Suryaa.co.in

Editorial

ఫాఫం… గద్దర్ !

( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘మైసూర్‌బజ్జీలో మైసూర్ ఉండదు.. గద్దర్ అవార్డ్స్‌లో గద్దర్ ఉండరు’’

‘‘ గద్దరన్నను కాదు. గద్దర్ అవార్డుల ప్రహసనాన్ని వ్యతిరేకిస్తున్నాం. అందుకే ‘‘సేవ్ ‘‘గద్దర్..సేవ్ తెలంగాణ’’ పిలుపును తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక యావత్ తెలంగాణ ప్రజలకు ఇస్తోంది. సోషల్‌మీడియా వేదికగా మీరూ ప్రభుత్వానికి మన అభిప్రాయం తెలపండి. మన ఆకాంక్షలను మన ప్రభుత్వానికి తెలపడం కనీస ధర్మం’’

‘‘ప్రజాగాయకుడు గద్దర్‌గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రతి సందర్భంలో గద్దర్ గారి పేరును జపం చేసే కాంగ్రెస్ సర్కార్ వారి పేరు మీద ఇస్తున్న సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో, గద్దర్ గారి ఫొటో లేకపోవడం బాధాకరం. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనయినా వారి ఫొటో పెట్టి గౌరవించాలని కోరుతున్నా- బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత’’

ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై తుపాకీ గురిపెట్టి.. తుపాకీ గొట్టం ద్వారానే అధికారం సిద్థిస్తుందంటూ.. ఎన్నికలు బహిష్కరించాలని.. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు, ప్రజల భద్రతకు జిమ్మేదారీగా ఉన్న పోలీసుల ప్రాణాలను మందుపాతరలతో వేలాదిమందిని అమరపురికి పంపిన నక్సల్స్ గొంతుకయిన గద్దర్ పేరుతో.. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఏర్పాటుచేసిన, సినిమా అవార్డులకు సంబంధించిన రియాక్షన్స్ ఇవి. సమైక్య రాష్ట్రంలో నంది అవార్డుల స్థానంలో.. తెలంగాణ సర్కారు కొత్తగా పెట్టిన గద్దర్ అవార్డ్స్ ఆహ్వానపత్రం, ఆ అవార్డు ప్రతిమలో చివరాఖరకు అదే గద్దర్ ఫొటో లేకపోవడమే ఈ గత్తరకు కారణం.

నిజమే.. అసలు ఈ గత్తర ఇప్పటిది కాదు. రాజ్యానికి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన నక్సల్స్‌కు, మైదాన ప్రాంతంలో అధికార ప్రతినిధి అయిన విఠల్ అనే గద్దర్ పేరిట అవార్డులు ప్రకటించినప్పుడే గత్తర మొదలయింది. కొన్ని వందలమంది పోలీసులు, అధికారులను హత్య చేసిన నక్సల్స్‌ను నిర్భయంగా సమర్ధించిన గద్దర్‌ను… నాటి స్పీకర్, నేటి మంత్రి శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావు, డికె అరుణ తండ్రిని పొట్టనపెట్టుకున్న నరహంతక నక్సల్స్ ప్రతినిధి గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఎలా ఇస్తారంటూ బండి సంజయ్ అప్పుడే నిలదీసినా, సర్కారు నుంచి సమాధానం కరవు. ఒక పరదేశీనాయుడు, ఇంకో కెఎస్ వ్యాస్, మరో ఉమేష్‌చంద్రను మట్టుబెట్టిన నక్సల్స్‌ను సమర్ధించే గద్దర్ పేరిట అవార్డులిస్తున్న పాలకుల నిర్ణయాన్ని, పోలీసు అధికారుల సంఘం సమర్థిస్తుందా అన్న ప్రశ్నలకు ఇప్పటిదాకా జవాబు లేదు.

ఇక గద్దర్ సినిమా అవార్డుల కథలోకి వెళితే.. ‘దేశభక్తుడ’యిన గద్దర్‌పై ఉన్న అపార ప్రేమానురాగాలతో, ఆయన పేరిట రేవంత్ సర్కార్ సినిమా అవార్డులిస్తోంది. మంచిదే. అసలు ఏబీవీపీలో పుట్టి, టీడీపీలో పెరిగి, కాంగ్రెస్‌లో ఉద్యోగం చేస్తున్న రేవంత్‌రెడ్డికి.. ఈ గద్దర్ ఫెవికాల్ బంధం ఎప్పుడు ఎలా పెనవేసుకుందో తెలియదు. రేవంత్ పనిచేసిన ఏబీవీపీ పూర్తిగా నక్సల్స్ వ్యతిరేక సంస్థ. రేవంత్ విద్యార్ధి దశలో ఉన్నప్పుడు ఏబీవీపీ, బీజేపీ నేతలను నక్సల్స్ చాలామందిని మట్టుపెట్టారు. ఆయన పెరిగిన టీడీపీ హయాంలో చాలామంది నక్సల్స్ టీడీపీ పెద్దతలలను లేపేశారు. పైగా అసలు టీడీపీ అధినేత చంద్రబాబుపైనే నక్సల్స్ అలిపిరిలో బాంబు దాడి చేశారు. మాధవరెడ్డి కూడా నక్సల్స్ దాడిలోనే తలవాల్చారు. మరి రేవంత్‌కు గద్దర్‌తో బాదరాయణ బంధం ఎక్కడ? ఎప్పుడు? ఎందుకు? ఏమిటన్నదే ప్రశ్న. పైగా రేవంత్ తీవ్రంగా ద్వేషించే వెలమ కులానికి చెందిన వారే, నక్సల్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు.

పోనీ కాంగ్రెస్ ఏమైనా మొదటినుంచీ నక్సల్స్‌ను తన పొత్తిళ్లలో పెంచి, ముద్దాడి పెంచి పెద్ద చేసిన పార్టీనా అంటే అదీకాదు. అసలు పీపుల్స్‌వార్‌పై తొలుత నిషేధం విధించిందే కాంగ్రెస్ పార్టీ! ఉమ్మడి రాష్ట్రంలో లెక్కలేనంత మంది కాంగ్రెస్ నాయకులను హతమార్చిన ఘనత.. గద్దర్ మద్దతునిచ్చిన పీపుల్స్‌వార్‌దే. ఒక దుద్దిళ్ల శ్రీపాదరావు. ఇంకో నర్శిరెడ్డి. ఇలా చె ప్పుకుంటూపోతే రాస్తే రామాయణ. చెబితే భారతం అవుతుంది.

ఇంకొంచెం లోతుకు వెళ్లి, గద్దర్ గళధారిగా ఉన్న నక్సల్స్‌పై, కాంగ్రెస్ మోపిన ఉక్కుపాదం కధేమిటో చూస్తే.. నక్సలైట్లను భారత చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (1967) ప్రకారం, 2010లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించిందే కాంగ్రెస్ ప్రభుత్వం! భారత చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ప్రకారం నక్సైలె ట్లను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిందే కాంగ్రెస్ ప్రభుత్వం!! 1981లో ఇంద్రవెల్లిలో గిరిజనులపై కాల్పులు జరిపిన ఘనత కూడా కాంగ్రెస్‌దే!!! నక్సల్స్ ఏరివేతకు 2009లో ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్‌హంట్ కూడా కాంగ్రెస్ పుణ్యమే. వెంగళరావు, చెన్నారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి జమానాలో అడవిఅన్నలను అమరులను చేసిన ఘనత కూడా కాంగ్రెస్‌దే.

అంటే ఒకవైపు నక్సల్స్ పీచమణిచేందుకు ఆపరేషన్లు చేసిన అదే కాంగ్రెస్ పార్టీ.. అదే నక్సల్స్‌ను భుజానికెత్తుకున్న గద్దర్ పేరిట ప్రభుత్వ పక్షాన ఒక అవార్డు ఇవ్వడమే వింతలో వింత! మరి దీనికి జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుమతి ఉందా? కాంగ్రెస్ పార్టీ నాయకులను తుపాకీ తూటాలతో ముద్దాడిన నక్సల్ పార్టీ ప్రతినిధుల పేరిట అవార్డులిచ్చేందుకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అనుమతి మంజూరు చేసిందా? ఒకవేళ అలాంటి అనుమతులిస్తే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నక్సల్స్ ఏరివేతను జమ్మిచెట్టుకెక్కించిందా?

అసలు గద్దర్‌కూ-సినిమాలకూ బాదరాయణ బంధమేమిటో ఎవరికీ అర్ధం కాదు. నిజానికి గద్దర్ పాడిన సినిమా పాటలు తక్కువ. పాడినవి తక్కువే అయినప్పటికీ, అవి ప్రజాబాహుళ్యంలో చిరస్థాయిగా నిలిచిపోయినవే. అది వేరే ముచ్చట. సహజంగా ఒక వ్యక్తి పేరిట ఒక రంగానికి అవార్డు ప్రకటించారంటే, సదరు వ్యక్తి ఆ రంగానికి విశేష సేవలందించారని అర్ధం. కానీ గద్దర్ సినిమా రంగానికి ఏ సేవలందించారో రేవంత్‌రెడ్డి సెలవివ్వాలి. గతంలో తాను పాడిన పాటకు అవార్డు ప్రకటిస్తే, దానిని తిరస్కరించిన గద్దర్‌కు, సినిమా రంగంపై ఏం గౌరవం ఉన్నట్లు? అలాంటి సినిమా అవార్డును తిరస్కరించిన గద్దర్ పేరిట, స్వయంగా ప్రభుత్వమే సినిమా అవార్డు ప్రకటించడం సమంజసమా? అసమంజసమా? ఇది గద్దర్‌ను గౌరవించడమా? అవమానించడమా? అన్నది సినీజీవుల ప్రశ్న.

పోనీ వ్రతం చెడ్డా ఫలితం దక్కిందా అంటే అదీ లేదు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూల్చాలన్న.. నక్సల్స్ సిద్ధాంతాన్ని బలపరిచే గద్దరన్న పేరిట సిన్మా అవార్డులిస్తున్న రేవంత్ సర్కారు.. ఆ అవార్డు లోగో, ఆహ్వానపత్రికలో ఆయన పేరు వేయకపోవడమే విచిత్రం. సహజంగా ఎవరిపేరునయితే అవార్డులిస్తారో ఆ ప్రతిమపై వారి ఫొటో ఉంచుతారు. రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీఆర్ అవార్డు, అక్కినేని అవార్డు, చివరకు నంది అవార్డు సహా వాటి ప్రతిమలు ఆయా అవార్డులపై కనిపిస్తాయి.

కానీ రేవంత్ అత్యంత ప్రేమానురాగాలతో ప్రకటించిన గద్దర్ అవార్డుల ప్రతిమలో గానీ, ఆహ్వానపత్రికలో గానీ గద్దర్ ఫోటో భూతద్దం పెట్టి వెతికినా కనిపించకపోవ డమే వింత. దానిపై సోషల్‌మీడియాలో విమర్శలు చెలరేగడంతో, దిద్దుబాటకు దిగిన రేవంత్ సర్కారు విడుదల చేసిన పబ్లిసిటీ పిక్చర్‌లో మాత్రం గద్దరన్నను ఉంచారు. దీని ద్వారా గద్దర్ పేరుతో సిన్మా అవార్డులు ఏదో మొహమాటానికి, తెలంగాణలో గద్దర్‌ను ప్రేమించే వర్గాల కోసం పెట్టినట్లు మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.

ఒక అవార్డు ప్రకటిస్తే దానికి అర్ధం-పరమార్ధం ఉంటుంది. దానికో విశిష్టత ఉంటుంది. ఫలానా వ్యక్తి ఫలానా వర్గానికి సేవచేశారని చె ప్పే అవకాశం ఉంటుంది. కానీ గద్దర్ పేరిట అవార్డు ప్రకటించిన రేవంత్ సర్కార్.. గద్దర్ పేరితో ఎందుకు అవార్డు ఇచ్చారంటే ఏం చెబుతుంది? పరదేశీనాయుడు, కెఎస్ వ్యాస్, ఉమేష్‌చంద్ర వంటి అధికారులతోపాటు, వందలాదిమందిని మట్టుపెట్టిన నక్సల్స్‌కు ప్రతినిధి అని చెబుతుందా? ఏటూరునాగారంలో మందుపాతర పెట్టి కానిస్టేబుళ్లను కిరాతకంగా హత్య చేసిన నక్సల్స్‌ను పొగిడే ప్రజాయుద్ధనౌక అని చెబుతుందా?

ఎన్‌కౌంటర్లను నిలిపివేయాలని డిమాండ్ చేసి, బూటకపు ఎన్‌కౌంటర్లన్నీ పోలీసుహత్యలేనని నినదించిన ప్రజాస్వామ్య ప్రియుడని చెబుతుందా? పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేక.. బ్యాలెట్ ద్వారా కాదు. బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం వస్తుందని నినదించే ‘దేశభక్త’ నక్సలైట్లకు ప్రతినిధి అని చెబుతుందా?.. గద్దర్ అవార్డులకు ఇచ్చే నిర్వచనమేమిటన్న ప్రజాస్వామ్యవాదుల ప్రశ్నలకు.. గద్దర్ సినిమా అవార్డుల వేదికపై రేవంత్‌రెడ్డి చెప్పే జవాబు కోసం ఎదురుచూద్దాం! ఇంతకూ.. తన తండ్రి ఫొటో లేకుండా ముద్రించిన ఆహ్వానపత్రాలను.. రేవంత్ ఇచ్చిన సర్కారీ పదవి అనుభవిస్తున్న గద్దర్ కూతురు ఆహ్వానిస్తారా? వ్యతిరేకిస్తారా?

కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం దొరగారి గడీల దగ్గర, గంటల తరబడి పడిగాపులు కాసినా గద్దర్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించిన అవమానపర్వాన్ని, దొరగారి బిడ్డ కవితక్క మర్చిపోవడమే వింత. గద్దర్ అవార్డుల ఆహ్వానపత్రికపై గద్దర్ ఫొటో వేయకపోవడం దారుణమని, కవితమ్మ ఎక్స్‌లో టన్నుల కొద్దీ కన్నీరు ట్వీటడం వింతలో వింత.

తెలంగాణ కోసం యావత్ తెలంగాణ సమాజాన్ని రోడ్డెక్కించిన పోరాటయోధులను, అధికారం వచ్చిన తర్వాత గేటులోపనికి రానీయని కల్వకుంట కుటుంబం.. ఇకపై ఇలాంటి సానుభూతి ప్రకటనలివ్వకపోవడం ఆ కుటుంబానికే మంచిది. ఎందుకంటే.. తాము ఒకటి అని, ఎదుటివారితో పది అనిపించుకోవడం అవసరమా? ‘అన్నింటికీ నేనున్నా’ని తయారయితే.. అది బూమరాంగయి నష్టపోయేది కల్వకుంట్ల కుటుంబమే!

 

LEAVE A RESPONSE