Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చేతులెత్తేసిన ఉద్యోగ సంఘాలు

-మీడియా సమావేశంలో పొంతన లేని వ్యాఖ్యలు చేసిన ఉద్యోగ సంఘ నేతలు
-సమావేశ వివరాలను ప్రభుత్వమే మీడియాకు వెల్లడించాలి
-ప్రభుత్వాల నుండి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించే సంఘ నాయకులు ప్రశ్నించలేరు
-ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు

ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వాన్ని ఒప్పించడం, ఒత్తిడి తేవడంలో జాయింట్ కౌన్సిల్ సభ్యత్వ సంఘాలు విఫలమై,పూర్తిగా చేతులు ఎత్తేసాయని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు . విజయవాడలో సురేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ 12 తేదీన ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల సమావేశం అనంతరం ఉద్యోగ సంఘ నాయకులు ఒకరికొకరు పొంతన లేని వ్యాఖ్యలు చేయటం బట్టి తాము అశక్తులమని చెప్పకనే చెప్పినట్లు ఉందన్నారు.

ప్రధానమైన మంత్రివర్గ ఉపసంఘం,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన సమావేశ వివరాలను ప్రభుత్వమే విలేకరుల ముందు వెల్లడించాలి తప్ప సంఘ నాయకులు వెల్లడించటం ఏమిటని ప్రశ్నించారు. ఐదు సంవత్సరాల నుండి ఇదే తంతు జరుగుతుందని ముఖ్యమంత్రితో, ప్రభుత్వంతో లోపల చర్చలు జరిపాము అనటం ,బయటికి వచ్చి అన్నీ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి అని ఉద్యోగులకు మీడియా ముందు నేతలు బిల్డప్ ఇస్తూ ప్రకటనలు చేయటం, ఇంతవరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాక పోవడం లాంటి తంతు ఐదేళ్ల నుండి ఉద్యోగులు గమనిస్తున్నారన్నారు.

ప్రధాన ఉద్యోగ సంఘ నాయకులు తమ ఉద్యోగపరంగా ప్రభుత్వం నుండి ఇబ్బందులు రాకుండా ఉండటానికి, పదవీ విరమణ తర్వాత ఇతర రాజకీయ ప్రయోజనాలు ఆశించే నాయకులు ప్రభుత్వంపై సమస్యల పరిష్కారం కొరకు ఒత్తిడి తేలేకపోతున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. 12వ తేదీన ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సాధారణంగా జరిగే సమావేశాలలో భాగం మాత్రమేనని ,కానీ సంఘాలకు ప్రభుత్వం భయపడి సమస్యల పరిష్కారానికి చర్చలకు పిలిచినట్లు ఉద్యోగ సంఘ నాయకులు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారని అన్నారు.

ఉద్యోగుల్లో వ్యతిరేకత తగ్గించుకోవాలంటే ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రధానమైన కొన్ని సమస్యలు అయినా పరిష్కరించాలని లేదంటే ఉద్యోగుల్లో మరింత వ్యతిరేకత పెరిగి తద్వారా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయం గ్రహించుకోవాలన్నారు

LEAVE A RESPONSE