దావోస్‌లో పంచన్న

– మిధున్‌తో ఫొటోలు వైరల్
( మార్తి సుబ్రహ్మణ్యం)

పంచ్ ప్రభాకర్ గుర్తున్నారా?
punchఅదేనండీ.. మన హైకోర్టు న్యాయమూర్తులు, చంద్రబాబు, లోకేష్, రఘురామకృష్ణంరాజు సహా విపక్షాలపై వీడియోలతో విరుచుకుపడ్డారే.. ఆయన!
ఏంటీ.. ఇంకా గుర్తుకు రావడం లేదా?
హప్పుడే మర్చిపోయారా?
హవునులెండి.. ఆ మాటకొస్తే ఆయన కేసు పరిశోధిస్తెన్న అంతలావు సీబీఐ అధికారులే పంచన్న పేరు మర్చిపోయారు. ఇక మానవమాత్రులం.. మనమెంత? మన జ్ఞాపకశక్తి ఎంత?
సరే.. ఏం ఫర్వాలేదు.. మళ్లీ ఓసారి గుర్తు చేసుకుందాం లెండి.

అదేనండీ.. జగనన్న సర్కారు పనితీరుపై నిరంతరం అక్షింతలు వేస్తూ, ప్రభుత్వ నిర్ణయాలను కొట్టిపారేస్తున్న హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పంచ్ ప్రభాకర్ అనే రాయలసీమ పెద్దారెడ్డిగారి తీరుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు సహా, చాలామంది కోర్టుకు ఫిర్యాదు చేశారు. చివరాఖరకు ఆయన సుప్రీంకోర్టు సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణనూ విడిచిపెట్టలేదు. దానితో హైకోర్టు జడ్జిగారు యమా సీరియస్సయి, సదరు పంచ్ ప్రభాకర్‌ను పట్రండని సీఐడీని కేకవేసింది.

అయితే సీఐడీ దొరలు నత్తలతో పోటీ పడి దర్యాప్తు చేసి, చివరాఖరకు చేతులెత్తేశారు. మాకు రఘరామకృష్ణంరాజు లాంటి వాళ్లను తీసుకువచ్చి కాళ్లు విరగ్గొట్టడం, సర్కారు శత్రువులు ఎక్కడున్నా సెల్‌టవర్ సిగ్నళ్లతో వెతికి పట్టుకోవడం వచ్చు గానీ, ఇలాంటి విచారణలు మా ఇంటా వంటా లేవని నిజాయితీగా చెప్పేసింది.

దానితో హైకోర్టు సీబీఐని పిలిచి, పంచన్నను తమ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. అయితే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లు సీబీఐ కూడా, సీఐడీ ‘తమ్ముడన్నయ్య’ మాదిరిగానే పనిచేస్తోంది. నత్తలు కూడా నవ్విపోతున్న సీబీఐ తీరును కడిగేసిన హైకోర్టు.. అతగాడి దర్శనభాగ్యం
punch-prbhakar-AP-High-Court తమకు ఎప్పుడు కలగచేస్తారని ప్రశ్నించింది. ‘అదిగో అతగాడేమో అమెరికా సిటిజనయిపాయె. ఇక్కడకు తీసుకురావాలంటే లెటర్లు, గిటర్లు లాంటి లక్షాతొంభై ప్రాబ్లెమ్స్- డజనున్నర వర్రీసుతోపాటు, కేంద్రం అనుమతి కావాలని ప్రతి వాయిదాకూ లంబాచోడా చిట్టా విప్పి, సినిమా కష్టాలు వినిపిస్తోంది.

ఆ మహానుభావుడిని మరెప్పుడు తీసుకువస్తారని ప్రశ్నిస్తే.. అసలు మేం ఆ పనిమీదనే తిండి, నిద్ర లేకుండా కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్నామని సీబీఐ అధికారులు.. రఘురామకృష్ణంరాజు తనను పోలీసులు ఎలా కొట్టారో తన పాదాలు చూపినట్లు.. సీబీఐ అధికారులు కూడా తమ కష్టానికి సింబాలిక్‌గా అరిగిపోయిన కాళ్లు చూపిస్తున్నారు. దానితో యధావిథిగా పంచ్ కేసు వాయిదాలు పడుతోంది. పాపం పంచన్న కోసం పరిశోధిస్తున్న సీబీఐ అధికారుల కాళ్లు కీళ్లు అరిగిపోయి, కరిగిపోయి, కళ్లు అరడుగు లోపలకు పోయినా.. ప్రభాకర్‌రెడ్డన్న మాత్రం దొరకడం లేదు. ఇదీ పంచ్ ప్రభాకర్ కేసు కథ.

సీన్ కట్ చేస్తే…
అసలా పంచ్ ప్రభాకరనేవాడెవరో మాకు తెలియదు. అతగాడికీ మా పార్టీకీ సంబంధం లేదంటూ, వైసీపీ యుఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐ వింగ్ తరఫున వాసుదేవరెడ్డన్న18-08-2021న ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. పంచ్ ప్రభాకర్‌ను వైసీపీ వ్యక్తిగా చిత్రీకరిస్తున్నారని, అతగాడికీ- తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అసలు అతడికి పార్టీలో ప్రాధమిక సభ్యత్వం కూడా లేదని స్పష్టం చేశారు. దానితో పార్టీ కోసం అమెరికాలో ఉన్న రెడ్డిగారు అంత కష్టపడి.. జగనన్న శత్రువులను రోజూ నానా బూతులు తిట్టి, జగనన్న ఫ్యాన్సుకు ఎనర్జీ ఇస్తుంటే.. ఆయనకు మద్దతునివ్వకుండా, పంచన్నతో పార్టీకి సంబంధం లేదనడం బాగోలేదంటూ అప్పట్లోనే జగనన్న వీరాభిమానులు, సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టి మరీ తెగ ఫీలయ్యారు. అది వేరే విషయం.

సీన్ కట్ చేస్తే..
జగనన్న ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి, అప్పులగుండం నుంచి బయటపడేసేందుకు కంటిమీద కునుకు లేకుండా దావోస్‌లో పర్యటిస్తున్నారు. ఆయనతోపాటు ఎంపీ మిథున్‌రెడ్డన్న కూడా ఉన్నారు. ఇప్పుడీ సోదంతా ఎందుకు? ఇదంతా పేపర్లు, టీవీల్లో రోజూ చూస్తున్నదే కదా? అని విసుక్కుంటే కుదరదు మరి! చదివితీరాల్సిందే.

అసలు ట్విస్టు మెలిక యవ్వారం ఇక్కడే ఉంది. హైకోర్టు జడ్జీల దెబ్బకు ఈమధ్య అయిపు అజా లేకుండా పోయిన మన పంచ్ ప్రభాకరుడు, మిధున్‌రెడ్డన్నతో దిగిన ఫోటో నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో
punch-midhun నొప్పులు లేకుండా, తెగ చక్కర్లు కొడుతోంది. దానితో.. అంతలావు సీబీఐకి దొరకని ప్రభాకర్‌రెడ్డన్న, బ్లూ కార్నర్ నోటీసును కూడా లెక్కచేయకుండా మిధున్‌రెడ్డన్నతో ఎప్పుడు, ఎలా కలిశాడబ్బా అన్న చర్చ షురవయింది. దీనిదుంపతెగ.. పంచన్న యవ్వారం అటు తిరిగి ఇటు తిరిగి మిధున్‌రెడ్డన్న దగ్గరకొచ్చి ఆగిందే?!

Leave a Reply