దసపల్లా భూముల వ్యవహారాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దు

-భూ టైటిల్ పై+సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది
-ఆ కోర్టు ఆదేశాలతోనే రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం
-భూ లావాదేవీలతో విజయసాయిరెడ్డి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు
-దసపల్లా భూ యజమానులు, బిల్డర్లు స్పష్టత

దసపల్లా భూ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, రాజకీయాలతో వాటిని ముడిపెట్టొద్దని భూ యజమానులు, బిల్డర్లు స్పష్టత ఇచ్చారు. ఆ భూముల్లో కొన్ని 22/ఏలో ఉన్నప్పటికీ తాము కోర్టుల్ని ఆశ్రయించామని, త్వరలో గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందని, యూఎల్‌సీకి సంబంధించి కూడా పెండింగ్ లో ఉంటే తాము న్యాయపరంగా పోరాడుతున్నామని తేల్చి చెప్పారు. సర్వే నంబర్లు, రాణి కమలాదేవీ నుంచి తీసుకున్న సంతకాలు, భూ యజమానులు, డెవలెపర్‌ మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించి ఓ ప్రకటన కాపీ కూడా విడుదల చేశారు. సర్క్యూట్‌ హౌస్‌కు సంబంధించి ఎప్పుడో పరిహారం చెల్లించేశారని, అక్కడున్న వాటర్‌ ట్యాంకులు, ఇతరత్రా విషయంలో న్యాయపరమైన చిక్కుల్లేకుండా అందరితోనూ మాట్లాడామని, ఆ సమస్యలు కూడా త్వరలో తీరిపోతాయన్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు విజయసాయిరెడ్డి కి, ఆయన కుటుంబానికి ఈ భూముల నర్సీంలో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దసపల్లా భూముల వ్యవహారంలో గత కొన్నాళ్లగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో శనివారం నగరంలోని ఓ హోటల్‌లో అక్కడి ప్లాట్ల యజమానులు దసపల్లా రాఘవేంద్రరావు, దసపల్లా కోటేశ్వరరావు, కంకటాల మల్లిక్‌, బాలాజీ, సుబ్బరాజు సహా డెవలపర్స్‌ అయిన ఉమేష్‌, గోపీనాథ్‌రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు.

ఈ ప్రభుత్వం రాకముందే: ఉమేష్‌
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆయా భూ యజమానులతో మాట్లాడి అపార్ట్‌మెంట్‌లు కట్టించేందుకు వీలుగా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇందుకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన అంశాలతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదన్న నేపథ్యంలోనే వాటాలు వేసుకున్నామని మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి, డెవలెపర్‌ అయిన ఉమేష్‌ తెలిపారు. 22/ఏలో కొన్నే ఉన్నాయని, అయినప్పటికీ వాటిని రిలీజ్‌ చేసేందుకు అధికారుల నిర్లక్ష్యంపై కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయని, సుప్రీం కోర్టు 2014లోనే తీర్పునిచ్చినా అధికారులు అమలు చేయకపోవడంతో కంటెప్ట్‌ ఆఫ్‌ కోర్ట్‌ అంటూ పిటిషన్‌ వేశామన్నారు. ఒకేసారి పెద్దపెద్ద అపార్ట్‌మెంట్‌లు కట్టే సమయంలో బ్లాస్టింగ్‌ వంటివి చేయాల్సి వస్తుందని, ధరలు కూడా పెరుగుతుంటాయని, వడ్డీలు కట్టాల్సి వస్తుందని, కొన్ని సందర్భాల్లో అమౌంట్‌ డెడ్‌ అవుతుందని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే డీజీపీఏ సమయంలో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ఎంపీ విజయసాయి తనకు 1996నుంచీ పరిచయం అని, కోవిడ్‌ సమయంలో ప్రగతి భారత్‌ ట్రస్టు ద్వారా అనేక సేవలందించామని, అప్పుడే వ్యాపారి గోపీనాథ్‌రెడ్డి పరిచయమయ్యారని, ఆయన్ను డైరెక్టర్‌గా పెట్టి అస్యూర్‌ ఎల్‌ఎల్‌పీ ప్రారంభించామని, తనకు హైదరాబాద్‌లో అనేక వ్యాపారాలున్నాయని, తన వ్యవహారాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ఉమేష్‌ స్పష్టం చేశారు.

22ఏళ్ల నుంచీ బాధలు పడుతూనే ఉన్నాం: మల్లిక్‌
దసపల్లా భూముల వ్యవహారంలో ఓ ప్లాట్‌ యజమానిగా తాను 22ఏళ్ల నుంచీ బాధలు పడుతున్నామని, ఇప్పుడిప్పుడు చిక్కుముడులు వీడుతుండడంతో 65మంది యజమానులు చాలా సంతోషంగా ఉన్నారని కంకటాల మల్లిక్‌ తెలిపారు. వాటాల విషయంలో 33శాతం వరకు తమకు వస్తాయని, అవన్నీ రికార్డెడ్‌గానే ఉంటాయన్నారు.

థర్డ్‌పార్టీకిచ్చేస్తే మంచిదని భావించాం: జాస్తి బాలాజీ
ప్రభుత్వంతో ఉన్న చిక్కుముడులు, భవన నిర్మాణాల విషయంలో తాము ఇబ్బందులు పడలేక, ఎవరికైనా థర్డ్‌పార్టీకి డీల్‌ అప్పగిస్తే బావుంటుందనే ఉద్దేశ్యంతోనే ఈ ఎల్‌ఎల్‌పీతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని జాస్తి బాలాజీ స్పష్టం చేశారు. గజం స్థలం ఇస్తే 12అడుగుల నిర్మాణం ఇస్తామని, అంతా మాట్లాడుకున్నాకే సంతకాలు చేశామని, చాలామంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన కారణంగా ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు లేటయ్యాయని తెలిపారు.

యూఎల్‌సీ పెండిరగ్‌లో ఉంది: గోపీనాథ్‌ రెడ్డి
తాను విశాఖలో వ్యాపారం నిమిత్తం వచ్చిన నాటి నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేద్దామనే భావిస్తూ వచ్చానని, ప్రగతి భారత్‌ ట్రస్టు ద్వారా పరిచయం అయిన ఉమేష్‌ ద్వారా ఎల్‌ఎల్‌పీ పెట్టామని గోపీనాథ్‌ రెడ్డి తెలిపారు. వ్యాపారం, ప్రకటనలు, ఆర్థిక లావాదేవీల విషయంలో తాను అన్నీ చూసుకుంటానన్న ఒప్పందం మేరకే తాను పనిచేస్తున్నానన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారం విషయంలో ఈ డీల్‌ కుదరకముందే జరిగాయని, ఈ భూములకు, రాజకీయాలకు, ఎంపీ కుటుంబానికీ ఎలాంటి సంబంధం లేదన్నారు. వయస్సు మళ్లిన కారణంగా రాణీ కమలాదేవీ రాలేకపోతున్నారని, ఇందులో ఆమె ప్రమేయం కూడా ఏమీ ఉండదని, అంతా పక్కాగానే జరుగుతోందన్నారు. దసపల్లా భూ వ్యవహారాలకు సంబంధించన డాక్యుమెంట్లన్నీ తమ వద్ద ఉన్నాయని, ఇందులో అనుమానాలేవీ వద్దని స్పష్టం చేశారు.

భూమి ఇచ్చాం..బిల్డింగ్‌ ఇస్తామన్నారు: సుబ్బరాజు
దసపల్లా భూముల విషయంలో యజమానులకు, డెవెలపర్లకు మధ్య జరిగిన లావాదేవీల్లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులూ తలెత్తకుండా ఉండేందుకే తాను కొన్ని సార్లు మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చిందని సుబ్బరాజు స్పష్టం చేశారు. మొత్తం 75,600గజాలకు సంబంధించి గజానికి 12అడుగుల చొప్పున ఇచ్చే విషయంలో అందరూ మాట్లాడే నిర్ణయం తీసుకున్నారని, ఇందులో ఇతరులకు ఎలాంటి సంబంధం లేదని, యూఎల్‌సీ, 22/ఏకు సంబంధించి మాత్రం అధికారుల నిర్లక్ష్యంపై మాత్రం ఎప్పటి నుంచో వాదనలు జరుగుతున్నాయని, త్వరలో కోర్టు నుంచి అనుకూలమైన తీర్పు వస్తుందని తెలిపారు. తమకు న్యాయపరంగా రావాల్సిన విధంగా రాలేదు కాబట్టే, రిఫ్యూజ్‌ చేశారు కాబట్టే కోర్టుల్ని ఆశ్రయించామన్నారు. దాదాపు 29లక్షల చ.అడుగుల విస్తీర్ణం విషయమై 9లక్షల అడుగుల వరకూ యజమానులకు వెళ్లేలా డెవలెపర్లు చర్యలు తీసుకున్నారని, ఇది వాళ్లకు వాళ్లకు మధ్య అంతర్గతంగా జరిగిన ఒప్పందాలని, ఇందులో వేరే వ్యక్తుల, ప్రభుత్వ ప్రమేయమేదీ ఉండదన్నారు. విలేకరుల సమావేశానికి హాజరైన ఇతర వ్యక్తులు కూడా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

Leave a Reply