– పూర్తిస్థాయిలో నష్టాన్ని మదించి.. ప్రభుత్వ సహాయానికి చర్యలు
– గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో అహర్నిశలు శ్రమిస్తున్నాం
– 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ
– అన్ని బృందాలనూ సమన్వయపరుచుకుంటూ పనిచేస్తున్నాం
– ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సహాయక చర్యలు చేపడుతున్నాం
– పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చే పనుల్లో నిమగ్నమైన అధికార యంత్రాంగం
– 10 వేల మంది సిబ్బందితో శరవేగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
ఊహించని విధంగా విజయవాడ, పరిసర ప్రాంతాల్లోకి ముంచెత్తిన వరద నీరుతో ఇబ్బందులుపడిన ప్రజలు అధైర్యపడొద్దని.. వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై కలెక్టర్ సృజన గురువారం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. 24 గంటల వ్యవధిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని.. సీపీవో రికార్డులను పరిశీలించడం జరిగిందని.. గత 200 ఏళ్లలో ఎప్పుడూ విజయవాడ, కృష్ణా జిల్లా ప్రాంతంలో ఈస్థాయి వర్షపాతం నమోదుకాలేదన్నారు.
ఈ వర్షాల నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే బుడమేరుకు సంబంధించి గండి కారణంగా 40 వేల క్యూసెక్కుల నీరు అకస్మాత్తుగా నగరంపైకి వచ్చిందన్నారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11 లక్షల 43 వేలకు పైగా క్యూసెక్కుల మీరు వచ్చి చేరిందని తెలిపారు. మూడు రకాల ఉపద్రవాలు ఒకేరోజున విజయవాడపై పడ్డం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు.
64 కార్పొరేషన్ వార్డుల్లో 32 వార్డులు జలమయమయ్యాయని.. అర్బన్ ప్రాంతాలతో పాటు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల్లోని కొన్ని ప్రాంతాలపై కూడా వరద ప్రభావం పడిందని తెలిపారు.
24 గంటలూ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ
ఊహించని విధంగా విపత్తు సంభవించిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి పర్యవేక్షణలో మొత్తం అధికార యంత్రాంగం పనిచేస్తోందని, సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారుల భాగస్వామ్యంతో బాధితుల అవసరాలను గుర్తించి, సేవలందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రత్యేక అధికారులు వచ్చారన్నారు. ఈ ప్రత్యేక అధికారులకు ఈ ప్రాంతం కొత్త కాబట్టి వారికి సరైన అవగాహన కల్పించడం, వనరులను అందుబాటులో ఉంచడం ఆహారం, రవాణా, డ్రోన్లు, రెస్క్యూ టీమ్స్, పారిశుద్ధ్యం, టెక్నికల్ టీమ్స్.. ఇలా అన్ని బృందాలను సమన్వయపరుచుకోవడం వంటి పనులను గౌరవ ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతల ప్రకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండాలి కాబట్టి.. కంట్రోల్ రూమ్ కేంద్రంగా రాత్రీ పగలూ అనే తేడాలేకుండా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆహారానికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు
ప్రజలకు నిత్యం ఆహారం, మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు వంటి వాటిని అందిస్తున్నట్లు కలెక్టర్ సృజన పేర్కొన్నారు. తిరుపతి, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి కూడా అవసరం మేరకు వనరులను సమీకరించుకొని సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి రెండు రోజులు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని.. బోట్లలో కూడా వెళ్లేందుకు కష్టమైందన్నారు. గత ఆదివారం నాటికి మూడునాలుగు బోట్లు ఉండేవని.. ఈ రోజు 29 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, 300 వరకు బోట్లు వరకు సహాయకచర్యల్లో భాగస్వామ్యమయ్యాయన్నారు. ఒకదశలో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీళ్లు, మందులు వంటివి అందించడం జరిగిందని.. డ్రోన్లు కూడా సహాయక చర్యల్లో కీలకపాత్ర పోషించాయన్నారు.
ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటుపడుతోందని.. పైన క్యాచ్‌మెంట్ ఏరియాలో ఎలాంటి వర్షం కురియకుంటే, ఈరోజురాత్రికి సాధారణ స్థితికి వస్తుందని వివరించారు. ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ఒకప్పుడు 11 లక్షలకుపైగా ఉంటే ఇప్పుడు 1,43,000కు తగ్గిందన్నారు. బుడమేరుకు పడిన మూడు గండ్లలో బుధవారం రాత్రికి రెండు గండ్లు పూడ్చడం జరిగిందని.. మిగిలిన గండిని కూడా పూడ్చే పని జరుగుతోందని.. అదిపూర్తయితే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందన్నారు.
ప్రస్తుతం ఆహారానికి ఎక్కడా ఇబ్బంది లేదుకానీ బ్రెడ్స్ వంటివి, మెడికల్ కిట్లు వంటివి అడగడం జరుగుతోందని.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈరోజు ఉదయం నాటికి 26 వార్డుల్లో నీరు దాదాపు బయటకు వెళ్లిందని.. జక్కంపూడి, అంబాపురం, సింగ్‌నగర్‌లోని నందమూరి కాలనీ, వాంబే కాలనీ, కండ్రిగ తదితర ప్రాంతాల్లో ఇంకా నీరు ఉందని.. నీరు తగ్గిన చోట పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం జరుగుతోందన్నారు. దాదాపు 10 వేలమంది శానిటేషన్ వర్కర్లు ఇందుకు పనిచేస్తున్నారన్నారు. మంచినీరు, కరెంట్ సరఫరాను చాలావరకు పునరుద్ధరించామని.. పూర్తిస్థాయిలో పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
నష్టాన్ని పూర్తిస్థాయిలో మదించి, సహకారం అందిస్తాం:
సహాయక చర్యలు అనంతరం శుక్రవారం నుంచి నష్టాన్ని అంచనా వేసే పని మొదలుపెట్టి.. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు ఇలా ప్రతి అంశానికి సంబంధించి నష్టాన్ని అంచనా వేసి బాధితులకు ప్రభుత్వం సహకారం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పరిహారం మొత్తాన్ని కూడా అందించడం జరుగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ నష్టం జరిగినందున పంట, ఇతర నష్టాలను అంచనా వేసి ప్రభుత్వం ద్వారా పరిహారం అందజేయడం జరుగుతుందని కలెక్టర్ సృజన వెల్లడించారు.