలు బోలెడుమంది రోజూ ప్రెస్‌మీట్లు పెట్టినా.. ఒక్క ముక్క చూపించని మీడియా, ఇలాంటి రాజకీయ ముత్తయిదువలు మీడియా పేరంటం పెడితే.. దానిని చూపించేందుకు ఎగబడుతుంటాయి. దాని భావమేమి తిరుమలేశా?

తాను రాజకీయాలకు, పార్టీలకు దూరంగా ఉన్నట్లు చెప్పుకునే.. ఆంధ్రా రాజకీయ పెద్ద ముత్తయిదువ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎట్టకేలకూ సగం ముసుగే తొలగించారు. బహుశా ఆ సగం ముసుగు, ఎన్నికల ముందు తొలగిస్తారేమో తెలియదు. ఇప్పటివరకూ ఉండవల్లి అరుణ్‌కుమారంటే, జనం దృష్టిలో మేధావి. నిజాయితీ పరుడు. పేపరు చూడకుండా లెక్కలు చెప్పగల ఘనాపాఠీ. లా పాయింట్లు తీసే, నిస్వార్ధపరుడన్న పేరు. అంతలావు మనిషి ఆయన ఒక మాట చెబితే, నిజమే కామోసని జనం నమ్ముతారన్న ప్రచారం.

కానీ అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు, టీడీపీ-జనసేన పొత్తు విషయంలో ఉండవల్లి భాష్యం చూస్తే, ఈ ‘రాజమండ్రి రాజకీయ పెద్ద ముత్తయిదువ’ మనసంతా.. జగనన్న ఆరాధనా భావంతో నిండిపోయిందని, బుర్ర-బుద్ధీ ఉన్న ఎవరికయినా ఇట్టే అర్ధమయిపోతుంది. తన మిత్రుడి కొడుకును, మరోసారి ముఖ్యమంత్రిగా చూడటమే, ఆయన అసలు లక్ష్యమన్నది తేలిపోయింది. పనిలోపనిగా చంద్రబాబుపై ఆయనకున్న అక్కసునూ, పవన్‌పై ప్రేమరూపంలో వెలిబుచ్చారు. సంతోషం.

అదెలాగంటే.. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే, చంద్రబాబు త్యాగం చేసి పవన్ కల్యాణ్‌ను సీఎం చేయాలట. తనను సీఎంగా ప్రకటించకుండా పవన్, టీడీపీతో పొత్తుకు వెళ్లరట. దానికి చంద్రబాబు ఒప్పుకోకపోతే, పవన్‌కు కొత్తగా పోయేదీమీ లేదట. ఎలాగూ టీడీపీని జగన్ భూస్థాపితం చేస్తారట. కాబట్టి.. ఏతావాతా చంద్రబాబు ఒక అడుగు వెనక్కి తగ్గి, పవన్‌ను సీఎంగా ఒప్పుకోవాలట. లేకపోతే పొత్తులు పుటుక్కుమంటాయన్నది రాజమండ్రి రాజకీయ పెద్ద ముత్తయిదువ చెప్పిన తాజా చిలక జోస్యం.

అంటే.. ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీ-జనసేన పొత్తు కుదరకూడదన్నదే, అరుణన్న కవిహృదయమన్నది కనిపిస్తూనే ఉంది. ఒకవేళ కుదిరినా, పవన్ సీఎం కావాలే తప్ప, చంద్రబాబు కాకూడదనే.. రాజమండ్రి రాజకీయ పెద్ద ముత్తయిదువ కోరిక. అది మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్దమవుతుంది. ఆరకంగా తన మిత్రుడి కొడుకు జగనన్నకు తృణమో, ఫణమో.. తన స్థాయిలో ఉడత సాయం చేయాలన్నది, ఈ ‘రాజమండ్రి రాజకీయ మాజీ ఆసామి’ భావనలా కనిపిస్తోంది.

అందుకాయన ముసుగులేమీ తొడుక్కునే ప్రయత్నాలు కూడా చేయలేదు. తప్పులేదు. దానిని మెచ్చుకుని తీరాల్సిందే. వైఎస్ లేకపోతే తనకు రాజకీయ ఠికాణా లేదన్న నిజం, ఆయనకు తెలుసు. అందుకే తనను ఈ స్థాయికి చేర్చిన తన దివంగత మిత్రుడి కొడుకు జగనన్న, తనను దగ్గరకు రానీయకున్నా.. దూరం నుంచే ఆయనను మనసారా దీవించే, పెద్ద హృదయం ఆయనది. అంత విశాల హృదయం.. జగన్నన దగ్గర పదవులు తీసుకున్న వారికీ ఉండవు మరి! ఈ విషయంలో జగనన్న.. మన రాజమండ్రి అరుణన్నకు రుణపడి తీరాల్సిందే.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పడు.. పోలవరం నుంచి మద్యం రేట్ల వరకూ, అరుణన్న ఒంటికాలిపై లేచేవారు. లిక్కరు రేట్ల లిస్టు తెచ్చి మరీ చదివేవారు. దాని అసలు ఖరీదెంతో లెక్కతేల్చేవారు. కానీ ఇప్పుడు ‘పోలవరం పూర్తి అయిపోయింది కాబట్టి, దాని గురించి మాట్లాడటం లేదు. అధికార వైసీపీ ప్రత్యేక హోదా కోసం.. కేంద్రంతో రాజీ లేని పోరాటం చేస్తుంది కాబట్టి, ఆ అంశం గురించి మాట్లాడటం లేదు. జగనన్న ఢిల్లీ వస్తున్నారంటేనే.. హోదా గురించి ఎక్కడ నిలదీస్తారోనని, మోదీ-అమిత్‌షాలకు ముచ్చెమటలు పడుతున్నాయి. కాబట్టి ఆయన దాని గురించి కూడా మాట్లాడటం లేదు. బహుశా జగనన్న రాజీలేని పోరాటం వల్ల రేపో-మాపో ప్రత్యేక హోదా రావచ్చన్న అంచనా కామోసు!

రాష్ట్రంలో అన్నీ బ్రాండెడ్ మందు కంపెనీలే ఉన్నాయి కాబట్టి, అది కూడా డిజిటిల్ చెల్లింపులతోనే వ్యాపారం జరుగుతున్నందున, వాటి గురించి పెద్దగా మాట్లాడటం లేదు కామోసు. ఎందుకంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మొదటి నుంచీ క్యాష్ కాకుండా, డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి కాబట్టి! ఇక ప్రభుత్వ ఉద్యోగులు-పెన్షనర్లకు ఒకటవ తేదీనే జీతాలు-పెన్షన్లు పడుతున్నందున, ఆయన దాని గురించి కూడా మాట్లాడటం లేదు.

అందుకు కృతజ్ఞతగా ఉద్యోగులంతా జగనన్న ఫొటోలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. జగనన్న సర్కారుకు వెసులుబాటు ఉన్నప్పుడే తమకు జీతాలివ్వమంటూ, ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు గవర్నర్‌కు వినతిపత్రాలు కడ్రా ఇచ్చారాయె! రాష్ట్రంలో రోడ్లు గతుకులు లేకుండా, బాపూ బొమ్మలా వంగి మరీ ముద్దు పెట్టుకునేంత ముద్దొస్తున్నాయి కాబట్టి, వాటి గురించీ మాట్లాడటం లేదు. ఏతావాతా.. ఆంధ్రాలో ధర్మం బాటా కంపెనీ చెప్పులతో, నాలుగుపాదాలా న డుస్తూ.. సమస్యలు లేకుండా సుభిక్షంగా ఉన్నందున, అరుణన్న స్వరపేటిక మునుపటిలా పలకడం లేదన్నది, ఆయన అభిమానుల ఉవాచ.

ఇంతకూ చంద్రన్న కాకుండా, పవనన్న సీఎం అయితే.. ఆయన ఎక్కువకాలం పరిపాలించలేరు. కాబట్టి.. టీడీపీతో విబేధాలొచ్చి సర్కారు కూలిపోయి, మళ్లీ జగనన్న సర్కారు వస్తుందన్న, బుజ్జ బుజ్జి ఆశ అరుణన్నలో లేకపోలేదన్నది ఆయన అభిమానుల విశ్లేషణ. అందుకే ఆ రెండు పార్టీలలో ముందస్తు చిచ్చు పెట్టేందుకే, తన లాయరు బుర్రను వాడారని అరుణన్న అభిమానులు, ఆయన తెలివిని తెగ మెచ్చేసుకుంటున్నారు. ఆ ప్రకారంగా అరుణన్న పాచిక పారితే.. జనసేన-టీడీపీ శ్రేణులు, సోషల్ మీడియాలో కొట్టుకుచస్తే.. అరుణన్న ప్లాన్ వర్కవుటయినట్లే లెక్క.

జనసేనకు రాష్ట్రం మొత్తం పోటీ చేసేంతమంది అభ్యర్ధులు లేరన్నది అరుణన్నకు తెలుసు. టీడీపీకి సొంతగా పోటీ చేసి గెలిచే సత్తా, ఇప్పుడు లేదన్నదీ ఆయనకు ఎరుకే. కాబట్టి పొత్తు ఇద్దరికీ అవసరమన్నదీ తెలుసు. టీడీపీ-జనసేన కలసి పోటీ చేస్తే, వైసీపీ కొంప కొల్లేరు అయేంత పనవుతుందనీ అన్నకు తెలుసు. ఇవన్నీ తెలిసే.. అరుణన్న జనసైనికులను రెచ్చగొట్టేలా, పాచిక వదిలారన్నది ఆయన అభిమానుల విశ్లేషణ. అరుణన్న తెలివిని చూసి జగనన్న అభిమానులు మురిసిముక్కలవుతున్నారట.

‘పాజిటివ్‌లో నెగటివ్.. నెగటివ్‌లో పాజిటివ్’ అనే సూత్రాన్ని మీడియా, పొలిటీషియన్లు కొన్ని సందర్భాల్లో పాటిస్తుంటారు. అంటే సదరు వ్యక్తులు, ఒకరి పట్ల నెగటివ్‌గా మాట్లాడినా, అందులో పాజిటివ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అదే సమయంలో ఒకరిపట్ల పాజిటివ్‌గా మాట్లాడినా, అందులో నెగటివ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొందరు నేతలు తాము చెప్పాల్సిన విషయాన్ని, తనకు సన్నిహితులైన మీడియా వారికి ముందే చెబుతారు. ఆ ప్రశ్నలను వారి ద్వారా అడిగించుకుని, వాటికి సమాధానం ఇస్తుంటారన్న మాట. ఈ రెండింటిలో రాజమండ్రి రాజకీయ పెద్ద ముత్తయిదువ, ఏ టైపో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య.

Leave a Reply