విశాఖలో ఏఐ ఆధారిత హౌసింగ్, తయారీ పరిశ్రమల స్థాపనపై సీఎం జగన్ తో కంపెనీ ప్రతినిధుల చర్చలు
సీఎం జగన్‌ను కలిసిన సబ్‌స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ సీఈవో, ఫౌండర్ మన్‌ప్రీత్ ఖైరా
కంపెనీల ఏర్పాటు కోసం ముందుకొచ్చిన ప్రతినిధులను స్వాగతించిన సీఎం జగన్
పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమని, అందుకు ప్రభుత్వం నుంచి కూడా కంపెనీల ప్రతినిధులకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం యూఎస్‌కు చెందిన సబ్‌స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ సీఈవో, ఫౌండర్ మన్‌ప్రీత్ ఖైరా, ఇతర ప్రతినిధులు, ఇండస్ట్రీయల్ మంత్రి అమర్నాథ్, తదితరులు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఐసీ సెజ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరికరాలను ఉత్పత్తి చేసే పరిశ్రమను ఏర్పాటుకు గురించి సబ్‌స్ట్రేట్ ప్రతినిధులు, సీఎం జగన్‌తో చర్చలు జరిపారు. ప్రభుత్వం నుంచి వారికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామన్న సీఎం జగన్ తెలిపారు.
సీఎంతో జరిగిన సమావేశం అనంతరం సబ్‌స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ సీఈవో, ఫౌండర్ మన్‌ప్రీత్ ఖైరా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం చాలా స్పూర్తిదాయకంగా ఉందని, విశాఖలో ఏఐ ఆధారిత హౌసింగ్, ఏఐ ఆధారిత తయారీ పరిశ్రమలకు సంబంధించి తమ ప్రతిపాదనలకు, ఆలోచనలకు పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. అంతేకాదు ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి, విశాఖలో ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటుచేసి స్ధానిక యువతలో ప్రతిభను పెంపొందించేదించుకు అవసరమైన అన్ని చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించామన్నారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సబ్‌స్ట్రేట్ క్యాపిటల్ పార్ట్నర్ సిడ్నీ న్యూటన్, సబ్‌స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డెరెక్టర్ మన్దీప్ ఖైరా, తదితరులు పాల్గొన్నారు.