Suryaa.co.in

Andhra Pradesh

చారిత్రాత్మక సింహపురిని విభజన పేరుతో ముక్కలు చేయవద్దు

– అమరజీవి పొట్టిశ్రీరాములు పేరుతో ఉన్న ఈ జిల్లా జోలికి రావొద్దు
-సోమశిల, కండలేరు జలాశయాలను విడదీయవద్దు
– పార్లమెంటు నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లాల విభజన ఆలోచనే అర్థరహితం
– 2020 సెప్టెంబరులో తీసుకున్న నిర్ణయానికే మా పార్టీ కట్టుబడివుంది
– వైసీపీ నేతలే వీధికొక వైఖరితో ఉన్నారు
-నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పునర్విభజన ప్రక్రియతో జిల్లాలకు ఉండాల్సిన విలువలను మంటగలిపారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన విభజన చేసి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు అందుబాటులో ఉండేలా, ఆ ప్రాంతంలోనే భౌగోళిక పరిస్థితులు, నీటిపారుదల వ్యవస్థ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని విభజన చేయండి.

జిల్లాల పునర్విభజనకు మేం వ్యతిరేకం కాదు..పార్లమెంటు ప్రాతిపదికతనే వ్యతిరేకిస్తున్నాం.రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను 225కి పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. 2026లో పునర్విభజన జరిగితే అసెంబ్లీతో పాటు పార్లమెంటు నియోజకవర్గాల పరిధి కూడా మారిపోయే అవకాశం ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో గుడ్డిగా పార్లమెంటు ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన సరికాదు. నెల్లూరు జిల్లాను విభజించడం అంత తప్పుడు నిర్ణయం మరొకటి లేదు. తడ నుంచి కావలి వరకు, ఉదయగిరి నుంచి వెంకటగిరి వరకు అన్ని సెంటర్ పాయింటుగా జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరం ఉంది.

నెల్లూరు జిల్లాను విభజించమని మిమ్మల్ని ఎవరు కోరారు. 2020 సెప్టెంబరులోనే మేము తెలుగుదేశం పార్టీ సమన్వయకమిటీ సమావేశంలో జిల్లా విభజనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాం. అదే రోజు అప్పటి పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఆధ్వర్యంలో మీడియా ముఖంగా ప్రభుత్వానికి కూడా తెలియజేశాం.

కండలేరుకు పరివాహక ప్రాంతం లేదని, పూర్తిగా సోమశిలపై ఆధారపడివుందని కూడా తెలియజేశాం. కండలేరు జలాశయం కింద 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అందులో 2.50 లక్షల ఎకరాలు నెల్లూరు కింద, 50 వేల ఎకరాలు చిత్తూరు జిల్లా పరిధిలో ఉంది. మద్రాసుకు తాగునీటి సరఫరా కూడా కండలేరు ద్వారానే జరగాలి. సోమశిల ప్రాజెక్టులో చేసే నీటియాజమాన్యం మీదనే కండలేరు ఆయకట్టు భవిత ఆధారపడి ఉంటుంది.

2018లో కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు శ్రీశైలం నుంచి 48 టీఎంసీల క్రిష్ణా జలాలు తీసుకొచ్చాం. గూడూరు డివిజన్ లో చివరి తడులకు నీళ్లు చాలక, పంటలు ఎండిపోయే పరిస్థితివుంటే అదనంగా నీళ్లు తెచ్చి కాపాడుకున్నాం. నెల్లూరు జిల్లాలో వ్యవసాయానికి కీలకమైన సోమశిల, కండలేరు జలాశయాలను విడదీయడం దుర్మార్గం.

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విభజనతో సోమశిల నెల్లూరు జిల్లాలో ఉండిపోయి, ప్రతిపాదిత బాలాజీ జిల్లాలోని 2.50 లక్షల ఆయకట్టు పరిస్థితి అయోమయంలో పడుతుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు తిరుపతి కంటే నెల్లూరే దగ్గర సోమశిల, కండలేరు ద్వారా 146 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఏకైక జిల్లాగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు పేరుంది.

అలాంటి కీలకమైన జిల్లాను అవసరం లేకపోయినా రెండుగా విభజించేస్తున్నారు. కండలేరు జలాల కోసం రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను మాత్రమే నెల్లూరు జిల్లాలో కొనసాగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కోరడం అర్థరహితం. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా జిల్లాల విభజన చేస్తున్నారనే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలతో మేము ఏకీభవిస్తున్నాం.

కానీ కండలేరు జలాలు రాపూరు, సైదాపురం మండలాలకేనా..గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు, డక్కిలి, బాలాయపల్లి మండలాలకు అవసరం లేదా? చిత్తూరు, అనంతపురం లాంటి పెద్దజిల్లాలను రెండుగా విభజించుకోండి..కేవలం 8 జిల్లాలే 124 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగివున్నాయి..పునర్విభజన వాటికి పరిమితం చేయండి.

శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలు కేవలం 51 నియోజకవర్గాలను మాత్రమే కలిగివున్నాయి. సరాసరిన 10 నియోజకవర్గాలు మాత్రమే కలిగిన చిన్న జిల్లాల జోలికి మీరు ఎందుకు వస్తున్నారు..ఏం ప్రయోజనాలను మీరు ఆశిస్తున్నారు?

అంతిమంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా జిల్లాలను విభజించండి..మేం అభ్యంతరం చెప్పం. పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లాల విభజన జరిగితే నెల్లూరుకు వాటిల్లే నష్టాన్ని మా పార్టీ తరఫున 2020 సెప్టెంబరు 8వ తేదీనే వివరించాం. అప్పట్లో ఒక్క కూత కూడా కూయని ఒకాయన, జిల్లాల విభజన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పాలుపోసి కడిగించుకుంటున్నారు.

సర్వేపల్లిని నెల్లూరులో కొనసాగించాలని ఏనాడైనా డిమాండ్ చేశారా..ఏ సమావేశంలో అయినా కోరారా..ముఖ్యమంత్రిని ఏమైనా కలిశారా..అసల అంత దమ్ము ఉందా? ఆ ఒక్కఎమ్మెల్యేకే కాదు..జిల్లాలో ఏ మంత్రికి, ఎమ్మెల్యేలకు కూడా సీఎంను కలిసి ప్రజాసమస్యలను ప్రస్తావించే దమ్ము లేకుండా

పోయింది.జిల్లాలో సీనియర్ నాయకుడు, పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి కూడా సీఎంని కలిసే పరిస్థితి లేక, నిరాహారదీక్ష శిబిరాల్లో పక్కన కూర్చుంటున్నారు.సీఎం దగ్గరకు వెళ్లండి..జిల్లాల విభజన చేయవద్దని కోరండి.పెద్ద నాయకుడైన ఆనం రామనారాయణ రెడ్డి రాపూరు, కలువాయి, సైదాపురానికి పరిమితం కావొద్దు..సమస్యలు వచ్చినప్పుడు పోరాడండి. గతంలో మేము అనేక అంశాలపై పోరాటాలు చేశాం..కండలేరు జలాలను చిత్తూరు జిల్లాకు తరలించేందుకు 11 వేల కోట్లతో టెండర్ పిలిస్తే తీవ్రంగా వ్యతిరేకించాం.

ఆ ప్రాజెక్టులో భాగంగా రూ.6 వేల కోట్ల విలువైన పనులను టెండర్ పిలిస్తే ఆర్థిక మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి సంతకం పెట్టారు. ఆ ప్రాజెక్టు కాని ఆచరణలోకి వస్తే, కండలేరు వద్ద స్విచ్ఛాన్ చేస్తే నీళ్లు చిత్తూరుకు వెళ్లిపోయే పరిస్థితి తెచ్చారు.

కాంట్రాక్టర్లకు మొబైలైజేషన్ అడ్వాన్సులు కూడా చెల్లించారు.. మా ప్రభుత్వం రాగానే నేను ఓడిపోయినా పట్టుబట్టి ఆ పనులను రద్దు చేయించాను. జిల్లాల పునర్విభజన తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలే రోడ్డెక్కుతున్నారు..అంతా గందరగోళ పరిస్థితులు.

సకల శాఖల మంత్రి సజ్జల నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో గానీ రాష్ట్రానికి భవిష్యత్ లేకుండా చేసేస్తున్నారు. నెల్లూరు జిల్లా ప్రజల సౌకర్యాలు, నీటి పారుదల ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని చారిత్రాత్మక సింహపురిని విభజన పేరుతో గందరగోళం చేయవద్దని కోరుతున్నాం.

LEAVE A RESPONSE