-రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
-పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డితో కలిసి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌ను పరిశీలించిన మంత్రి భరత్
– జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించి యాజమాన్యం, పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి సమావేశం
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ చెప్పారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి ఆయన ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్‌ను పరిశీలించారు.
అంతకుముందు ఎయిర్‌పోర్టు సమీపంలో టిడిపి ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు ఇండస్ట్రియల్ జోన్‌కు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. కొందరు దుండగులు శిలాఫలకం ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు. ఆ తర్వాత ఇండస్ట్రియల్ జోన్‌కు వెళ్లి అధికారులతో మాట్లాడారు. నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీఐఐసీ అధికారులతో చర్చించారు.
అనంతరం జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీ యాజమాన్యం, ఏపీఐఐసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాలను మంత్రి టి.జి భరత్, ఎమ్మెల్యే చరితారెడ్డికి ఫ్యాక్టరీ యాజమాన్యం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన పరిశ్రమలు మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో విధ్వంసం తప్ప జరిగిందేమీ లేదన్నారు. తమ టిడిపి ప్రభుత్వం అభివృద్ధే మంత్రంగా ముందుకు వెళుతోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం.. మళ్లీ టిడిపి ప్రభుత్వం రావడంతో ఇప్పుడున్న ఫ్యాక్టీరీని మరింత విస్తరించేందుకు ముందుకొస్తోందని తెలిపారు.
గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ సహకారం లేకపోవడంతో జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం నెమ్మదిగా సాగిందన్నారు. ప్రభుత్వం తరుపున ఫ్యాక్టరీకి అందించాల్సిన విద్యుత్, వాటర్, రైల్వే సైడింగ్స్ ఏదీ గత ప్రభుత్వం చేయలేదన్నారు. పారిశ్రామికవేత్తలందరితో చర్చలు జరుపుతున్నామని.. వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వారందరూ ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి టి.జి భరత్ తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ఏపీ నుండి వెళ్లిపోయిన ఓ పరిశ్రమ చెన్నైలో రూ.3 వేల కోట్లతో ప్లాంటును ఇప్పుడు నడుపుతుందని తెలిపారు. మళ్లీ మన రాష్ట్రానికి రావడానికి వాళ్లు ఆసక్తిగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్ లో మౌలిక సదుపాయాల కల్పనకు 1800 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు.
శ్రీసిటీ గ్రీన్ జోన్‌లో ఉందని, ఓర్వకల్లు రెడ్ జోన్‌లో ఉండటంతో ఎలాంటి పరిశ్రమలైనా ఇక్కడ ఏర్పాటుచేయొచ్చన్నారు. ఇలాంటి చోట మౌలిక సదుపాయాలు బాగా కల్పిస్తే ఓర్వకల్లులో పరిశ్రమలు భారీగా ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందుకే బెస్ట్ కన్సల్టెన్సీతో మాట్లాడి ఇండస్ట్రియల్ జోన్లో సమస్యలేమైనా ఉంటే గుర్తించి సరిచేసుకుంటామన్నారు. జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీ యాజమాన్యం సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
తమ ప్రభుత్వం మరో రెండు దశాబ్దాల పాటు కొనసాగుతుందని.. పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళతామన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్లో పెట్టుబడులు ఊహించిన దానికంటే ఎక్కువగానే వస్తాయన్నారు. ఇక్కడ నీరు, విద్యుత్, రోడ్డు, రైల్వే లైన్ ఇతర సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు.
అనంతరం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, ఇక్కడ అనేక పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఈ గ్రామాలలోని యువతకు ఉద్యోగావకాశాలు కూడా కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీ ఎండి కొయాంక, కర్నూల్ ఆర్డీవో శేషిరెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, ఇండస్ట్రీస్ జిఎం మారుతి ప్రసాద్, ఓర్వకల్లు తహసిల్దార్ వెంకటరమణ, ఇండస్ట్రియల్ ఏఈ సందీప్, తదితరులు పాల్గొన్నారు.