• ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు వ్యాపార సంస్థ కాదు సర్వీస్ సంస్థ
• విద్యుత్ ఉద్యోగులు రాత్రింభవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు
• విద్యుత్ ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తారు
• రాబోయే కాలంలో రెన్యూవబుల్ ఎనర్జీ కే ఎక్కువ అవకాశాలు
– గొట్టిపాటి రవికుమార్, విద్యుత్ శాఖ మంత్రి
విజయవాడ: విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ వివిధ దశల్లో ఉందని దానిపై త్వరలోనే ముఖ్యమంత్రి సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మంగళవారం వెన్యూ కన్వెన్షన్ హాల్లో విద్యుత్ ఉద్యోగులు (ఏపీఎస్ఈబీ) ఏర్పాటు చేసిన డైరీ-2025, క్యాలెండర్ ప్రారంభ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు.
ఏపీఎస్ఈబీ ఉద్యోగులు డైరీ – 2025ని మంత్రి ఆవిష్కరించారు. క్యాలెండర్ ను ఏపీ జెన్ కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యుత్ ఇంజనీర్లు సంస్థ మనుగడ కోసం రాత్రింభవళ్లు పనిచేస్తారని కొనియాడారు. ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు వ్యాపార సంస్థ కాదు సర్వీస్ సంస్థ అని అన్నారు. జిల్లాల్లో ఏఈలు, లైన్ల మెన్ల సిబ్బంది కొరత ఉందని దాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయినా విద్యుత్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సంస్థ కోసం పనిచేస్తున్నారన్నారు.
వేరే రాష్ట్రాల విద్యుత్ బోర్డుల కన్నా మన రాష్ట్ర విద్యుత్ బోర్డు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని, ఉద్యోగులు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారన్నారు. విద్యుత్ సిబ్బంది 24 గంటలూ పనిచేసి రాష్ట్రానికి నాణ్యమైన విద్యుత్ ను ప్రజలకు అందిస్తున్నారన్నారు. రాత్రనక, పగలనక పనిచేస్తున్నారని, విజయవాడ వరదల్లో నేను వారి పనితనాన్ని ప్రత్యక్షంగా చూసానన్నారు. విజయవాడ వరదల్లో బాధితులకు అండగా ఉంటూనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు రూ. 10 కోట్ల ను ముందుగా విద్యుత్ ఉద్యోగులు విరాళంగా అందించారన్నారు.
వివిధ శాఖల సిబ్బంది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వరద బాధితులకు విరాళాలు అందించారన్నారు. ప్రతి ఏడాది పవర్ సెక్టార్ లో 6-7 శాతం పెరుగుదల కనిపిస్తుందన్నారు. ఇటీవల రెన్యూవబుల్ ఎనర్జీ కి ఎక్కువ అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీకి పెట్టుబడులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను చూసి వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 30 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి తీసుకురావడానిక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మన సంస్థ నుంచి కూడా 7 నుంచి 8 గిగా వాట్ల ఉత్పత్తి చేసేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యుత్ ఉద్యోగుల తెలియజేసిన సమస్యలను పరిశీలిస్తామన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేయాలని అంతేకాకుండా ప్రజలకు ఇంకా మెరుగైన విద్యుత్ సర్వీస్ లను అందించేందుకు మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను మా సమస్యలుగా భావించి ముందుకు తీసుకువెళ్లతామన్నారు.
ఏపీ జెన్ కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ.. నేను సివిల్ సర్వీసు లోకి రాకుముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేసానన్నారు. నాకు విద్యుత్ ఇంజనీర్ల కష్టపడే తత్వం తెలుసని, ఇంజనీర్లు రాత్రింభవళ్లు కష్టపడి పనిచేస్తారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి తో మాట్లాడి రాబోయే రోజుల్లో ఇంజనీర్ల సంఖ్య పెంచుతామన్నారు. విద్యుత్ సంస్కరణల తరువాత విద్యుత్ ఇంజనీర్ల పాత్రి అద్వితీయంగా పెరిగిందన్నారు. ప్రతి షిఫ్ట్ లో ఇంజనీర్లు బాగా పనిచేస్తున్నారన్నారు. పవర్ సెక్టార్ లో వస్తున్న క్లీన్ ఎనర్జీ పాత్ర పై నేడు అందరూ చర్చిస్తున్నారని, దావోస్ లో కూడా ముఖ్యమంత్రితో ఎక్కువ మంది దీనిపైనే దృష్టి పెట్టినట్లు మనం చూడొచ్చన్నారు.
కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్ కో ఎండీ కీర్తి చేకూరి, ఏపీఎస్ఈబీ నాయకులు శామ్యూల్, నాగప్రసాద్, రామారావు, గోపాలకృష్ణ, శైలేంద్ర, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.