– ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
ఆహ్లాదం పంచే సినిమాపై కూడా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని ప్రభుత్వ తీరు పట్ల ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు,ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.
భీమ్లానాయక్ సినిమా విడుదల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సినిమా ధియేటర్ల వద్ద ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించి, అలజడి సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కే దక్కుతుందన్నారు. సరదాగా కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడిపే సినిమా థియేటర్ల వద్ద పోలీసులు,రెవెన్యూ అధికారులు హడావుడి తనిఖీలు చేయడం ఏమిటన్నారు.
ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల సామాన్య ప్రజల్లో సైతం ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయన్నారు. రెవెన్యూ అధికారులు పోలీసు యంత్రాంగం సినిమా ధియేటర్ల వద్ద కాపలా కాయడం రాష్ట్రంలో ఒక మాయని మచ్చల ఉందన్నారు. వీఆర్వో , రెవిన్యూ ఇన్స్పెక్టర్ సినిమా థియేటర్లో దగ్గరుండి టిక్కెట్లు అమ్మడం చరిత్రలో ఒక చీకటి రోజన్నారు. ప్రజా సమస్యలన్నీ పక్కన పెట్టి…థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం అన్నారు.
గతంలో గురువులతో మద్యం విక్రయాలు చేయించిన చరిత్ర దేశంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నారు. సీఎం కక్షసాధింపు చర్యలకు ఉద్యోగులను పావులుగా వాడుకోవడం తగదన్నారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం జగన్ వదలడం లేదని,చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడన్నారు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. వ్యక్తులను టార్గెట్ చేస్తూ వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు.
భీమ్లా నాయక్ విషయంలో థియేటర్ల యాజమాన్యాలపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలతో చర్చలు నిర్వహించిన సీఎం సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఒక పెద్ద సినిమా విడుదల సందర్భంగా ఆ సమస్యను పరిష్కరించకపోవడం సినిమా రంగంపై ఆయన చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు.
ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ వేధింపులతో 43 థియేటర్లు ఓపెన్ చేయలేదన్నారు. జీవో నెంబర్ 35 వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక థియేటర్లు తెరుచుకోలేదన్నారు. సీ సెంటర్ థియేటర్లలో టికెట్ ధర రూ. 5,10,15 ఉండడంతో థియేటర్ యాజమాన్యాలు చేతులెత్తేశాయన్నారు. షో వేస్తే కరెంట్ కు సైతం సరిపోవని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. ఉద్యోగుల వేతనాలకు సైతం ఇవ్వలేమని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.