– ఉద్యోగసంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు
– ఏ ఉద్యోగికి 1 వ తేదీ జీతం ఇచ్చారో ఒక్క ఉద్యోగి బ్యాంకు స్టేట్మెంట్ చూపించండి
– ఉద్యోగుల ధర్నాలకు మద్దతు
– ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి చైర్మన్
అమరావతి: ముఖ్యమంత్రి ఉద్యోగసంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఎన్నికలలో ముఖ్యమంత్రి గారి సహకారంతో రాష్ట్రం అంతా తిరిగి ఉద్యోగులను చైతన్య పరిచాము అని చెప్పుకుంటున్న వారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఉద్యోగులు దిక్కులేనివారు అయ్యారు. సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
గతంలో మంత్రుల కమిటీ ఉండేది, ప్రభుత్వ సలహాదారులు అందుబాటులో ఉండేవారు. సమస్యలు కనీసం వినేవారు. ఇపుడు ఉద్యోగులను ఎవరు పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం లో ఉద్యోగులు రోడ్డు మీదకి రావడానికి 3 సంవత్సరాలు పడితే ఇపుడు సంవత్సరానికే ఉద్యోగులను రోడ్డు మీదకి తెచ్చింది ప్రభుత్వం
డాక్టర్లు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, టీచర్లు… ఇలా ఉద్యోగులందరూ సమస్యలు పరిష్కారం కోసం ధర్నాలకు దిగారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. 16 నెలలుగా ఒక్క DA ఇవ్వని ప్రభుత్వాన్ని ఇపుడే చూస్తున్నాము. అలాగే 4 DA లు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం కూడా ఇదే. టీడీపీ ప్రభుత్వం ఎపుడు అధికారంలో ఉన్న ఉద్యోగులు DA ల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 2004 కు ముందు DA ల కోసం ఇబ్బందులు పడ్డారు.
2014-19 మధ్య 5 సంవత్సరాల కాలంలో 10 DA లకు గాను అప్పటి ప్రభుత్వం 7 DA లే ఇచ్చింది. 2019-24 మధ్య గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 11 DA లు ఇచ్చింది. ఒకటో తారీఖు జీతం ఇస్తున్నామని ఆర్థికమంత్రి చెబుతున్నారు. ఏ ఉద్యోగికి 1 వ తేదీ జీతం ఇచ్చారో ఒక్క ఉద్యోగి బ్యాంకు స్టేట్మెంట్ చూపించండి.
ఈ నెల దసరా పండుగ ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. పెండింగ్ బకాయిలు చెల్లిస్తామన్నారు. చెల్లించడం మాట అటుంచి కనీసం బకాయిలు ఎంత అనేది కూడా చెప్పడం లేదు. RTI చట్టం కింద అడిగినా మా దగ్గర సమాచారం లేదు అని ఆర్ధిక శాఖ సమాధానం ఇచ్చింది.
పెండింగ్ బకాయిలు 22 వేల కోట్ల రూపాయల నుంచి 32 వేల కోట్ల రూపాయలకు పెరిగాయని తెలుస్తోంది, అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలకు 22 వేల కోట్ల రూపాయల బకాయిలు పడితే ఈ ప్రభుత్వం 16 నెలలకు 10 వేల కోట్ల బకాయి పెట్టింది. ఈ లెక్కన ముందు ముందు ఈ బకాయిలు ఏ స్థాయికి చేరతాయో తలుచుకుంటే భయం వేస్తుంది
గత ప్రభుత్వం అంతకు మందు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని అసెంబ్లీలో చట్టం చేసి GO ఇచ్చింది. సుమారు 3400 మందిని రెగ్యులర్ చేశారు. మిగిలిపోయిన వారిని రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వానికి ఏంటి భాద? గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వాలంటీర్ల స్థాయికి దిగజార్చారు.
లక్షా ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగులు 2 వారాలుగా ధర్నాలు చేస్తుంటే కనీసం వారిని పిలిచి మాట్లాడటానికి ప్రభుత్వానికి మనసొప్పడం లేదా? గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులంటే అంత చులకనా?
ఉద్యోగులకు టెలీకాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సుల గోల ఎక్కువైంది. ఈ విషయంలో MPDO ల పరిస్థితి దారుణంగా ఉంది. MPDO ల మీద 10 మంది పెత్తనం చేస్తుంటే వారికి పని చేసే టైమ్ ఎక్కడుంది? ఇవన్నీ చాలవన్నట్లు వారితో చెత్త ఫోటో తీయిస్తున్నారు. ఇలా ఏ వర్గం ఉద్యోగులను వదలకుండా ఈ ప్రభుతం అందరినీ వేదిస్తోంది
ఇంతవరకు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసి చేసి విసిగిపోయాము. ఇపుడు ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇపుడు అందరూ ఉద్యోగులు అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పని చేయాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరాటం చేద్దాం. రేపటి ఉద్యోగుల ధర్నాలకు మేము మద్దతు ఇస్తున్నాం, రేపు టీచర్ల చేపట్టిన విజయవాడ ధర్నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. APGEF అనుబంధ ఉపాధ్యాయ సంఘాలను ఈ ధర్నాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తోంది
గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు ప్రభుత్వం దిగి వచ్చేదాక ధైర్యంగా పోరాడాలి. త్వరలో మా ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని తదుపరి కార్యాచరణ గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం