– సారె రూపంలో ఆడబిడ్డల తెలంగాణ సాంప్రదాయాన్ని అవమానించొద్దు కోటి మంది మహిళలకు చీరలు ఇస్తే వారు “కోటీశ్వరులు” ఎట్లా అవుతారు?
– చీరలు ఇస్తే మహిళల ఉన్నతి ఎట్లా జరుగుతుంది? – బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి
హైదరాబాద్: నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ కోటి మంది మహిళలకు చీరలు ఇస్తే వారు “కోటీశ్వరులు” ఎట్లా అవుతారో మహిళలందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చీరల పంపిణీ ద్వారా మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి జరుగుతుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. చీరలు ఇస్తే మహిళల ఉన్నతి ఎట్లా జరుగుతుంది? దాని ద్వారా తెలంగాణ ప్రగతి ఎట్లా జరుగుతుంది? అనేది రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.
సారె రూపంలో చీరలు పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది – అది మంచిదే. కానీ… సారె అంటే రేవంత్ రెడ్డి కి అర్థం తెలుసా? సారె ఎవరు ఎవరికి, ఏ సందర్భంలో ఇస్తారు అనేది రేవంత్ రెడ్డికి తెలుసా? సారె అంటే — బియ్యం నుంచి బంగారం వరకూ, పుట్టింటి వాళ్లు ఆడపిల్లలకు ఇచ్చే ఒక ఆభరణం. దాన్ని మీరు ఏ సందర్భంలో ఇస్తున్నారు? అనేది ముఖ్యంగా రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. సారె పెట్టాలంటే దానికి ఒక సందర్భం ఉంటుంది. మరి ఇప్పుడు ఏ పండగ ఉంది? రేవంత్ రెడ్డికి నిజంగా మీ బానిసత్వ స్వభావాన్ని నిరూపించుకోవాలని అనిపిస్తే — ఇందిరాగాంధీ జయంతి నుంచి సోనియా గాంధీ జయంతి (డిసెంబర్ 9) వరకు 21 రోజులు జపమాల వేసుకోండి. వారికి పొర్లుదండాలు పెట్టండి.
కానీ సారె రూపంలో ఆడబిడ్డల తెలంగాణ సాంప్రదాయాన్ని అవమానించొద్దు. ఈ రాష్ట్రంలో కోటి 68 లక్షల మహిళలు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కోటి చీరలు మాత్రమే పంచుతానంటోంది. మిగతా 68 లక్షల మహిళలు ఎందుకు కనిపించడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత — రెండు దసరాలు, రెండుసార్లు దీపావళి, రెండు ఉగాదులు.. ఇలా పండుగలు వచ్చాయి. అప్పుడు గుర్తుకురాని మహిళలు.. ఇప్పుడు అకస్మాత్తుగా ఏ సందర్భంలో గుర్తొచ్చారు? ఇప్పుడు సడెన్‌గా వారి మీద ప్రేమ కురిపించి చీరలు పెట్టడం వెనుక అర్థం ఏంటి? ఈ చీరల పంపిణీని విడతల వారీగా చేస్తున్నారు.
మొదటి విడత — డిసెంబర్ 9 వరకు రెండో విడత — మార్చిలో. మొదటి విడతలో 65 లక్షల చీరలు గ్రామీణ మహిళలకు, రెండో విడతలో 35 లక్షల చీరలు అర్బన్ మహిళలకు. ఎందుకు? ఎందుకంటే డిసెంబర్ 15న గ్రామ పంచాయతీ ఎలక్షన్ల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్. అందుకే — మహిళలను మోసం చేయడానికి, మహిళ ఓటు బ్యాంక్ కోసం కొత్త డ్రామా తెరపైకి తెచ్చారు. రేవంత్ రెడ్డి కొత్తగా నేర్చుకున్నది ఏమిటంటే — పక్క రాష్ట్రాల ఎలక్షన్ ఫలితాలు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ — ఎక్కడైతే మోదీ “లఘ్ పతి దీదీ” వంటి స్కీమ్స్ వల్ల మహిళలకు ప్రయోజనం జరిగిందో అక్కడ మహిళల ఓటు బ్యాంకు ఎలా పెరిగిందో చూసి… “తమకెందుకు ఇదే ఆలోచన రావద్దు?” అని అనుకున్నారు.
మహిళలు..భవిష్యత్తులో వాళ్ళ కాళ్ల మీద నిలబడేలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. కాని కేవలం ఎన్నికల వేళ చీరలు ఇచ్చి మోసం చేయాలనుకోవడం దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలన్నింటిని ఇప్పుడు తుడిచేసుకోవాలని చూస్తున్నారు. అధికారపీఠంలోకి వచ్చేముందు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయడంలేదు?
1) మహాలక్ష్మి పథకం ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామన్నరు. వాళ్లు నమ్మి ఓటు వేస్తే ఇవ్వకుండా మోసం చేశారు. ఇప్పటికి 23 నెలలు గడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తిగతంగా ఒక్కో మహిళకు రూ. 57,500 బకాయి పడింది. చీర ఇస్తే అది మాఫీ అవుతుందా?
2) స్కూటీల హామీ 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్నరు. స్కూటీ కాదు — బొమ్మ స్కూటీ కూడా ఇవ్వలేదు. చీరలతో ఈ హామీని కూడా మాఫీ చేయాలనుకుంటున్నారా?
3) వృద్ధులకు పెన్షన్ రూ.4000 పెన్షన్ హామీ ఇచ్చారు. వృద్ధ మహిళలు ఎంతో ఆశగా చూశారు. అయినా నిరాశే. ఇప్పుడు చీర ఇస్తే అది కూడా మాఫీ అవుతుందా?
4) తులం బంగారం ఆడబిడ్డ పెండ్లికి రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు చీర ఇచ్చి ఇది కూడా మాఫీ చేయాలనుకుంటున్నారా? అంగన్వాడీ టీచర్లకు రూ. 9,000 నుంచి రూ.18,000 వేతనం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకు ఆ హామీ కూడా అమలు చేయలేదు. ఇవన్నీ హామీలు నెరవేర్చకుండా, ఇప్పుడు కొత్తగా చీరల కార్యక్రమం పేరుతో మహిళలను మోసం చేసి, మహిళల ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న ప్రయత్నం తప్పితే మరేంలేదు. తెలంగాణ ఆడపడుచులు కాంగ్రెస్ చేస్తున్న చీరల పంపిణీ వంటి జిమ్మిక్కులకు మోసపోవడానికి సిద్ధంగా లేరు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 1999లో దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గారు ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేశారు.
మహిళలు గుర్తు చేసుకోవలసిన విషయం: కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చీరలు పంపిణీ చేస్తున్న ఉద్దేశ్యం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం మహిళా సమృద్ధి యోజన కింద ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుని, వాళ్లకు ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చి, మైక్రో క్రెడిట్స్ అందించే విధంగా ఆదుకుంటోంది. నాబార్డ్, బ్యాంక్ లింకేజ్ ద్వారా క్రెడిట్స్ అందించడం కూడా ఈ పథకాల కింద జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్స్ ను మన రాష్ట్రంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం అవి మహిళలకు అందించకుండా కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తోంది.