Suryaa.co.in

Telangana

ఒవైసీ ఆస్తులను కూల్చేందుకు ధైర్యం చాలడం లేదా?

– ఒవైసీ కాలేజీలకు అడ్డొచ్చిన విద్యార్థులు పల్లా కాలేజీకి రాలేదా?
-హిందువులు ఉన్న చోట హైడ్రా కూల్చివేతలు
– పాతబస్తీకి వెళ్లే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదా?
– ప్రమోషన్ కోసం పని చేస్తున్నారా?
– ఒవైసీ కాలేజీలకు అడ్డొచ్చిన విద్యార్థులు పల్లా కాలేజీకి రావడం లేదా?
– హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరును తప్పుబట్టిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: హైడ్రా పని చేస్తున్న తీరుపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీలో నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. హైడ్రా కమిషనర్ రంగానాథ్ తీరును తప్పుబట్టారు. ఆయన ప్రమోషన్ కోసం పని చేస్తున్నారా? లేక ఓ అజెండాతో పని చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చినట్లు, మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా టార్గెట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు.

గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… మీకు మీరు పోలీసు అధికారి అనుకుంటున్నారా? లేక రాజకీయ నాయకుడు అనుకుంటున్నారా? అని రంగనాథ్‌ను ప్రశ్నించారు. తనను విమర్శించే ముందు ఆలోచించాల్సింది అన్నారు. హైడ్రా పేరుతో వసూళ్లు జరుగుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారని గుర్తు చేశారు. దీనిని బట్టి హైడ్రా ఎలా నడుస్తుందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

సల్కం చెరువులోని ఒవైసీ భవనాల కూల్చివేతల విషయంలో విద్యార్థుల భవిష్యత్తు అంటూ రంగనాథ్ నీతులు చెబుతున్నారని, మరి కేఎల్ఆర్ ఇనిస్టిట్యూషన్స్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వారి సంస్థలకు వర్తించదా? అని ప్రశ్నించారు.

ఒవైసీ భవనాల కూల్చివేతకు విద్యార్థులు, విద్యా సంవత్సరం అడ్డు వచ్చాయని చెబుతోన్న రంగనాథ్‌… ఇతర సంస్థల విషయంలో ఆ ఆలోచన ఎందుకు చేయడం లేదన్నారు. 365 రోజులు ఒవైసీ విద్యాసంస్థలు రన్ అవుతుంటే మీకు కూల్చేందుకు సమయం ఎలా చిక్కుతుందో చెప్పాలన్నారు.

అలాంటప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సమయంలో అడ్వాన్స్ ఇచ్చిన వారి పరిస్థితి ఏమిటో చెప్పాలన్నారు. మీరు కూల్చాలనుకున్న నిర్మాణాలను వెంటనే కూల్చేస్తున్నారని, కానీ మీ మిత్రుడు ఒవైసీకి చెందిన సంస్థలపై సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. అక్బరుద్దీన్ ఒవైసీని ఉపముఖ్యమంత్రిగా చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికే అక్బరుద్దీన్ అనధికార ఉపముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. ఒవైసీ భవంతులను కూల్చేందుకు ఈ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం లేదన్నారు.

హిందువులు ఉన్న చోట హైడ్రా కూల్చివేతలు చేపడుతోందని, మరి పాతబస్తీకి ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలన్నారు. పాతబస్తీకి వెళ్లే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదా? లేదంటే పూర్తిగా ఒవైసీ కనుసన్నుల్లో ఈ ప్రభుత్వం పని చేస్తోందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. గతంలో బీఆర్ఎస్ ఇలాగే మజ్లిస్ పార్టీతో దోస్తీ చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.

ఒవైసీ ఆస్తుల వైపు చూసేందుకు కూడా ప్రభుత్వానికి ధైర్యం చాలడం లేదన్నారు. పాతబస్తీలో హైడ్రా ఎందుకు పని చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కూల్చివేతల విషయంలో హైడ్రా ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఒవైసీ కాలేజీని కూల్చిన తర్వాతే ఇతర సంస్థలను ముట్టుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. తెలంగాణలో స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు.

LEAVE A RESPONSE