Suryaa.co.in

Editorial

అద్దంకి ‘దేశం’లో కమ్మ కాపు ల సం‘కుల’సమరం

– జనసేన కాపు నేతను బెదిరించిన టీడీపీ కాపు నేత
– దానితో తనకు పవన్, బాబు మద్దతుందంటూ పోస్టింగ్ పెట్టిన జనసేన నేత
– జనసేన కాపు నేతను దూషించిన టీడీపీ నేతల ఆడియో వైరల్
– ఇద్దరు కాపు నేతలకు మంత్రి ప్రోత్సాహంపై కమ్మ వర్గం ఆగ్రహం
– కమ్మ కులాన్ని దూషించిన వైనంపై సమావేశం నిర్వహించిన ఆ వర్గ నేతలు
– కాపు నేతలు క్షమాపణ చెప్పాలని తీర్మానం
– కాపు నేతలను సమర్ధించిన మంత్రి పీఏపై కమ్మనేతల కన్నెర్ర
– అద్దంకి కూటమిలో కమ్మ-కాపు పంచాయతీ

( సుబ్బు)

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో కూటమి మధ్య ‘కుల’కులం మొదలయింది. కూటమిలోని టీ డీపీ-జనసేనకు చెందిన కమ్మ-కాపు వర్గాల ఆధిపత్యపోరు కుల సంఘ సమావేశాలతో ముదురుపాకానపడింది. తమ కులాన్ని దూషించిన కాపు నేతలు క్షమాపణ చెప్పాలంటూ కమ్మసంఘం.. ఏకంగా సమావేశం నిర్వహించి చేసిన హెచ్చరిక పరిణామాలు, అద్దంకిలో వైసీపీకి లాభం…

అద్దంకి కమ్మవర్గంలో ఇప్పటికే పాత టీడీపీ-కొత్త టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఆ తలనొప్పి సరిపోదన్నట్లు.. కమ్మ-కాపు; బలిజ వర్సెర్ బలిజ కుల పంచాయితీ, విపక్ష వైసీపీకి కలసివస్తోందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇటీవల బలిజ వర్గానికి చెందిన జనసేన యువనేత గోరంట్ల సాయిని బెదిరించిన ఇద్దరు టీడీపీ బలిజ నాయకుల మధ్య.. సోషల్‌మీడియా వేదికగా నడిచిన వివాదంలో కమ్మవర్గాన్ని దూషించిన వైనం.. చినికి చినికి గాలివానగా మారి, ఇప్పుడది కమ్మ-కాపు నేతల మధ్య ఘర్షణకు దారితీసే ప్రమాదం ఏర్పడిందని, టీడీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జనసేన-టీడీపీలోని బలిజల మధ్య జరిగిన వివాదంలో.. తమ కులాన్ని ఎందుకు విమర్శిస్తున్నారంటూ, కమ్మ సంఘనాయకులు ఏకంగా కుల సమావేశం నిర్వహించి, తమ కులాన్ని దూషించిన బలిజ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని భీష్మించే వరకూ వెళ్లడం, మంత్రి గొట్టిపాటి రవికి సమస్యగా పరిణమించింది.

అసలు మంత్రి గొట్టిపాటినే బలిజ నేతలను ప్రోత్సహిస్తూ తమను పక్కనపెడుతున్నారని.. తొలి నుంచి పార్టీలో ఉన్న కమ్మవారిని కాదని, గొట్టిపాటితో పార్టీలోకి వచ్చిన వారికే పనులు చేస్తున్నారని తొలి నుంచీ టీడీపీలో కొనసాగుతున్న కమ్మ నాయకులు, ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రధానంగా బలిజ వర్గానికి చెందిన ఒక డీలర్, ఒక మహిళా కౌన్సిలర్ భర్తకు మంత్రి పెత్తనం ఇవ్వడాన్ని టీడీపీలోని కమ్మవర్గం సహించలేకపోతోంది. ఈ క్రమంలో కొత్తగా తెరపైకి వచ్చిన కాపు-కమ్మ పంచాయితీతో పార్టీకి నష్టమన్న ఆవేదన కూటమి నేతల్లో వ్యక్తమవుతోంది.

బలిజ వర్గానికి చెందిన జనసేన యువనేత గోరంట్ల సాయిని బెదిరించిన టీడీపీకి చెందిన మరో బలిజ ఆడియోలో.. ‘‘అద్దంకిలో గొట్టిపాటి రవి ఉన్నా, కమ్మోళ్లే మమ్మల్ని ఏమీ పీకలేకపోయారు. నువ్వేంచేస్తావ’’ంటూ బూతులతో బెదిరించిన వైనానికి జనసేన యువనేత సాయి ఘాటుగానే బదులిచ్చారు. ఇంతకూ జనసేన-టీడీపీలోని బలిజల మధ్య ఘర్షణలకు కారణం.. మంత్రికి అనుచరుడిగా ఉన్న మరో బలిజ నేత భూమి ఎన్‌ఓసీకి ఒక అనర్హుడిని సిఫార్సు చేయడం.

అది తెలిసిన జనసేన బలిజ యువనేత గోరంట్ల సాయి, ఏఎస్‌ఓ వద్దకు వెళ్లి దానిని అడ్డుకున్నారు. ఆ విషయాన్ని సదరు ఏఎస్‌ఓ టీడీపీ బలిజ నేతకు సమాచారం ఇచ్చారు. ఆ విషయం తెలిసిన మంత్రి అనుచరుడయిన డీలర్, తనపై కొందరిని కొట్టేందుకు పంపించారన్నది జనసేన నేత ఫిర్యాదు.

కానీ వారి మధ్య జరిగిన వివాదంలో కమ్మ కులాన్ని తీసుకురావడం కమ్మసంఘానికి ఆగ్రహం కలిగించింది. అది చినికి చినికి గాలివానగా మారి, తాజాగా అద్దంకి కమ్మ కల్యాణమండపంలో కుల సమావేశం నిర్వహించేవరకూ వెళ్లింది. అద్దంకి కమ్మ సంఘం నాయకులు నర్రా గోపాల్, కోనేటి అనిల్, పూర్ణ, పరిటాల రామయ్య, పర్చూరి శ్రీనివాసరావు, యలమందరావు వంటి టీడీపీ-బీజేపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఆ సమావేశానికి.. మంత్రితో తిరిగే కొందరు కమ్మనాయకులు మినహా, నియోజకవర్గానికి చెందిన కమ్మ వర్గం హాజరయింది.

బలిజ నాయకుల వివాదంలో కమ్మ కులాన్ని దూషించడంపై కమ్మ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దానికి వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కమ్మ నాయకులు మంత్రి పీఏని కలిసి ఫిర్యాదు చేస్తే.. ఆయన బలిజ నాయకులకే మద్దతునివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనితో రంగంలోకి దిగిన మంత్రి గొట్టిపాటి రవి బలిజ నేతలను పిలిచి.. కమ్మకులానికి క్షమాపణ చెప్పి, వివాదానికి తెరదించాలని ఆదేశించారు. దానితో మంత్రి ఆదేశంతో బలిజ నాయకుడు చిట్టాల శ్రీనివాసరావు..‘‘ తాను తన కులానికి చెందిన జనసేన యువనేతను మందలించే క్రమంలో ఫ్లోలో కమ్మవారిని తిట్టానే తప్ప ఉద్దేశపూర్వకంగా తిట్టలేదని, ఆ మాట కొంతమందిని బాధిస్తే ఐయాంసారీ’’అని పోస్టు చేశారు. అయినా శాంతించని కమ్మసంఘం నాయకులు.. చిట్టాల శ్రీనివాసరావు, రాముడు బహిరంగ క్షమాపణ చెప్పాలని భీష్మించుకోవడంతో మంత్రి గొట్టిపాటి తలపట్టుకోవాల్సి వచ్చింది.

తాజాగా కొటికలపూడిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్లిన గొట్టిపాటి.. అక్కడి కమ్మవారిని పిలిచి, కుల సంఘాల సమావేశాలకు పోవద్దని హితవు పలికినట్లు టీడీపీకి చెందిన కమ్మ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం కమ్మ-కాపు;బలిజనేతల మధ్య ఉన్న ఆవేశం, ఉద్రిక్తత చూస్తుంటే ఆ రెండు కులాల మధ్య ప్రత్యక్ష దాడులు జరిగే ప్రమాదం కనిపిస్తోందని కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A RESPONSE