– సునిశిత పరిశీలన, కొర్రీలతో యంత్రాంగం వైఖరిలో మార్పునకు ప్రయత్నం
– ప్రతి మూడో ఫైల్ ను పునఃపరిశీలన కోసం వెనక్కి పంపుతున్న మంత్రి
– వ్యవస్థాగత వైఫల్యాలపై విచారణలకు మంత్రి ఆదేశం
అమరావతి: సాధారణంగా తమ అనుమతులు, ఆమోదం కోసం వచ్చిన ఫైళ్లను(దస్త్రాలు) కింది స్థాయి అధికారుల ప్రతిపాదనల మేరకు సంబంధిత మంత్రలు సంతకాలు చేసి వెనక్కి పంపుతుంటారు. అయితే.. గత పదిహేను నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తమ మంత్రిత్వశాఖలో సంచలనం సృష్టిస్తున్నారు. పర్యవసానంగా… గతంలో లాగా తమ ప్రతిపాదనలకు మంత్రి ఆమోదం పొందటం కష్టమనే భావన ఆ శాఖలోని అన్నిస్థాయిల్లో ఏర్పడిందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం. రోటిన్ గా వచ్చే ఫైళ్లను మినహాయించి, తమ పరిశీలనకు వచ్చే ప్రతి మూడో ఫైల్‌కు సంబంధించి అదనపు సమాచారం కోరడంతో పాటు ప్రధానమైన కొర్రీలు వేసి వెనక్కి పంపుతుండటం మంత్రిత్వ శాఖలో చర్చకు దారితీసింది. రెండు దస్త్రాలకు సంబంధించి గతవారం మంత్రి సత్య కుమార్ లిఖితపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలను ఇందుకు ఉదాహరణలుగా ఉన్నతాధికారులు తెలిపారు.
వ్యవస్థాగత వైఫల్యంపై విచారణకు మంత్రి ఆదేశం
2014లో కొన్ని అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిన ముగ్గురు అధికారులు ఎటువంటి తదుపరి చర్యలు లేకుండా, పదవి విరమణ పొంది శిక్ష నుంచి తప్పించుకున్న వైనం మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి రాగా ఆయన అగ్రహించి ఈ పరిస్థితికి దారితీసిన వ్యవస్థాగత వైఫల్యంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. తద్వారా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు.
2014లో అక్రమ నియామకాలతో పాటు ఇతర అవకతవకలకు పాల్పడినట్టు అప్పటి ఒక జిల్లా డీఎం అండ్ హెచ్‌వో, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరెంటెండెంట్ పై ఆరోపణలు రాగా అప్పటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఏడేళ్ళ సుదీర్ఘ జాప్యం తర్వాత ఆ ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్టు 2021లో ప్రాథమిక విచారణలో తెలింది. నియమాల ప్రకారం తదుపరి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించినా 2023 వరకు సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టలేదు.
జూన్ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అక్రమాలకు సంబంధించి విపరీతమైన తాత్సారం జరగడానికి కారణాలను వివరించాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ గత ఆగస్టులో ఆదేశించారు. కోవిడ్ వ్యాధి ప్రబలడంతో ఈ విషయంపై దృష్టి సారించలేకపోయామని ఇచ్చిన వివరణపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ కారణంగా ఆలస్యం జరిగిందన్న వివరణను గత ప్రభుత్వం ఆమోదించటం పట్లు మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2014లో వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను 2021లో అందచేసిన వైనాన్ని విస్మరించడం ఏవిధంగా సబబు అని ఆయన ప్రశ్నించారు.
ముగ్గురు వైద్యాధికారులపై వచ్చిన ఆరోపణలపై తగు సమయంలో అవసరమైన మేరకు యంత్రాంగం స్పందించకపోవడంతో ఆ ముగ్గురు 2022కు ముందే పదవీ విరమణ చేశారు. సర్వీసు నియమాల ప్రకారం ఆరోపణలు వచ్చిన నాలుగేళ్ల తర్వాత నిందితులపై ఎటువంటి చర్యలు చేపట్టలేమని, ఈ ముగ్గురిపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక వచ్చి నాలుగేళ్ళు దాటినందున ఇప్పుడు ఎటువంటి చర్యలకు అవకాశం లేదని అధికారులు వివరించారు. ఈ విధంగా ముగ్గురిపై అభియోగాలు ఉన్నప్పటికీ శిక్ష నుంచి తప్పించుకోవడం… అందుకు దారితీసిన పరిస్థితులపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ… ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు ఈ సంఘటనపై లోతైన దర్యాప్తునకు ఆదేశించారు.
దర్యాప్తులో పరిశీలించాల్సిన అంశాలు :
– అక్రమాలపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను 2021లో అందించానికి ఏడేళ్ళు ఎందుకు పట్టింది?
– అనంతరం… జనవరి 2024 దాక చార్జిషీటు ఎందుకు దాఖలు చేయలేదు?
– 2022 కు ముందు ఆ ముగ్గురు పదవీ విరమణ చేసినప్పుడు వారిపై అభియోగాలు ఉన్న సంగతిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు?
– కేవలం విచారణాధికారిని నియమించి విచారణ ప్రక్రియను ముందుకు సాగించటానికి కోవిడ్ ఏవిధంగా కారణమైంది?
– ఈ కేసులో వెల్లడైన తాత్సారానికి ఉద్దేశపూర్వకమైన ప్రయత్నం ఏమైనా జరిగిందా?
– ఈ విషయంలో స్పష్టమైన వ్యవస్థగతమైన వైఫల్యానికి కారకులు ఎవరు?
– ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
మరో కేసు
తెనాలి ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తూ జూలై, 2024లో పదవీవిరమణ పొందిన ఒక వైద్యురాలు ఆరోగ్య కారణంపై 562 రోజులపాటు అనుమతి లేకుండా విధులకు దూరంగా ఉన్న ఉదంతాన్ని కూడా మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్రంగా పరిగణించారు. 2022లో స్వచ్ఛంద పదవీవిరమణ కోరిన ఆమె దరఖాస్తుపై తగు రీతిన స్పందించకుండా పదవీవిరమణ అనంతరం 562 రోజుల గైర్హాజరిని వివిధ సెలవుల కింద క్రమబద్ధీకరించే ప్రతిపాదనపై మంత్రి పలు వివరణలు కోరారు.
ఈ విషయంలో వెల్లడైన పలు లోపాలకు సంబంధించి సంబంధిత అధికారులపై తగు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మంత్రి సునిశిత పరిశీలన, వ్యాఖ్యల నేపథ్యంలో దాదాపు 200 రోజుల కాలాన్ని జీతభత్యాల చెల్లింపునకు, పింఛన్ లెక్కింపుకు అర్హతలేనిదిగా నిర్ధారించవల్సి వచ్చింది. ఈ విషయానికి సంబంధించిన దస్త్రంలో మంత్రి లేవనెత్తిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
– వైద్యురాలి స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థనపై తగు సమయంలో నిర్ణయం తీసుకోకపోవడానికి బాధ్యులెవరు?
– ఆమె పదవీ విరమణకు ముందు దీర్ఘకాలం పాటు గైర్హాజరు విషయాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?
– ఆమె గైర్హాజరు విషయాన్ని సంబంధిత డి.సి.హెచ్.ఎస్, డైరక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ దృష్టికి ఎందుకు తీసుకురాలేదు?
– అవసరం లేకున్నా వైద్యురాలి సెలవుదినాల క్రమబద్ధీకరణ విషయాన్ని ఆర్థిక శాఖకు ఎందుకు పంపారు? దానికి బాధ్యులెవరు?
– ఈ విషయం తమ పరిధిలోకి రాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసినా… ఆర్థిక శాఖ సమ్మతి తెలిపిందని లిఖితపూర్వకంగా సంబంధిత ఫైలులో రాయడం మంత్రిని తప్పుదోవ పట్టించడం కాదా?
– సంబంధిత నియమాలకు విరుదర్ధంగా… సెలవుదినాల క్రమబద్ధీకరణ ప్రణాళికను ఎలా ప్రతిపాదించారు?
పై అంశాలను తీవ్రంగా పరిగణించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు