– ఈ బీసీ అభివృద్ధికి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి
– సీఎం రేవంత్ రెడ్డితో ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి భేటీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈబీసీల అభివృద్ధికి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి సీఎంను కోరారు. ఈబీసీ జాతీయ అధ్యక్షులు, అగ్రకులాల నిరుపేదల సంఘాల జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
తెలంగాణలో ఈబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రవీందర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వం ఈబీసీల సంక్షేమ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఇతర పేదల మాదిరిగానే అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అగ్రవర్ణాలలోని నిరుపేదలకు వర్తింపజేయాలని రవీందర్ రెడ్డి తన వినతిపత్రంలో పేర్కొన్నారు.సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి త్వరలో ఈబీసి కార్పొరేషన్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.