ఎంపీ విజయసాయిరెడ్డి
ఏప్రిల్ 27: ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం లక్ష టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందించేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఈ మేరకు కార్యాచరణ రూపొందించిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఇప్పటికే 48 వేలకు పైగా గృహ ప్రవేశాలు జరిగినట్లు, రెండో విడతలో మరో 40 వేల గృహ ప్రవేశాలు జరగనున్నట్లు తెలిపారు. అన్ని సదుపాయాలతో పేదల ఇళ్లు ముస్తాబవుతున్నాయని అన్నారు. సోషల్ మీడియా వేదికగా బుధవారం ఆయన పలు అంశాలకు వెల్లడించారు.
జగనన్న వసతి దీవెనతో 9.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
జగనన్న వసతి దీవెన పథకం కింద రాష్ట్రంలో 9,55,662 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా బుధవారం ఆయన పలు అంశాలు వెల్లడించారు. ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ విద్యార్దుల తల్లుల ఖాతాల్లో 912.71 కోట్లు జమ చేశారని అన్నారు. ఉన్నత చదువులు చదువుతున్న పేద విద్యార్థులకు భోజన, వసతి ఖర్చుల కోసం ఏటా రెండు వాయిదాల్లో జగనన్న వసతి దీవెన పథకం కింద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు.
గొప్ప విద్యావేత్తలను అందించిన ఏయూ
ఆంధ్రా యూనివర్సిటీ 98 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులకు నివాళులర్పిస్తున్నానని విజయసాయి రెడ్డి అన్నారు. దేశాభివృద్ధికి తోడ్పాడు అందించే విధంగా ఈ గొప్ప విశ్వవిద్యాలయం వివిధ రంగాలలో ప్రముఖులను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన అలనాటి విద్యావేత్తల వారసత్వాన్ని ప్రస్తుత యాజమాన్యం కొనసాగించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులకు శుభాకాంక్షల తెలియజేస్తున్నట్లు తెలిపారు.
దేశంలో దాఖలు చేస్తున్న పేటెంట్లు పెంచడంపై దృష్టి సారించాలని విజయసాయి రెడ్డి అన్నారు. బుధవారం ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం సందర్భంగా ఈ విషయంపై స్పందిస్తూ పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో పేటెంట్లు, పేటెంట్ల దాఖలు ఒక సబ్జెక్టుగా బోధించాలని సూచించారు. గత ఏడాది భారత్ 65000 పేటెంట్లు దాఖలు చేయగా, చైనా 15.85 లక్షలు దాఖలు చేసిందని అన్నారు. అలాగే భారతీయ ఆవిష్కరణలకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.