వేములవాడ: ఇదో అసాధారణ వార్త. చిన్నపాటి కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యేల వరకూ ఖరీదైన కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్న ఈరోజుల్లో.. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో స్వయంగా మహిళా జడ్జి కాన్పు చేయించుకోవడం అబ్బురమే. ఇది ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచే పరిణామం. ఆ మహిళా జడ్జి నిర్ణయం ప్రభుత్వ అధికారులకు ఆదర్శం కావాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులుంటారు. కాకపోతే సౌకర్యాలే కరవు. అది కూడా దూరమైతే సర్కారీ ఆసుపత్రులపై నమ్మకం ఎందుకుండదు? ఇక చదవండి..
ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా జడ్జి జ్యోతిర్మయి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. సాధారణ కాన్పు ద్వారా మగబిడ్డ జన్మించాడని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయమూర్తి స్వయంగా ఇక్కడ సేవలు పొందడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు పొంది అందరికీ ఆదర్శంగా నిలిచారని సీనియర్ కోర్టు ఏజీపీ ప్రశాంత్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ రవి, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. న్యాయమూర్తి జ్యోతిర్మయి వేములవాడ జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. 2023లోనూ ఇదే ఆసుపత్రిలో ఆమె ఆడపిల్లకు జన్మనివ్వడం విశేషం.
ఈ విషయం తెలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. ట్విట్టర్ ద్వారా న్యాయమూర్తి జ్యోతిర్మయికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అనుభవం, నైపుణ్యం కలిగిన వైద్యులు అందుబాటులో ఉంటారని, వారి సేవలు పొందాలని మంత్రి దామోదర ప్రజలకు సూచించారు.