– ఆర్చి రోడ్డు చివర కరకట్ట నుంచి రామలింగేశ్వరరావు నగర్ వరకు వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు ఆలోచన
– ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
– కృష్ణలంక ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె, కలెక్టర్ లక్ష్మీ శా, ఎంపీ చిన్ని
విజయవాడ : ఎన్డీయే కూటమి ప్రభుత్వం సమస్యల పరిష్కారం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుంది. తూర్పు నియోజకవర్గం కృష్ణలంక ప్రాంతంలోని ప్రజలు జాతీయ రహదారిని దాటేందుకు ప్రజల పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి కృషి చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
సోమవారం ఉదయం కృష్ణలంకలోని రాణి గారి తోట, సత్యం గారి హోటల్, అమెరికన్ హాస్పటల్ వద్ద జాతీయ రహదారిని దాటేందుకు ప్రజల పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీశా లతో ఎంపీ కేశినేని శివనాథ్ పర్యటించారు.
రాణి గారి తోట నుంచి పశువుల హాస్పటల్ కి వెళ్లే మార్గంలో జాతీయ రహదారి దగ్గర నిర్మించాల్సిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో త్వరగా వెహికల్ అండర్ పాస్ నిర్మించాలని , ప్రమాదాలు నివారించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, సిగ్నల్ వ్యవస్థ, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్.హెచ్.ఎ.ఐ పి.డి. విద్యాసాగర్ కు సూచించారు.
సత్యం గారి హోటల్ వద్ద యాక్సిడెంట్లు నివారించేందుకు సిగ్నల్ లైట్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాట్ల పై , కృష్ణలంక నుంచి అమెరికన్ హాస్పటల్ నుంచి బందురు రోడ్ వెళ్లేందుకు వెహికల్ అండర్ పాస్ నిర్మించే విషయంపై ఎన్.హెచ్ విజయవాడ అధికారులతో మాట్లాడి త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. అదే విధంగా ఆర్చి రోడ్డు చివర కరకట్ట వద్ద రిటైనింగ్ వాల్ పక్కన చేపట్టాల్సిన అభివృద్ది పనులను పరిశీలించారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, కృష్ణనదీ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయాలని, ఈ ప్రాంతంలో నివసించే వారికి రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో 2014లో ముఖ్యమంత్రి గా వున్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రూ. 500 కోట్ల రూపాయలతో అంచనాలతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు మొదలైన సంగతి అందరికీ తెలిసిందే..రక్షణ గోడ నిర్మాణం వల్ల మురుగు నీరు నిల్వ వుంటుంది. ఈ మురుగునీరు నిల్వ వుండకుండా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.