– ఏప్రిల్, మే నెలల్లోనే ముందుస్తు ఎన్నికల యోచన
– అందుకే ఈ హడావిడి
– ఎన్నికల సైన్యం తయారు అందుకోసమే
– ఏపీ-తెలంగాణ కలవడం సాధ్యమేనా?
– అది డర్టీ డిపార్టుమెంట్ హెడ్ డైవర్షన్ పాలిటిక్స్
– బీజేపీ విజయం జనంలోకి వెళ్లకూడదన్నదే వైసీపీ కుట్ర
– అందుకే ఏపీ-తెలంగాణ విలీనంపైఅర్ధం లేని వ్యాఖ్యలు
– భయంతోనే టీచర్లను విధుల నుంచి తప్పించారు
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అడ్డదార్లు
– వందల కోట్ల రూపాయలు వెదజల్లే కుట్ర
– బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
‘‘ఏపీ సీఎం జగన్ 16 నెలల యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని తన కార్యకర్తలకు చెబుతున్నారు. కానీ ఆయన వచ్చే ఏప్రిల్, మే నెలల్లోనే ముందుస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే యుద్ధానికి ఎన్నికల సైన్యం సమకూర్చుకుంటున్నారు. ఆలస్యమైతే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందన్న భయంతోనే ముందస్తుకు వెళుతున్నార’’ని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారి ద్వారా గెలిచేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని సత్యకుమార్ ఆరోపించారు. దానికోసం భారీ స్థాయిలో డబ్బు వెదజల్లి, ఎలాగైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. ఆ ఎన్నికల్లో గెలవడం ద్వారా మేధావులు, టీచర్లంతా తమ వెంటే ఉన్నారన్న సంకేతం ఇవ్వడమే, జగన్ ధ్యేయమని ఆరోపించారు. అందుకోసం వందల కోట్లు ఖర్చు పెట్టేందుకయినా వెనుకాడటం లేదన్నారు.
పక్కా పథకం ప్రకారమే టీచర్లను, ఎన్నికల విధుల నుంచి తప్పించారని సత్య ఆరోపించారు. టీచర్లు తమకు వ్యతిరేకంగా ఉన్నారన్న భయమే దానికి కారణమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వారిని బెదిరించడం ఎలాగో తెలిసిన వారంతా పక్కనే ఉన్నారని వ్యాఖ్యానించారు. కానీ బె దిరింపు రాజకీయాలు ఎక్కువకాలం పనిచేయవని స్పష్టం చేశారు.
డర్టీ ట్రిక్స్ డిపార్టుమెంట్‌కు సజ్జల రామకృష్ణారెడ్డి హెడ్ అని సత్య వ్యాఖ్యానించారు. ‘‘ఆ డిపార్టుమెంట్ హెడ్ అప్పనంగా నెలకు 10 లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. వీళ్లు ఆయా రంగాల్లో నిష్ణాతులు కాదు. కానీ ప్రజాధనాన్ని అప్పనంగా మెక్కుతూ ఇలాంటి డర్జీ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీని తీసుకువెళ్లి తెలంగాణలో కలపడం సాధ్యమవుతుందా? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. నిన్న నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ భారీ విజయం సాధించింది. ప్రజల్లో అది చర్చకు రాకుండా ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం ఈ డర్టీ డిపార్టుమెంట్ స్పెషాలిటీ. ఏమైనా అర్ధంపర్ధం ఉన్న మాటలా అవి? అంటే ఏదో ఒక మాట అనేసి వెళ్లిపోవడం. టీచర్లను బెదిరించేలా వారిని విధుల నుంచి తొలగించారు. ఇట్లా ఎంతమందిని తొలగిస్తారు? అని సత్యకుమార్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యత మేధావులు, టీచర్లదేనని ఆయన కోరారు.