కొత్త జిల్లాల -రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ నిలిపివేయాల్సిందే

ఇటీవల జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన నూతన జిల్లాల ఏర్పాటుచేసిన తీరు ఎంత మాత్రం సరికాదు.ఇప్పుడున్న పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన (కొద్ది మార్పులతో) నూతనంగా జిల్లాల ఏర్పాటుచేసినట్లుగా కన్పించుతూంది.2026 తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల డిలిమిటేషన్ ప్రక్రియ జరగవలసివుంది.

అందులో కొన్ని సమస్యల పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన ఐతే దక్షిణాది రాష్ట్రాల యం.పి ల సంఖ్య తగ్గి జనాభా నియంత్రణ సరిగా అమలుచేయని ఉత్తరాది రాష్ట్రాల యం.పి ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.అందువలననే జనతా ప్రభుత్వ హయాంలో ఏకగ్రీవంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 82 మరియు 170 లను సవరించి 2001జనాభా సేకరణ వరకు పార్లమెంటు సీట్ల సంఖ్యను కట్టడి చేశారు.తిరిగి 2001 లో 2026 తర్వాత డిలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని పార్లమెంటు చట్టాన్ని చేసింది.

పార్లమెంటు సీట్ల సంఖ్య,రాష్ట్రాల అసెంబ్లీ సంఖ్యలు ,వాటి పరిధిలో పెను మార్పులు,చేర్పులు రానున్న నాలుగేళ్ల తర్వాత జరుగనున్న పరిస్థితులు వుండగా ఇప్పుడే నూతన జిల్లాల,రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు వంటి అనాలోచితమైన చర్య మరొకటుండదు.

ముఖ్యమంత్రి పిచ్చి నిర్ణయాలతో,తుగ్లక్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారి,ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సివుండగా మరింత జటిలపరచడం వలన ఉత్పన్నమైన పరిస్థితుల నుండి ప్రజల దృష్టిని మరలించడానికే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారం వారం కొత్త అప్పుల పైన ఆధారపడిన జగన్ ప్రభుత్వం నూతన జిల్లాల,డివిజన్ల ఏర్పాటు వలన కావాల్సిన అదనపు మౌలిక వసతులకయ్యే ఖర్చులు భరించడం కష్టం.చివరకు అభాసుపాలవ్వకతప్పదు.

అత్యంత అధ్వాన్నంగా వున్న రోడ్ల మరమ్మతుల అంశం,పంటకాల్వలు-డ్రెయిన్ లు,భూసర్వే,విద్యుత్ సరఫరా ,పంచాయతీల నిధులు మున్నగు అంశాలను గాలికి వదిలివేసి అర్ధంతరంగా ఇప్పుడు అవసరంలేని కొత్త జిల్లాల విషయాన్ని తలకెత్తుకోవడం ఎంతమాత్రం క్షమార్హంకాదు.ఇప్పటికైన వివేకముతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు.

వడ్డే శోభనాద్రీశ్వర రావు
(మాజీ యం.పి.)

Leave a Reply