– రెండేళ్లలో సుమారు రూ. 15 వేల కోట్ల విద్యుత్ భారం మోపిన వైసీపీ
– ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు
– విద్యుత్ సంస్థల నిధుల్ని బేవరేజెస్ కార్పొరేషన్ కు మళ్లించారు
– విద్యుత్ ఛార్జీల పెంపుపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదు
– విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలను ఇప్పటి వరకు పెంచలేదు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా పెంపు ఉండబోదని శాసన మండలి సాక్షిగా ప్రకటించారు. శాసన మండలిలో మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా గౌరవ సభ్యులు శివరామిరెడ్డి, అరుణ్ కుమార్, రవిబాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ రంగాన్ని సర్వ నాశనం చేసిన తీరును సభకు వివరించారు. తద్వారా వైసీపీ నేతలు చేస్తున్న సత్యదూరమైన ఆరోపణలను తిప్పి కొట్టారు. విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ నాయకులకు కనీసం మాట్లాడే అర్హత కూడా లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చివరి రెండేళ్ల పాలనలో ప్రజలపై రూ.15,000 కోట్ల విద్యుత్ భారం మోపిందని వెల్లడించారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.8,113 కోట్లకుపైగా విద్యుత్ ఛార్జీలను పెంచి ఈఆర్సీకి పంపిందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా మరో రూ.11,000 కోట్లు పెంపుపై ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి కావాల్సి ఉండగా, దానిని దాదాపు 20 నెలల కాలానికి సాగదీసిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనలతో పెరిగిన రూ.15,000 కోట్ల విద్యుత్ భారాన్ని కూటమి ప్రభుత్వంపై మోపేలా ప్రజలను మభ్య పెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో ఛార్జీలు పెంచిన వాళ్లే రోడ్లెక్కి ధర్నాలు చేయడం, ప్రశ్నలు వేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
తెలుగు దేశం ప్రభుత్వంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా…
రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి పరంగా అనేక అవాంతరాలు ఎదుర్కొందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. 2014 లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టిందని మంత్రి పేర్కొన్నారు. 2014 – 2019 మధ్య కాలంలో ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని వివరించారు. 2019 ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు మంత్రి తెలిపారు.
అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. కృష్ణపట్నం రెండో ఫేజ్, ఇబ్రహీపట్నం వీటీపీఎస్ ఐదో ఫేజ్ ప్లాంట్లను షట్ డౌన్ చేయించి ఉత్పత్తిని నిలిపి వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజెక్ట్ 2019 సమయానికి 70 శాతం పూర్తయినా… వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో మిగిలిన 30 శాతం పూర్తి చేయలేదని చెప్పారు.
అంతే కాకుండా కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణాలు లేకుండా చేశారని ఆరోపించారు. పునరుత్పాదక విద్యుత్ రంగానికి సంబంధించి గత ప్రభుత్వం సోలార్, విండ్ ఉత్పత్తిని కూడా ఆపేశారన్నారు. షార్ట్ టైం పవర్ పర్చేజ్ ల పేరుతో సుమారు రూ.10,000 కోట్లతో విద్యుత్ కొనుగోళ్ల చేసి ఆ భారం ప్రజలపై వేశారని మంత్రి వెల్లడించారు. విద్యుత్ సంస్థల నిధుల్ని కూడా బేవరేజెస్ కార్పొరేషన్ కు మళ్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఎద్దేవా చేశారు.
జగన్ లేఖతో రాష్ట్రానికి అపార నష్టం
అడ్డగోలు విద్యుత్ కొనుగోళ్లతో రాష్ట్ర ఖజానాపై భారం మోపడమే కాకుండా పీఎం కుసుమ్ పథకాన్నిఆంధ్రప్రదేశ్ కు వద్దంటూ వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. పీపీఏ లను రద్దు చేయడమే కాకుండా… ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని తెలిపారు. పెట్టుబడిదారులను రాష్ట్రం నుంచి తరిమేశారని వాపోయారు. అంతే కాకుండా విదేశీ ప్రతినిధులతో తిట్లు కూడా తిన్నారని మంత్రి గొట్టిపాటి ఎద్దేవా చేశారు.
ఇవేమీ బయటపడకుండా… సత్యదూరమైన మాటలతో కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2014 -19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో గానీ.., ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గానీ ఒక్క రూపాయి విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, ఇకపైనా పెంచబోమని మంత్రి గొట్టిపాటి మరోసారి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు జెన్కో ద్వారా నాణ్యమైన విద్యుత్ ను రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్ర సహకారంతో రైతులకు పగటి పూటే 9 గంటల విద్యుత్
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 65 శాతం విద్యుత్ కొనుగోళ్లను తగ్గించామని మంత్రి గొట్టిపాటి సభాముఖంగా వెల్లడించారు. జెన్కోను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఉత్పత్తి అయిన విద్యుత్ నిరుపయోగం కాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయ, సహకారాలతో బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థను తీసుకొస్తున్నామని మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ జరుగుతుందన్నారు.
అదే విధంగా పీఎం కుసుమ్ పథకం కావాలంటూ ప్రధానికి లేఖ రాశామని తెలిపారు. కుసుమ్ పథకం ద్వారా ఇప్పటికే లక్ష కనెక్షన్లు తీసుకున్నామని… మరో రెండు లక్షల కనెక్షన్లకూ అనుమతులు మంజూరయ్యాయని వివరించారు. పీఎం కుసుమ్ సహకారంతో రైతులకు పగటి సమయంలోనే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.