కొద్ది రోజుల నుంచీ దేశాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ పట్టివేత వ్యవహారం విద్యార్ధుల తలిదండ్రులను హడలెత్తిస్తోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గుజరాత్‌లోని అదానీకి చెందిన పోర్టు నుంచి, విజయవాడకు దర్జాగా రవాణా అయిన వేల కోట్ల డ్రగ్స్ దేశాన్ని నోరెళ్లబెట్టేలా చేసింది. దానిపై రాజకీయ పార్టీల రచ్చ. అసలు అంత భారీ స్థాయిలో మత్తు మందులు బెజవాడకు ఎలా చేరాయి? ఎవరి సహకారంతో దిగుమతి అయ్యాయి? ఇంతకుముందు ఎవరికీ తెలియకుండా, నిఘా కళ్లు గప్పి దిగుమతి అయిన సరుకు ఎంత? అది ఎక్కడికి రవాణా అయింది? పొరపాటున ఇవి కాలేజీ, యూనివర్శిటీ క్యాంపసులోపలి తోసుకుంటూ వెళుతున్నాయా? పబ్బుల్లోకి, క్లబ్బుల్లోకి, ఫాంహౌసుల్లోకి, పెద్లోళ్ల పార్టీల్లోకి చొరబడుతున్నాయా? తెలిసే ఇంత దారుణం జరిగితే.. ఇక తెలియకుండా జరిగిపోతున్న తెరవెనుక రవాణా దారుణాలు ఇంకెన్ని? ఇంత జరుగుతున్నా నిఘా నిద్రపోతోందా? రవాణా ఉప్పందితేనే కదా నిఘా నిద్ర లేచింది? మరి ఎవరూ ఉప్పందించకపోతే పరిస్థితి ఏమిటి? ఊహించుకుంటేనే ఒళ్లు జలదరించడం లేదూ? వీటికి విద్యార్ధులు బానిసలయితే వారి భవిష్యత్తు ఏమిటన్న ఆలోచనే భయంగా లేదూ?! డ్రగ్స్.. డ్రగ్స్.. అసలేం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? ఈ బానిస వ్యసనం ఎక్కడి నుంచి మొగ్గతొడుగుతోంది. చూద్దాం రండి!
గంజాయి . కొకెయిన్ , హెరాయిన్ , ఎలఎస్డీ .. ఇలా రకరకాల డ్రగ్స్ వున్నాయి . ఇవి రకరకాలుగా శరీరం పై పని చేస్తాయి . నేటి యువత ఎక్కువగా డ్రగ్స్ వైపు ఆకర్షితులు కావడం జరుగుతోంది . కాలేజీ ల లో, యూనివర్సిటీ ,క్యాంపస్ ల లో , హాస్టల్స్ లో వీటి వాడకం ఎక్కువవుతోంది .
తప్పని తెలిసీ ఎలా అకర్షితులవుతారు ?
స్నేహితుల ఒత్తిడి .. పీర్ ప్రెషర్ .. ఇది వరకే డ్రగ్స్ తీసుకొంటున్న ఒక స్నేహితుడు ఒత్తిడి చేస్తాడు . “ఏమీ కాదు .. జస్ట్ ఒక సారి ట్రై చెయ్యి . చెడు అనిపిస్తే మానేద్దువు” అని ప్రోత్సహిస్తాడు . ఎక్సప్లోరింగ్ .. అంటే తెలుసుకోవాలి అనే ఆసక్తి యువత లో ఎక్కువ . ఇది తప్పు అని ఇంత మంది అంటున్నారు అంటే చూద్దాము .. ఏమి జరుగుతుందో .. నా పై నాకు నమ్మకం వుంది . ఒక్క సారి తీసుకొనే మానేస్తా .. నా పై నాకు ఫుల్ కంట్రోల్ వుంది అనే ఆత్మ విశ్వాసం .. అంటే ! క్యూరియాసిటీ 2. ఆత్మ విశ్వాసం 3. స్నేహితుడి ప్రోత్సాహం .. ఇవీ చీకటి జగత్తుకు దిగజారడంలో మొదటి మెట్టు .
ఒక సారి డ్రగ్ తీసుకొన్నాడు . ఇరవై నిమషాల్లో చిత్రమైన ప్రపంచం కనిపించింది . ఉదాహరణకు ఆసిడ్ గా పిలవబడే ఎలఎస్డీ తీసుకొన్నాడు . కంటి పాప పెద్దదయింది . కొత్త రంగులు కనిపించాయి . శబ్దానికి రంగులు వచ్చాయి . వాసన కు రుచి. అదో గమ్మత్తయిన జగత్తు , ఎప్పుడు చూడని జగత్తు , అదో మాయ ప్రపంచం , స్వర్గం అంటే అదేనేమో అనిపిస్తుంది . బ్రాంతి .. మొత్తం బ్రాంతి .. మూడ్ మారిపోయింది . ఇది కదా ప్రపంచం అనిపిస్తుంది .
ఆ గమ్మత్తయిన అనుభూతి కొన్ని గంటల పాటు ఉండిపోయింది . రెండు రాత్రుల పాటు నిద్ర రాదు . అయినా అలసట అనిపించదు . శరీరం తేలిపోయినట్టు ఉంటుంది . అటు పై వరుసగా రెండు రోజులు పగలు రాత్రి నిద్ర పోతాడు .తప్పు చేశాను అనే భావన కలుగుతుంది . ఇక మీదట ఎప్పుడు చెయ్యను అనుకొంటాడు . కనీసం రెండు నెలలు ఆ ఆలోచన రానివ్వడు . ఈ స్థితి లో ఉన్న వాడిని డ్రగ్స్ ఇచ్చిన ఆ ఫ్రెండ్ కూడా డిస్టర్బ్ చెయ్యడు. నీ ఇష్టం అంటాడు. 2 – ౩ నెలలు డ్రగ్స్ తీసుకోకపోయే టప్పటికి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది . తాను అడిక్ట్ కాను . తనకు ఆ కంట్రోల్ ఉంటుంది అనుకొంటాడు . ఈ సారి తానే ఆ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి ఇంకో సారి ట్రై చేద్దాము అంటాడు . “వద్దు బాబు నీతో కష్టం” అంటాడు . బతిమాలాడించుకొంటాడు . ఇవన్నీ సీనియర్ కు డ్రగ్ కార్టెల్ ఇచ్చిన ట్రైనింగ్ లో భాగం .
జూనియర్ రెండో సారి డ్రగ్స్ ట్రై చేసాడు . ఈ సారి కూడా అదే అనుభూతి . వారం గడిచింది . ఇంకో సారి స్వర్గం చూడాలి అనుకొంటాడు . ఈ సారి వారానికే థర్డ్ టైం .. .
ఇప్పుడు అతనికి బ్రెయిన్ వాషింగ్ సెషన్ జరుగుతుంది . ఇందులో సీనియర్ లు క్లాసులు తీసుకొంటారు . 1. డ్రగ్ తీసుకొనుంటే ఆరోగ్యం పాడవుతుంది అనేది తప్పు . హీరోయిన్ లు ఎంతో మంది తీసుకొంటుంటారు . డ్రగ్స్ వల్లే వారి సౌదర్యం పెరిగి అందరికీ ప్రీతి పాత్రం అవుతారు .
2. డ్రగ్స్ తీసుకుంటే కండలు వచ్చి మాచో మాన్ గా మారొచ్చు . అమ్మాయిలు రా.. నా హ్యాండ్సమ్ అంటూ వెంట పడతారు .
3. అసలు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ డ్రగ్స్ వాడుతారు . వారి చదువు పాడుకాలేదు సరి కదా మెమరీ పెరిగి బ్రెయిన్ షార్ప్ అయ్యి , మరిన్ని మార్కులు సాధించారు అంటూ వారి పేర్లు చెప్పి .. ఫోటో లు చూపుతారు.
4. సరే పట్టుపడితే ఏమవుతుంది ? అమ్మ ఏడుస్తుంది . ఏడవని .. రెండు రోజులు ఏడ్చి ఊరుకొంటుంది . అంతకన్నా ఏమి చేస్తుంది ? నాన్న కొట్టడానికి వస్తాడు . రెండు దెబ్బలు తిను .. అమ్మ సానుభూతి దక్కుతుంది . నాన్న కూడా తరువాత అయ్యో అనుకొంటాడు . తరువాత ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళుతారు . వారు అదే సోది చెబుతారు . వారికి అది వృత్తి . ఆరోగ్యం దెబ్బతింటుంది అంటారు . ఆరోగ్యం దెబ్బతింటే మరి హీరో హీరోయిన్ లు ఎందుకు తీసుకొంటారు ? కెరీర్ పాడైతే మీ సీనియర్ రెగ్యులర్ గా హై లో ఉండేవాడు .. ఇప్పుడు చూడు ఫలానా కంపెనీ లో ఇంత ప్యాకేజీ కి పని చేస్తున్నాడు .. ఇలా బ్రెయిన్ వాష్ జరిగిపోతుంది .
రెండో దశ లో డ్రగ్స్ ను వారాంతాల్లో తీసుకోవడం మొదలు పెడుతాడు . ముందుగా ఫ్రీ దొరికిన డ్రగ్ కు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి . పాకెట్ మనీ సరి పోవడం లేదు .. అబద్దాలు .. చిన్న వస్తువులు అమ్మేయడం .. ఇంట్లో చిన్న దొంగతనం .. ఇలా ఒక్కో మెట్టు కిందకు ప్రస్థానం సాగుతుంది .
ఇప్పుడు స్వయం ఉపాధి పథకం ముందుకు వస్తుంది . మరో నలుగురు కొత్త కుర్రాళ్లను ఊబి లోకి లాగాలి . ఒక్కడిని తెచ్చినప్పుడు ఒక్కో డోస్ ఫ్రీ .. సీనియారిటీ వస్తే ఇక కొత్తగా చీకటి ప్రపంచం లో వస్తున్న వారికీ బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం చెయ్యాలి . తనని ఊబిలోకి దించిన వాడు ఇదే ప్రోగ్రాం ప్రకారం చేసాడు .. ఫ్రెండ్షిప్ లేదు పాడు లేదు అని అర్థం అవుతుంది . కానీ అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది .. అతని అడుగుజాడల్లో తానూ నడుస్తున్నాడు . నలుగురు బకరాల కోసం వేట . ఇదే ఛైన్ లింక్డ్ డ్రగ్స్ ప్రమోషన్ టీం .
డ్రగ్స్ తీకుకొంటే మరణం ఖాయం .. సర్వనాశనం ఖాయం . ఎందుకు ? ఎలా ?
డ్రగ్స్ తీసుకొంటే దెబ్బతినేది కేవలం వ్యక్తి ఆరోగ్యం కాదు . కుటుంబం .. నగరం ,.. సమాజం .. దేశం .. ప్రజాస్వామ్య వ్వవస్థ మొత్తం నాశనం అయిపోతాయి . డ్రగ్స్ రాజ్యం ఏలుతున్న మెక్సికో కొలంబియా లాంటి దేశాల్లో డ్రగ్స్ కార్టెల్స్ సమాంతర ప్రభుత్వాలు ఎలా నడుపుతున్నాయి .. హత్యలు .. కిడ్నాప్ లు .. EXTORTION ఎందుకు నిత్యకృత్యం అయిపోయాయి ? హింస అనేది నిత్య జీవన విధానం ఎందుకు అయిపొయింది .? క్షేమంగా బతకాలి అంటే పోలీస్ లను ప్రభుత్వాన్ని నమ్ముకొంటే లాభం లేదు . డ్రగ్స్ మాఫియా కు పన్ను కట్టాల్సిందే అని పరిస్థితి ఎందుకు వచ్చింది ? డ్రగ్స్ కార్టెల్స్ బిలియన్ డాలర్ల సంపదను కూడ బెట్టి , ప్రపంచం లోని ప్రభుత్వాలను ఎలా ఆడిస్తున్నాయి ? వీరికి బీద ప్రజల మద్దతు ఎలా అందుతోంది ? హీరో లు గా ఎలా చలామణి అవుతున్నారు ? ఇవన్నీ రాబోయే పోస్ట్ ల లో ..
ఇండియా ఇంకా తొలిదశ లో వుంది . దేశం లో ఒక పక్క నిరుద్యోగిత .. తాగడం ఫాషన్ అయిపోయిన స్థితి . నగరాల్లో ఇప్పటికే వ్యవస్థీకృతం అయిన డ్రగ్స్ మాఫియా .. అన్నింటికీ మించి దేశ జనాభా లో డెబ్భై అయిదు శాతం యూత్ . పక్కన డ్రగ్స్ రాజ్యం ఆఫ్గనిస్తాన్ .. ఇండియా పేలడానికి సిద్ధంగా ఉ న్న బాంబ్ ?
అవగాహన కల్పించండి . డ్రగ్స్ మాఫియా వేళ్ళూనుకొంటే ఇక ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. .