– మరి అదే ఓటు చోరీతో కాంగ్రెస్ గెలిచిందా?
– బ్యాలెట్లతో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది?
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి డా. ఎస్. ప్రకాష్ రెడ్డి
హైదరాబాద్: బీజేపీ ఎంపీలు ఓటు చోరీతోనే గెలిచారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఆయనకు బుర్ర ఉందా? తెలంగాణలో 8 ఎంపీ సీట్లు బీజేపీ గెలిస్తే, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కూడా గెలిచారు కదా? మరి అదే ఓటు చోరీతో కాంగ్రెస్ గెలిచిందా? మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్న మహేశ్ కుమార్ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలి.
తెలంగాణలో దొంగ ఓట్లు ఉన్నందువల్లే కాంగ్రెస్ పార్టీకి చెందిన 63 మంది ఎమ్మెల్యేలు గెలిచి అధికారంలోకి వచ్చారా? దొంగ ఓట్లతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారని తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. అయినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధిరాలేదు.
దేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థను, ఓటర్లను అవమానపరుస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదని, దేశంలో అంతర్గత అల్లకల్లోలం సృష్టించి పబ్బం గడుపుకోవాలని రాహుల్ గాంధీ చూస్తున్నారు. ఆయనకు మహేష్ కుమార్ గౌడ్ వంత పాడుతున్నారు. దక్షిణ భారతదేశం–ఉత్తర భారతదేశం అంటూ, భాషలు, వృత్తులు, వ్యాపారాలపై కూడా విభేధాలు సృష్టించి ఆ దుర్మార్గపు మంటల్లో చలి కాచుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ.
ఈవీఎంలను దేశంలో తొలిసారి 1989 ఎన్నికల్లోనే ప్రయోగాత్మకంగా వాడారు. ఆ తర్వాత 1998, 1999 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈవీఎంలతోనే పోలింగ్ జరిగింది. 2004 తర్వాత నుంచి అయితే పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా ఎన్నికలు ఈవీఎంల ద్వారానే జరుగుతున్నాయి.
ఇంతకాలం అన్ని పార్టీలూ, కాంగ్రెస్ కూడా ఇదే ఈవీఎంలతో పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. మరి ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్‌కు ఈవీఎంలపై నమ్మకం లేకపోవడం ఏంటి? ఓడిపోతే ఈవీఎంల తప్పు, గెలిస్తే తమ క్రెడిట్ అని చెప్పుకోవడం కాంగ్రెస్ వంచకత్వానికి నిదర్శనం.
మరి ఈవీఎంలపై నమ్మకం లేదంటున్న కాంగ్రెస్ పార్టీ.. బ్యాలెట్లతో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది? ఇప్పటికైనా మహేష్ కుమార్ గౌడ్ అర్థంలేని తర్కం మానుకోవాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని “దేశ్ ముఖ్” అంటూ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.
రేవంత్ రెడ్డి గతంలో బహిరంగంగానే “మా తాత పోలీస్ పటేల్” అంటూ గొప్పలు చెప్పుకున్నాడు. ఈరోజు అదే రేవంత్ రెడ్డిని పోలీస్ పటేల్ నుంచి సడెన్‌గా “గౌడ్” అంటూ మహేశ్ కుమార్ సంబోధించడం నవ్వులపాలు చేసింది. అసలు దేశ్ ముఖ్ వ్యవస్థ ఎలా వచ్చిందో మహేశ్ కుమార్ గౌడ్‌కు తెలుసా? కనీస పరిజ్ఞానం ఉందా? ఢిల్లీలో రాహుల్ స్క్రిప్టును కాపీ చేసి మాట్లాడుతూ ఆయన దగ్గర మెప్పు పొందాలని ప్రయత్నించడం సిగ్గుచేటు.రాబోయే రోజుల్లో మహేశ్ కుమార్ గౌడ్ కి, కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పడుతుందో ఇప్పటినుంచే ఆలోచించుకోవాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కలిసి తెలంగాణ రాష్ట్ర ధనాన్ని దోచుకున్నారు. ఇప్పటివరకు 20 నెలల పాలనలో 53 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం కట్టేందుకే వెళ్లారు. దోచుకున్న సొమ్ము ఢిల్లీ కాంగ్రెస్ రాజులకు కడుతున్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లపై చట్టం చేశామని చెబుతున్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ మాటలు పూర్తిగా అవాస్తవం. మొదటిసారి అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించకుండానే చట్టం చేసి గవర్నర్‌కు పంపారు. న్యాయపరమైన అంశాల దృష్ట్యా గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపారు.
2018 లో తీసుకొచ్చిన పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించకుండానే చట్టం చేసినందువల్లే, న్యాయపరంగా చేసిన తప్పులవల్లే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గతంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 32 శాతం నుంచి 23 శాతానికి తగ్గించింది. దానిని మార్చుతూ ఇప్పుడు కాంగ్రెస్ మరో ఆర్డినెన్స్ తెచ్చింది. ఏ ప్రభుత్వమున్నా సుప్రీంకోర్టు తీర్పే కీలకం కదా! దానిని గౌరవించాల్సిందే, స్వాగతించాల్సిందే.
కానీ న్యాయనిపుణుల సలహా తీసుకోకుండా, క్లారిఫికేషన్లు అడిగితే ఇవ్వకుండా, కాంగ్రెస్ పార్టీ బీసీలపై కేవలం కపటప్రేమ కురిపిస్తోంది. ఇప్పుడేమో పంచాయతీ రాజ్ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై మాటమార్చి, 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకావని చెబుతుండటం దివాళాకోరు మాటలు, రంగులు మార్చే పిట్టలదొరల్లా మాటలే.
“బండి సంజయ్ కరీంనగర్‌కు ఏం నిధులు తెచ్చారు?” అని మాట్లాడుతున్న మహేశ్ కుమార్ గౌడ్ … దమ్ముంటే చర్చకు రావాలి. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు బహిరంగంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో ప్రజలకు స్పష్టంగా వివరించారు. ఇప్పటికైనా మహేశ్ కుమార్ గౌడ్ పిచ్చి మాటలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం