Suryaa.co.in

Andhra Pradesh

ఈఈఎస్ఎల్‌.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’

  •  కేంద్ర ప్రభుత్వ సంస్థకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
  • 2023-24కు గాను అందజేసిన సీఐఐ
  • ఇంధన సామర్థ్యంలో ఈఈఎస్ఎల్ కీలకపాత్ర
  • ఉజాలా.. దేశ ఇంధన సామర్థ్య రంగం దిశనే మార్చిన పథకం
  • బీఈఈ కార్యదర్శి మిలింద్ దేవరా ప్రశంస
  • ‘ఈఈఎస్ఎల్‌మార్ట్.ఇన్’తో అందుబాటు ధరల్లో ఈఈ ఉపకరణాలు: అనిమేష్
  • ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు సీఎం చంద్రబాబు ఆద్యుడు
  •   ఆయన నేతృత్వంలో ఏపీ ఛాంపియన్‌గా నిలిచిందని ప్రశంస

విజయవాడ, సెప్టెంబరు 15: కేంద్ర విద్యుత్తు శాఖకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)’కు ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) 2023-24కు గాను ఈఈఎస్ఎల్‌కు ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం అందజేసింది. సీఐఐ 25వ (రజతోత్సవం) వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఉజాలా పథకంతోపాటు దేశవ్యాప్తంగా విభిన్న పరిశ్రమల్లో విజయవంతంగా ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేసినందుకు గాను ఈఈఎస్ఎల్‌కు ఈ అవార్డు దక్కింది.

దేశంలోని 500పైగా సంస్థల నుంచి 207 సంస్థలను ఎంపిక చేసిన సీఐఐ జ్యూరీ ప్యానెల్ సమగ్ర పరిశీలన అనంతరం ఈఈఎస్ఎల్‌కు పురస్కారాన్ని అందించింది. ఉజాలా పథకం కింద ఎల్ఈడీ దీపాల ఏర్పాటుతో భారతదేశ లైటింగ్ పరిశ్రమ గతిని మార్చడంలో కీలకపాత్ర పోషించిన ఈఈఎస్ఎల్‌కు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ఉజాలా పథకం కింద దేశవ్యాప్తంగా 36 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయడమేగాక 1.3 కోట్ల వీధి దీపాలను అమర్చారు. 3.5 లక్షల కిలోమీటర్ల రహదారుల్లో ఈ వీధి దీపాలతో వెలుగులు నింపారు. తద్వారా ఇంధన పొదుపుతో పాటు పర్యావరణానికీ భారీగా లబ్ధి చేకూరింది.

అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సెక్రటరీ మిలింద్ దేవరా మాట్లాడుతూ.. స్వచ్ఛ ఇంధనం దిశగా భారత్ దూసుకెళుతోందన్నారు. ఈ విషయంలో విప్లవాత్మక పురోగతి సాధిస్తోందని చెప్పారు. ఉజాలా, పెర్ఫామ్, అచీవ్, ట్రేడ్ (పీఏటీ) వంటి కీలకమైన ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుతో వివిధ రంగాల్లో ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో మేలు జరుగుతోందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుపై మరింత దృష్టి సారించాలని దేవరా కోరారు. ఈ కార్యక్రమాలను స్థిరంగా అమలు చేయడం ద్వారా హైదరాబాద్, అమరావతి ఆర్థికాభివృద్ధికి కూడా దోహద పడతాయని తెలిపారు.

తమ సంస్థకు ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందించిందని ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్ సీఐఐకి ధన్యవాదాలు తెలిపారు. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో కృషి చేసిన ఈఈఎస్ఎల్ బృందానికి అభినందనలు తెలియజేశారు. గొప్ప పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా భారత్ ఇంధన సామర్థ్యంలో విప్లవం సృష్టిస్తోందన్నారు. ఉజాలా పథకం ప్రపంచంలోనే అతిపెద్ద గృహ వినియోగ బల్బుల మార్పు కార్యక్రమంగా నిలిచిపోతుందని, ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రారంభించారని తెలిపారు. ఉజాలా కేవలం విద్యుత్తు బిల్లులను తగ్గించడమే కాదని, పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తుందని చెప్పారు. ఈ పథకం వల్ల భారత్ 9586 మెగావాట్ల పీక్ డిమాండును తప్పించుకోగలిగిందని, అలాగే ఏటా రూ.19,152 కోట్లు ఆదా చేసుకోగలుగుతోందని వెల్లడించారు. ప్రధాని మోదీ నినాదమైన డిజిటల్ ఇండియాకు అనుగుణంగా ఈఈఎస్ఎల్ సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూ సుస్థిర ఇంధన సామర్థ్యానికి కృషి చేస్తోందని చెప్పారు.

ఇంధన సామర్థ్యంలో చంద్రబాబు ఛాంపియన్

ఈఈఎస్ఎల్ ఈ-కామర్స్ వేదికను ఏర్పాటు చేయడం ద్వారా ఇంధన సామర్థ్య ఉత్పత్తులను అందుబాటు ధరల్లోనే ప్రజలకు అందిస్తున్నట్లు ఈఈఎస్ఎల్ సేల్స్, కమ్యూనికేషన్స్ అధిపతి అనిమేష్ మిశ్రా తెలిపారు. ‘ఈఈఎస్ఎల్‌మార్ట్.ఇన్’ ద్వారా ఇంధన సామర్థ్య ఉపకరణాలను అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. విజనరీ నాయకుడైన ఏపీ సీం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఇంధన సామర్థ్య(ఈఈ) రంగంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందని కొనియాడారు.

ఈఈలో ఆయన ఛాంపియన్ అన్నారు. ఈఈ కార్యక్రమాల అమలులో ఏపీ అగ్రగామిగా నిలవడంలో ఆయన పాత్ర ఎనలేనిదని చెప్పారు. ఇంధన సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఈఈఎస్ఎల్ కార్యక్రమాల అమలు ద్వారా ఏపీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందన్నారు. ఇంధన సామర్థ్య సన్నద్ధతకు సంబంధించి 2016-17లో ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్ పొందిందని తెలిపారు. సీఎం చొరవ, చిత్తశుద్ధితో ఉజాలా కార్యక్రమ అమలులో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఎల్ఈడీ దీపాల ఏర్పాటు ఉద్యమంలా కొనసాగిందని తెలిపారు. ఇంధన సామర్థ్యం, పొదుపులో ఏపీ అగ్రగామిగా నిలిచిందని చెప్పారు.

ఉజాలా పథకం అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 2863 మిలియన్ కిలోవాట్ల (Million Kwh Hr)విద్యుత్తు ఆదా అవుతోందని చెప్పారు. 573 మెగావాట్ల పీక్ డిమాండును తప్పించుకోగలుగుతున్నట్లు తెలిపారు. అలాగే ఏటా 33 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించుకున్నట్లు వివరించారు. ఫలితంగా ఇంధన సామర్థ్యంలో లీడర్‌గా కొనసాగుతోందని మిశ్రా అన్నారు.

అవార్డు ప్రదానం సందర్భంగా మిలింద్ దేవరా ఈఈఎస్ఎల్‌ను అభినందించారు. ఉజాలా పథకం ద్వారా భారతదేశ లైటింగ్ పరిశ్రమను సమూల పరివర్తన చేయడంలో ఈఈఎస్ఎల్ కృషి ఎనలేనిదన్నారు. ఇంధన సామర్థ్య రంగంలో భారతదేశాన్ని సూపర్ పవర్‌గా నిలపడంలో ఇలాంటి ప్రతిష్ఠాత్మక గుర్తింపులు, పురస్కారాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ క్రతువులో పాల్గొన్న ప్రతి ఒక్కరు పురస్కార విజేతలేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ చాప్టర్ చైర్మన్ సాయి దేవరాజులు ప్రసాద్, సీఐఐ ఇంధన సామర్థ్య కౌన్సిల్ చైర్మన్ రవిచంద్రన్ పురుషోత్తమన్, సీఐఐ ఈడీ కె.ఎస్.వెంకటగిరి, సీఐఐ డిప్యూటీ ఈడీ పి.వి.కిరణ్ అనంత్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE