– విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు సీఎం ఆహ్వానం
– వ్యక్తిగత పర్యటనలోనూ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం లండన్ లో వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు వరుస భేటీలు
లండన్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సోమవారం లండన్ లో భేటీ అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా… రాష్ట్రంలో పెట్టుబడులు, విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించడం కోసం లండన్ లోని దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం వరుస భేటీలు నిర్వహించారు.
ఈ సమావేశాల్లో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. పరిశ్రమలు స్థాపించడంతో పాటు.. జీసీసీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతంలో ఏయే రంగాలను అభివృద్ధి చేస్తున్నామనే విషయాన్ని వివరించడంతోపాటు… రాష్ట్రానికి ఆదాయం సమకూర్చి పెట్టి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు స్థాపిస్తే… ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రొత్సహకాలను ముఖ్యమంత్రి వివరించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక పాలసీలను వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అవలంభిస్తున్నామని పారిశ్రామిక వేత్తల దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, ఏవియేషన్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై పారిశ్రామిక వేత్తలతో భేటీల్లో ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
జీసీసీలు ఏర్పాటు చేయండి
పారిశ్రామిక వేత్తలతో జరిపిన వరుస భేటీల్లో భాగంగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్ల్డ్ తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. లండన్ లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు సంస్థగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థకు పేరుంది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని సీఎం ఆహ్వానించారు. అమరావతి, విశాఖలలో కొత్త టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా, నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఏపీలో అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు సీఎం వివరించారు.
160 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ఏపీ లక్ష్యం పెట్టుకుందని తెలిపిన చంద్రబాబు… విద్యుత్ రంగంలో ప్రభుత్వం రూపొందించిన పాలసీలను గురించి తెలిపారు. అలాగే విశాఖలో ఈ నెల 14,15వ తేదీల్లో జరగబోయే భాగస్వామ్య సదస్సుకు ప్రతిపాదనలతో రావాలని ఆక్టోపస్ ఎనర్జీ సంస్థను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అలాగే ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ రోల్స్ రాయస్ గ్రూప్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆ సంస్థ సీటీఓ నిక్కి గ్రేడి స్మిత్‌తో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు.
ఏరో ఇంజిన్స్, డీజిల్ ప్రోపెల్షన్ సిస్టమ్స్ తయారీలో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్ గా రోల్స్ రాయస్ సంస్థకు పేరుంది. ఓర్వకల్లులో మిలటరీ ఎయిర్ స్ట్రిప్, విమానాల మెయింటెనెన్స్ రిపెయిర్స్ ఓవర్ హాలింగ్ (ఎంఆర్ఓ) యూనిట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ ప్రతినిధులకు సీఎం చెప్పారు. ఏపీలో ఏరోస్పేస్ కాంపోనెంట్స్ ఉత్పత్తికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని… ఏపీలో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజానాలను వివరించారు. అలాగే విశాఖ, తిరుపతిలలో జీసీసీ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు కోరారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలోనూ ఏవియేషన్ ఎకోసిస్టం, ఎమ్మార్వో ఫెసిలిటీ ఏర్పాటుకు అవకాశముందని సీఎం వెల్లడించారు.
ఈ వరుస భేటీల్లో భాగంగా స్రామ్, మ్రామ్ గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరనందానీ, శామ్కో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ క్రమంలో సెమీ కండక్టర్స్, అధునిక ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటుకు ఆ గ్రూప్ ఆసక్తి చూపించింది. అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సంస్థలకు సీఎం చంద్రబాబు వివరించారు. ఈ వరుస భేటీల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు