Suryaa.co.in

Features

నోరు జారితే…అంతే!

మనిషికి ప్రసాదించిన గొప్ప శక్తి- మాట. మనిషి మాటను మితంగా, హితంగా సద్వినియోగం చేసుకోగలిగితే మహోన్నత శిఖరాలనందుకోగలదు. సృష్టిలోని ఏ ప్రాణికీ లేని గొప్ప శక్తి మానవుడికి లభించింది. మంచి ఆహారం భుజించడం, మంచిమాట పలకడం ఈ నాలుకకు సంబంధించింది. సాత్వికాహారం తీసుకోవడం వల్ల సత్త్వగుణమే అలవడుతుంది. ఆ సత్వగుణం వల్లనే మనసు ప్రసన్నంగా ఉంటుంది. ఆ ప్రసన్నత వల్లనే మంచి మాటా వస్తుంది.

వాక్కు దివ్యాస్త్రం వంటిది. దాన్ని ఎలా ఎప్పుడు వినియోగించుకోవాలో తెలియకపోతే అది మూర్ఖుడి చేతి ఆయుధమే అవుతుంది. ఎప్పుడైనా ఓ పరుష వాక్కును నాలుక పలికిందంటే. దాని దుష్పరిణామం తీవ్రంగాను, ప్రమాదభరితంగాను ఉంటుంది. మన మాట తీరే మన సభ్యతను, సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఇతరులను నొప్పించక తానొవ్వక చమత్కారభరితంగా సత్యమైన ప్రియమైన మాట పలికేవాడు సమర్థుడైన వర్త, మధురమైన వచనం పలకడం ఇతరులను వశపరచుకోగలిగే మహామంత్రం అంటాడు గోస్వామి తులసీదాసు.

రామాయణంలో శ్రీరాముడు మితంగాను, స్మితంగా ప్రతివారితోను సంభాషిస్తున్నట్లు కనిపిస్తాడు. గురువుతో, తల్లిదండ్రులతో, సోదరులతో, సేవకులతో, ధర్మపత్నితో, అధికారులతో, ప్రజలతో… ఎలా ఎంత మర్యాదగా భాషించాడో రాముడి ఆదర్శ స్వభావం వ్యక్తం చేస్తోంది. అలాగే హనుమ లంకలో సీతమ్మను చూసి వచ్చాక. రాముడితో జానకమ్మను చూశాను స్వామి అని మొట్టమొదటి మాట చెబుతాడు. ఒక్కమాట వినగానే పరమానందభరితుడవుతాడు. రాముడు మనమాట ఎప్పుడూ ఇతరులను ప్రసన్నం చేసేదిగా ఉండాలి. వేదాలన్నీ వాక్ శక్తిని వివిధ రూపాలుగా సంభావిస్తున్నాయి. మంత్రాలన్నీ వాక్ స్వరూపాలే. మంత్రాలన్నీ మహిమాన్వితమై మానవుడికి అనేక విధాలుగా సత్ఫలితాలిస్తున్నాయి. సాధకు యాగకర్తలకు, తపోధనులకు మంత్రాలే ఆలంబన మంత్రం అక్షరాత్మకం ఆ అక్షరమే సరస్వతీ స్వరూపం. ఆమె యజ్ఞ స్వరూపిణి, సద్గతి ప్రదాయిని. సర్వదేవాత్మిక, మహాభారతంలోని ‘సరస్వతీగీతలు’ బ్రాహ్మీ వైభవాన్ని, వారి వైభవాన్ని బహుదా వర్ణించాయి.

తల్లి పులి తన పిల్లలను కాపాడుకుంటూ, సంచరిస్తున్నప్పుడు ఆ పసికూనలను గట్టిగా పట్టుకుంటే ఎక్కడ గాయమవుతుందోనని మృదువుగా పట్టుకుంటుంది. అలాగని పట్టు సడలించితే ఆ బిడ్డ కిందపడి గాయపడుతుందని జాగ్రత్తగాను, తగినంత గట్టిగాను పట్టుకుంటుంది. అదే విధంగా అక్షరాలను, శబ్దాలను ఉచ్చరించేటప్పుడు నియమబద్ధంగా తగినంత సావధానంగా ఉండాలి’ అంటాడు. ప్రసిద్ధ వ్యాకరణ వేత్త, భాషాశాస్త్రజ్ఞుడు పాణిని, మహాభారతంలో శకుంతల నోటివెంట సత్యప్రాశస్త్యాన్ని గురించి మనోహరమైన వాక్కుల్ని వ్యాసుడు పలికించారు. ‘నూరు కలుషితమైన చెరువులకంటే ఒక బావి మేలు నూరు బావులకంటే ఒక యజ్ఞం గొప్పది. నూరు యజ్ఞాల కంటే ఒక సుపుత్రుడు గొప్పవాడు. నూరుమంది పుత్రులకన్న ఒక్క సత్యవాక్కు గొప్పది” అని ఒక సుభాషితం, సత్యంవద, ధర్మంచర అని తైత్తిరీయోపనిషత్ కథనం. క్షణిక ప్రయోజనాలు, సుభాలకోసం అసత్యాలు పలకడం హేయం.

సత్యమైన మాట ప్రసన్నత, ప్రశాంతత, ప్రగాఢమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. శాశ్వత విజయానికి ఇవే ముఖ్యమైన సోపానాలు. మంచి ఆలోచన మంచి మాటనే పలికిస్తుంది. మంచిమాట నుంచి బాటనే చూపిస్తుంది. సత్యవచనం విద్య, సంపద, పదవి, కీర్తితోపాటు నుంచి బంధుమిత్రుల్ని, మంచి వాతావరణాన్ని సంపాదించి పెడుతుంది.

సేకరణ: మానస సరోవరం
– ఎం.ఎల్.ఎన్.రావు

LEAVE A RESPONSE