Suryaa.co.in

Telangana

కాళేశ్వరం కోసం ఇక పైసా ఖర్చు పెట్టొద్దు

– అప్పుడు అంతా తానేనన్న కేసీఆర్ ఇప్పుడు తప్పించుకుంటున్నారు
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇకపై ప్రజాధనాన్ని వెచ్చించవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇది పూర్తిగా నిరుపయోగమైన ప్రాజెక్టు అని అభిప్రాయపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నీ తానై వ్యవహరించిన కేసీఆర్, ఇప్పుడు మాత్రం ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేనట్లు మాట్లాడుతున్నారని, తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని కూనంనేని విమర్శించారు.

ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదని ఆరోపించారు. ప్రస్తుతం పంటలకు అందుతున్న నీరంతా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే వస్తోందని స్పష్టం చేశారు.

కేంద్రం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని, మావోయిస్టుల మృతదేహాలను చూసి కూడా కేంద్రంలోని పెద్దలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. మావోయిస్టు నేత కేశవరావు మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం అత్యంత దారుణమని అన్నారు.

LEAVE A RESPONSE