– వార్నీ… ఫ్యాన్స్ ఓట్లేస్తే సీఎం అయిపోతారా?
– అంతా కలసి పవన్‌ను సీఎంను చేస్తారట
– పవన్-రాంచరణ్-అభిమానుల ‘చిరు’ కోరిక నెరవేరేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘జనసేన ఎవరితో పొత్తు పెట్టుకుందా లేదా అన్నది అనవసరం. వచ్చే ఎన్నికల్లో జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌ను సీఎం చే యటమే మా లక్ష్యం. అంతవరకూ విశ్రమించేదిలేదు. ఇక నుంచి మనమంతా క్రియాశీల సభ్యులం. అభిమానులకు జనసేనలో సముచిత స్థానం ఉంటుంది.’’
– ఇదీ తాజాగా చిరంజీవి, పవన్, రాంచరణ్ అభిమానులు విజయవాడలో నిర్వహించిన ఆత్మీయ సదస్సులో వారి అభిమాన సంఘాలు తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం. సో.. వచ్చే ఎన్నికల్లో చిరు-పవన్-రాంచరణ్ అభిమానులంతా కలసి కల్యాణ్‌బాబును సీఎంను చేసేస్తున్నారన్నమాట.
శుభం. గత ఎన్నికల్లో ఎలాగూ పవన్ సభలకు విరగబడి వచ్చిన వారెవరూ జనసేనకు ఓటేయలేదు. పవన్ మాట్లాడుతుంటే సీఎం సీఎం అంటూ యాగీ చేసి, అందరినీ చిరాకుపెట్టిన ఫ్యాన్స్‌కు ఎటూ ఓటు లేదు. నలుగురికి చెప్పి ఓట్లు కూడా వేయించలే పోయారు. మీటింగులకు వచ్చి పవనన్నకు జై కొట్టిన వారంతా, పోలింగురోజున జగనన్నకు జైకొట్టారు. పోనీ కాపులేమైనా జనసేనకు కాపు కాశారా అంటే, చివరాఖరకు పవనన్న పోటీ చేసిన రెండు చోట్లా విజయవంతంగా ఓడిపోయారు. కాబట్టి రేపటి ఎన్నికల్లో ఇకపై ఆ బాధ్యతను చిరు-పవన్-రాంచరణ్ అభిమానులు, అభిమానసంఘాలు తీసుకోబోతున్నాయన్నమాట.
జనసైనికులతో కాని పని, అభిమానులతో అయితే పవనన్నయ్యకు మాత్రం కావల్సింది ఏముంటుంది?కానీ దానికంటే ముందు తెలుగురాష్ట్రంలో జరిగిన ఓ ప్రయోగాన్ని ముచ్చటించుకోవాలి.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీ పేరును ప్రజల్లోకి తీసుకువెళ్లేంతవరకూ పనికొచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్, పార్టీ పెట్టిన తర్వాత కరివేపాకులయ్యారు. శ్రీపతి రాజేశ్వర్, రమేష్‌రెడ్డి లాంటి కొందరికే టికెట్లు రాగా మిగిలినవారిని పట్టించుకున్న పాపాన పోలేదు. కొందరి చిన్నా చితకా కార్పొరేషన్ పదవులిచ్చారు. ఎన్టీఆర్ ఉన్నంతవరకే వారి వైభవం కనిపించగా, చంద్రబాబు జమానా రాగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అసలు ప్రాధాన్యం లేకుండా పోయింది. టీడీపీ పార్టీ-ఎన్టీఆర్ అభిమానుల వ్యవస్థ వేరుగానే ఉండేది తప్ప, ఫ్యాన్స్ – పార్టీ వ్యవహారాలను వేర్వేరుగానే చూసేవారు. అందుకే టీడీపీ సక్సెస్ కాగలిగింది. అప్పట్లో చేరిన టీడీపీ కార్యకర్తలు, నాయకులలో.. తర్వాత చాలామందిని ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే పదవులు వరించాయి. గండిపేటలో శిక్షణా తరగతులు, సభ్యత్వాల ప్రక్రియ, కార్యకర్తలు-నేతల వివరాలన్నీ కంప్యూటరీకరించడం వంటి పునాదులతో టీడీపీ అధికారం లేకపోయినా బలమైన పార్టీగా రూపొందింది. దానికి కారకుడు చంద్రబాబునాయుడు.
ఇక టీడీపీకి మొదటి నుంచి సినిమా తారలతో సత్సంబంధాలున్నా, నాయకత్వం వారిని కేవలం ప్రచారానికే వినియోగించుకునేది. రావుగోపాలరావు నుంచి మోహన్‌బాబు వరకూ రాజ్యసభ సీట్లిచ్చినా పార్టీలో వారి పాత్ర పరిమితం. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో బాలకృష్ణ పార్టీ వ్యవహారాల్లో తలదూర్చేవారు కాదు. ఇప్పుడంటే బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో జనంలో క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్, ఎన్నికల్లో అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ విస్తృతంగా తిరిగినా టీడీపీ విజయం సాధించలేకపోయింది. విచిత్రమేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన నియోజవర్గాల్లో టీడీపీ గెలిచింది అత్యల్పం. చిరంజీవి మాదిరిగానే బాలకృష్ణ-జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమానులు అసంఖ్యాకంగా ఉన్నప్పటికీ, వారి ఓట్లు టీడీపీని అధికారంలోకి తీసుకురాలేకపోయాయి. సినిమాలు-రాజకీయాలను అభిమానులు కూడా వేర్వేరుగా చూస్తారన్నదానికి ఇదో నిదర్శనం.
పదేళ్ల క్రితం వరకూ ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవిదీ అదే పరిస్థితి. తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ప్రకటించిన నాటి నుంచి, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేవరకూ చిరంజీవి ఎక్కడికి వెళ్లినా వేలమంది వచ్చేవారు. అభిమానుల సందడికి కొదువలేదు. చిరంజీవిని చూసేందుకు వచ్చిన వారిలో, చాలామంది తొక్కిసలాటకు గురయి మరణించిన సందర్భాలూ లేకపోలేదు. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పార్టీ సాధించిన సీట్లు కేవలం 18 మాత్రమే. దానితో కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసి, కేంద్రమంత్రి పదవితో చిరంజీవి సంతృప్తిచెందాల్సివచ్చింది. అంత సినీగ్లామర్, అసంఖ్యాకమైన అభిమానులు, కాపు కులబలం ఉన్న చిరంజీవి రాజకీయ నిష్ర్కమణం విషాదంగానే ముగిసింది.
ప్రజారాజ్యం పార్టీలో ఎటుచూసినా చిరంజీవి, యువరాజ్యం అధ్యక్షుడు పవన్, ఆయన అన్నయ్య నాగబాబు మాత్రమే కనిపించేవారు. ప్రెస్‌మీట్లలో మాత్రం పరకాల ప్రభాకర్, డాక్టర్ మిత్ర, శోభానాగిరెడ్డి, శోభ, కన్నబాబు లాంటివారు దర్శనమిచ్చేవారు. టీడీపీ,కాంగ్రెస్ నుంచి కీలక నేతలు, మాజీ మంత్రుల స్థాయి నేతలు భారీ సంఖ్యలో చేరినప్పటికీ.. వారిని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవడంలో, చిరంజీవి విఫలమయ్యారు. రాజకీయ వ్యవహారాలు తెలిసిన వారికి కాకుండా బావమరిదికి పెత్తనం అప్పగించి దెబ్బతిన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం లేకుండా, జిల్లా- పట్టణ-గ్రామ కమిటీలు లేకుండా కేవలం చిరంజీవి ఇమేజ్ మీదనే ఆధారపడటం కూడా నాటి పీఆర్పీ ప్రయోగం విఫలం కావడానికి ప్రధాన కారణం. ఇప్పుడు జనసేనదీ కాస్త అటు ఇటుగా అదే పరిస్థితి.
నిజానికి కులం కోణంలో చూసినా.. పార్టీపై పడిన కాపు కుల ముద్ర వల్ల పీఆర్పీ రాజకీయంగా లబ్థిపొందాల్సి ఉంది. రియల్ ఎస్టేట్ బూమ్ బాగా ఉన్న ఆ కాలంలో, కాపు నేతలు డజన్ల సంఖ్యలో పీఆర్పీలో చేరారు. సీటు వస్తుందన్న ఆశతో లక్షలు, కోట్లు ఖర్చు పెట్టారు. వారిలో చిరంజీవి అభిమాన సంఘ నేతలూ ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఒక్క చిరంజీవి అభిమానికీ కూడా సీట్లు ఇవ్వకపోవడంతో.. చాలా నియోజకవర్గాల్లో అభిమానులే పార్టీ ఆఫీసుకు నిప్పు పెట్టడమో, తాళాలు వేయడమో చేశారంటే అభిమానుల ప్రతిస్పందన, భావావేశాలు ఎంత తీవ్రంగా ఉంటుందో అర్ధమయింది. చివరాఖరకు టికెట్లు మాత్రం మరొక వర్గానికి ఇవ్వడంతో, టికెట్లు ఆశించి కోట్లు ఖర్చు పెట్టిన వారంతా తిరగబడి, పార్టీ అభ్యర్ధులను ఓడించారు. అప్పట్లో చిరంజీవి పక్కన కమ్మ వర్గం ఎక్కువగా ఉండటం కాపులను అసంతృప్తి పరిచింది.
ఆరకంగా చిరంజీవి వల్ల కాపు వర్గం ఆర్ధికంగా-రాజకీయంగా నష్టపోయింది. తాను ఎంత ప్రోత్సహించినా కులాభిమానంతో కాపులు పీఆర్పీవైపు వెళ్లారన్న ఆగ్రహంతో, నాటి సీఎం వైఎస్ కాపులను రాజకీయంగా దూరంగా పెట్టారు. టీడీపీ కూడా తాము ఎంత చేసినా కాపులు.. కులం కోణంలో పీఆర్పీ వైపు చూశారన్న అసంతృప్తితో, వారిని దూరంగా పెట్టింది. ఆ రకంగా చిరంజీవి పీఆర్పీ ప్రయోగంతో, కాపులు అటు రాజకీయంగా, ఇటు ఆర్ధికంగా నష్టపోవలసి వచ్చింది. మళ్లీ తిరిగి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించినప్పుడు కాపులను ప్రోత్సహించారు. అప్పటిదాకా కాపులు రాజకీయాల్లో అనాధగా ఉండిపోఒవలసి వచ్చింది.
ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ను సీఎం చేయాలంటూ చిరంజీవి-పవన్-రాంచరణ్ అభిమాన సంఘాలు నడుంబిగించడం వల్ల, లక్ష్యం నెరవేరుతుందా అన్న ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. నిజానికి జనసేన పార్టీ పెట్టి ఇన్నేళ్లయినా, ఇప్పటికీ సంస్థాగత నిర్మాణం లేదు. రాజకీయంగా ఎత్తు పైఎత్తులు వేసే బృందం లేదు. పేరుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉన్నా, అందులో ఎంతమంది ఉన్నారో అధినేత పవన్‌కూ తెలియదు. సినిమా షూటింగులు లేని సమయంలోనే ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ఇంకా ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌గా రూపాంతరం చెందలేదు.
టీడీపీ మాదిరిగా జనసేన కూడా రాజకీయ వ్యూహాలను, జీతాలు తీసుకునే ఉద్యోగుల పెత్తనానికే వదిలేసింది. పవన్ పర్యటనలు ఉన్నప్పుడే జన సేన ఉందనిపిస్తుంటుంది. మిగిలిన సమయాల్లో నేతలెవరూ కనిపించరు. నానాజీ, పోతిన మహేష్, శ్రీనివాసయాదవ్ వంటి అతికొద్దిమంది నేతలే క్షేత్రస్థాయిలో కనిపిస్తే, మిగిలిన వారు టీవీ చర్చల్లో మాత్రమే కనిపిస్తుంటారు. పవన్ తర్వాత నాదెండ్ల మనోహర్ కనిపిస్తున్నప్పటికీ, ఆయనది నియోజకవర్గానికి ఎక్కువ-జిల్లాకు తక్కువ వ్యవహారం. ఆయన ఎవరినీ ప్రభావితం చేయలేరు.
కాంగ్రెసులో ఉన్నప్పుడు స్పీకర్ పదవి తప్ప, మిగిలిన కాలంలో ఆయన పాత్ర శూన్యం. పైగా కాపు వర్గానికి ఆయన పెత్తనం రుచించడం లేదు. రాజకీయ అనుభవంతోపాటు, వివిధ పార్టీ నేతలతో సంబంధాలున్న రాజకీయ సలహాదారులెవరూ పవన్ పక్కన కనిపించరు. ఆముదం చెట్టే మహావృక్షాలుగా ఉన్న పరిస్థితి నెలకొందన్న వ్యాఖ్యలు జనసేన నేతల నుంచే వినిపిస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ తనకు కులం లేదు, మతం లేదని చెప్పినా.. వైసీపీ రెడ్డి-టీడీపీ కమ్మ పార్టీ మాదిరిగానే.. జనసేన కూడా కాపుల పార్టీ అన్న ముద్ర స్ధిరపడింది. పోనీ అలాగనుకున్నా కాపులు పూర్తి స్థాయిలో జనసేనను నమ్మే పరిస్థితి లేదు. కారణం గతంలో ప్రజారాజ్యం ప్రయోగమే. కాపుల సంఖ్యాబలం ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాల్లో కాపు-ఎస్సీ, కాపు-బీసీలకు పొసగని సామాజిక సమీక‘రణం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిని సరిదిద్దే ప్రయత్నాలు ప్రారంభం కానంతవరకూ.. కాపులతో ఇతర వర్గాలు కలిసేవరకూ చిరు ఫ్యామిలీ రాజకీయ ప్రయోగాలు ఫలించవన్నది కులవాదుల ఉవాచ. అంటే.. అప్పటివరకూ పవన్ సభలకు జనం వస్తారే తప్ప, ఓట్లు వేయని సంప్రదాయం కొనసాగుతూనే ఉంటుందన్నమాట.