ఇంతకూ ఎన్టీఆర్ ఏం చెప్పారో అర్ధమయిందా?

( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు తన కుటుంబంపై వెసీపేయులు వ్తక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ ఆవేదన చెంది, ఇక తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టేది లేదన్నారు. మళ్లీ సీఎంగానే సభలోకి వస్తానని చాణక్య శపథం లెక్క, ‘బాబన్న శపథం’ చేశారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ సుజనాచౌదరి, సీఎం రమేష్, భువనేశ్వరి సోదరి అయిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి సహా చాలామంది.. చంద్రబాబు కుటుంబసభ్యులపై వైసీపీ నేతలు దాడిచేయడాన్ని ఖండించారు. చివరకు అసలు టీడీపీ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేని.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాంధీ, కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి కూడా బాబు కుటుంబానికి దన్నుగా నిలిచారు. ఇదంతా ఇప్పటివరకూ జరిగిన కథ.
అయితే చాలామంది జూనియర్ ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఆయన ఇప్పటిదాకా నోరు విప్పకపోవడాన్ని ప్రశ్నించారు. ఒక మహిళయితే ఇదే విషయాన్ని ముందూ వెనకా చూసుకోకుండా, ఎన్టీఆర్ మౌనాన్ని దూదేకినట్లు ఏకిపారేసింది. అదికాస్తా చానెళ్లూ, సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. ‘కాసేపట్లో అసెంబ్లీ జరిగిన ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తార’ని చిన్న లీక్. ఇంకేముంది? అందరికీ పిచ్చ టెన్షన్. తెలుగుతమ్ముళ్లకయితే యమా టెన్షన్. ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారు? జగన్ సర్కారుపై విరుచుకుపడతారా? తన మేనత్త భువనేశ్వరిని అవమానించిన తన శిష్యుడు, తానే టికెట్టుకు సిఫార్సు చేసిన కొడాలి నానికి చీవాట్లు పెడతాడా?.. ఇదీ అందరి ఉత్కంఠకు కారణం.
ఎందుకంటే.. అసలు టీడీపీ రాజకీయాలతో గానీ, అసలు ఆంధ్రరాష్ట్రంతోనే ఏమాత్రం సంబంధం లేని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి వాడే.. జగన్‌పై కారాలు మిరియాలు నూరితే, ఇక మేనల్లుడు.. పైగా ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్, సీఎం జగనన్నపై ఇంకెంత రెచ్చిపోతాడో?! ఇదీ.. బుడ్డోడిపై తెలుగుతమ్మళ్ల అంచనా. ఎందుకంటే అప్పటికే బాలకృష్ణ ఫ్యామిలీ జగనన్నకు వార్నింగు ఇచ్చేసింది కాబట్టి, మన బుడ్డోడు కూడా మా ఫ్యామిలీ జోలికొస్తే ఖబడ్దార్ అని ‘అంతకుమించి’ వార్నింగు ఇస్తాడేమోనని తెగ ఉబలాటపడ్డారు.
కానీ.. తస్సాదియ్యా తుస్సుమంది అన్నట్లు.. నందమూరి సీమటపాకాయ్ పేలకుండానే తుస్సుమంది. సీమ సినిమాల్లో చూపించిన ఎన్టీఆర్ హీరోయిజం, రియల్‌టైంలో జగనన్నకు భయపడి.. తల్లీ బిడ్డా క్షేమం మాదిరిగా మధ్యస్ధంగా, రుచీ పచీ లేని వంటలా ఎన్టీఆర్ స్పందించడం తెలుగుతమ్ముళ్లను విస్మయపరిచింది. దానితో అసలు ఎన్టీఆర్ ఏం మాట్లాడాడో అర్ధం కాక, ఆ వీడియోను ఒకటికి పదిసార్లు చూసుకున్నారు. ఎన్నిసార్లు చూసినా అబ్బాయి దగ్గర విషయం లేదని తెలుసుకుని.. ఇంతోటి దానికి కొద్దిసేపట్లో ఎన్టీఆర్ స్పందన అంటూ లీకుల బిల్డప్పులెందుకని తమ్ముళ్లు మెటికలు విరిచారు. ఇంతకూ అసెంబ్లీలో జరిగిన ఘటనపై ఎన్టీఆర్ ఏమన్నారో చదవండి.


నిన్న శాసనసభలో జరిగిన ఘటన కలచివేసిందన్నారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమని, విమర్శలు ప్రజాసమస్యలపైనే జరగాలన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు.ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుషపదజాలంతో మాట్లాడడం అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందన్నారు. ఆడబిడ్డలను గౌరవించడం మన సంప్రదాయమని, మన సంప్రదాయాలను రాబోయే తరానికి అందివ్వాలన్నారు. ఈ మాటలు వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబసభ్యుడిగా మాట్లాడడం లేదన్నారు. నేనొక కొడుకుగా, తండ్రిగా మాట్లాడుతున్నానన్నారు. మ‌న సంస్కృతిని కాల్చివేసేలా వ్యవహ‌రించ‌కూడ‌దన్నారు. ఈ అరాచ‌క సంస్కృతిని ఇంత‌టితో ఆపాలని పిలుపునిస్తూ రాజకీయ నాయకులకు జూనియర్‌ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ.. రాజారామ్మోహన్‌రాయ్ తర్వాత ఆ స్థాయిలో సమాజానికి ఓ సంఘ సంస్కర్తగా ఎన్టీఆర్ తెలుగు జాతికి, తెలుగు రాజకీయ సమాజానికి ఇచ్చిన పిలుపులాంటి హితవు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడినదాంట్లో తప్పేమిటనిపిస్తుంది కదా?
యస్. కానీ అక్కడ వ్యక్తిత్వ హననానికి గురయింది తన కుటుంబం. ఆయన చెప్పిన ఆ మహిళ ఎవరన్నదీ ఎన్టీఆర్ చెప్పలేదు. అది చెప్పకుండా, ఎవరు ఎవరిని విమర్శించడం మంచిదికాదన్న విషయాన్నీ ప్రస్తావించకుండా, అసలు విషయాన్ని నేర్పుగా దాటేసి, ఏదో తానూ ఖండించానన్నట్లు చెప్పుకోవడానికే తప్ప, ఎన్టీఆర్ ఎందుకు? ఏ ఉద్దేశంతో ఆ వీడియో విడుదల చేశారో ఎవరికీ అర్ధం కాలేదు.
పెద్దగా మాట్లాడలేని నందమూరి రామకృష్ణ స్థాయిలో కూడా ఎన్టీఆర్ మాట్లాడకపోవడమే తమ్ముళ్లను ఆశ్చర్యపరిచింది. సరిగా మాట్లాడ లేని రామకృష్ణనే ..మా కుటుంబసభ్యుల జోలికొస్తే ఊరుకునేది లేదు. మా సహనం పరీక్షించవద్దు. వైసీపీ నేతలు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించిన మాటలకు.. ఎవరి పేరూ చెప్పకుండా, ఎవరినీ హెచ్చరించకుండా చివరకు తమలపాకుతో కూడా కొట్టని ఎన్టీఆర్ మాటలకు… ఎక్కడా పొంతనే కనిపించలేదు. చివరాఖరకు హీరో నారా రోహిత్ ఫైర్‌లో ఎన్టీఆర్ ఆవేశం, ఒక్క శాతం కూడా కనిపించకపోవడం మరో ఆశ్చర్యం.
నిజానికి ఎన్టీఆర్ అసెంబ్లీ ఎపిసోడ్‌పై స్పందించకపోయినా బాగుండేది. ఇప్పుడు ఏదో ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా చేసిన వ్యాఖ్యలు, ఆయన ఇమేజీని దారుణంగా డామేజీ చేశాయి. ‘‘ఇంతోటిదానికి పెద్ద వీడియోలెందుకు? ఇంత డిప్లమేటిక్‌గా , కర్ర విరక్కుండా, పాముచావకుండా అన్నట్లు మాట్లాడిన ఎన్టీఆర్.. నువ్వు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టుకున్నావ్? అసలు నిన్ను స్పందించమని ఎవరు అడిగారం’’టూ, స్వయంగా ఎన్టీఆర్ అభిమాని ఒకరు, సోషల్‌మీడియాలో విడుదల చేసిన వీడియో.. ఎన్టీఆర్ పరువును ఆగం చేస్తోంది. అభిమానులు ఆనందం వచ్చినా, ఆవేశం వచ్చినా తట్టుకోలేరు మరి.

Leave a Reply