– పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మంగళగిరి: దివంగత ఎన్టీఆర్ పుత్రిక, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధర్మపత్ని, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి రేపు లండన్‌లోని ప్రఖ్యాత గ్లోబల్ కన్వెన్షన్ హాల్లో రెండు ప్రధానమైన అవార్డులు అందుకోనున్నారు. ఈ అరుదైన గౌరవం ప్రతి టీడీపీ కార్యకర్తకూ, తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు ఆయన ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ 2025 ఈ అవార్డును ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థ ప్రదానం చేస్తుందని తెలిపారు.
స్వయంకృషి, నిజాయితీ, ఉన్నతమైన విలువలు, మంచి కార్పొరేట్ గవర్నెన్స్‌తో వ్యాపారం చేసి, అందరికీ మార్గదర్శకంగా నిలిచినందుకు ఈ ఫెలోషిప్ ఇస్తున్నారు. గతంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందుజా గ్రూప్ కో చైర్మన్ గోపిచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్ పర్సన్ రాజశ్రీ బిర్ల, దుబాయ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహ్మద్, గోయెంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయెంకా లాంటి ఎందరో దిగ్గజాలకు ఈ అవార్డులు అందించారని తెలిపారు.
భువనేశ్వరి యాజమాన్య బాధ్యతలు వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డ్ అవార్డు లభిస్తోంది. ఇది ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు దక్కిన గౌరవం. ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ప్రదానం చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక లాభాపేక్ష లేని (నాన్-ప్రాఫిట్) స్వతంత్ర సంస్థ. ఇది 1990లో 35 సంవత్సరాల క్రితం స్థాపించారు. భారతదేశంలో నాణ్యత (క్వాలిటీ), మంచి పాలన (గుడ్ గవర్నెన్స్) విప్లవాన్ని ముందుకు నడిపించడానికి, ‘బ్రాండ్ ఇండియా’ను నిర్మించడానికి కృషి చేసే ఒక పెద్ద అపెక్స్ అసోసియేషన్ ఇది. తొలి రోజుల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య వంటి ప్రముఖులు ఈ సంస్థ ఏర్పాటులో పాలుపంచుకున్నారు.
సాధారణంగా ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వరదలు, ఇతర పనులు ఉన్నప్పటికీ తన ధర్మపత్ని వెంట భర్తగా లండన్ వెళ్లడం గర్వించదగ్గ విషయం. ఆమె గొప్పతనాన్ని, స్వయంకృషిని గుర్తించి ఈ అరుదైన సందర్భంలో తోడుగా ఉండటం ఆయన వ్యక్తిత్వాన్ని, దాంపత్య బంధానికి ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తోంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు లండన్‌లో కూడా ఖాళీగా ఉండకుండా, ఆ సమయాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారు. ఆయన అక్కడ కూడా ఇన్వెస్టర్లను కలిసి అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరడం, వారిని సమావేశపరచడం రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ మొత్తం పర్యటనకు సంబంధించిన ఖర్చులను కూడా ఆయన సొంతంగా భరించారని (ప్రజాధనం వినియోగించలేదని) తెలిపారు.
భువనేశ్వరి వ్యాపార రంగంలో నీతి, నిజాయితీతో కూడిన వ్యాపారాన్ని చేసి సంస్థను అభివృద్ధి పథంలో నడిపించారు. రాజకీయాలలో జోక్యం చేసుకోకపోయినా, గతంలో నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు, ఆమె ధైర్యంగా ‘నిజం గెలవాలి’ అనే నినాదంతో రోడ్డెక్కి మహిళలను చైతన్యపరచడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆమె ఇంగ్లీష్ భాషపై ఉన్న పట్టు, సందర్భోచితంగా మాట్లాడే విధానం అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ రెండు అవార్డుల స్వీకరణ, ఆమె నీతివంతమైన వ్యాపార ప్రయాణానికి, వ్యక్తిత్వానికి లభించిన ఘనమైన గుర్తింపుగా అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆమె భవిష్యత్తులో ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను.
జోగి రమేష్ అమ్మవారి గుడిలో ప్రమాణం చేశారు కాబట్టి ఇక అరెస్టు చేయకూడదా అనే జగన్మోహన్ రెడ్డి వాదన ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇది ప్రజల్లో అనవసర అనుమానాలు రేకెత్తించే కొత్త పద్ధతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగతనం చేసినవాడు కూడా ‘నేను చేయలేదు’ అని ప్రమాణం చేస్తే వదిలేస్తే, పోలీసులు, చట్టాలు, న్యాయస్థానాలు, లాయర్లు, జడ్జీలు ఎందుకు? అని నిలదీశారు. అలాంటప్పుడు, ఊరికో గుడి కట్టుకుని, అందులో ప్రమాణం చేసి నేరస్తులను వదిలేయవచ్చు కదా, ఇక కేసులే అక్కర్లేదు కదా అని వ్యంగ్యంగా అన్నారు.
కోర్టులలో భగవద్గీత మీద ప్రమాణం చేసినంత మాత్రాన అందరూ నిజాలే చెబుతున్నారా అని ప్రశ్నిస్తూ కోర్టుల్లో చేసే ప్రమాణాల ఉద్దేశం వేరు, బయట చేసే రాజకీయ ప్రమాణాల ఉద్దేశం వేరు అని పరోక్షంగా ఆయన అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి, వారి అనుచరులు ఎన్నిసార్లు ప్రమాణాలు చేసి ఉంటారు, మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఈ తరహా ‘ప్రమాణాల పద్ధతి’ సరైంది కాదని, ప్రజలు అలెర్ట్‌గా ఉండాలి అని హెచ్చరించారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి, వారి వాదనలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయని, ఇది సరైంది కాదని తీవ్రంగా విమర్శించారు