– ఏపీ సర్కారుపై ఉద్యోగుల సమరశంఖం
– 9 నుంచి ఆందోళనలు షురూ
– ఏప్రిల్ 5 తర్వాత కఠిన నిర్ణయానికీ సిద్ధం
– సర్కారుపై మారుతున్న ఉద్యోగుల వైఖరి
– ‘సర్కారు విశ్వాసపాత్ర’ ముద్ర తొలగించుకునే యత్నంలో ఉద్యోగ సంఘ నేతలు
– ఇప్పటికే సర్కారు తొత్తులంటూ నేతలపై వెల్లువెత్తుతున్న విమర్శలు
– మంత్రులు, కమిటీల మాటలు నమ్మేది లేదంటున్న నేతలు
– ప్రజలకు కలిగే ఇబ్బందులకు సర్కారే బాధ్యతంటూ స్పష్టీకరణ
– ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఎక్కడి నుంచి తీసుకురావాలి?
– నిధుల విడుదలే ఆందోళనకు పరిష్కారం
– నిధుల సమస్యలతో తలపట్టుకుంటున్న సర్కారు
– అమలు చేస్తుందా? అణచివేస్తుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సర్కారుకు ఉద్యోగుల సెగ మొదలయింది. తమ డిమాండ్ల సాధన కోసం 9 నుంచి ప్రారంభించనున్న దశల వారీ ఆందోళనతో సర్కారు ఉక్కిరిబిక్కిరి కానుంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగుల ఆందోళన, ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఖాయమన్న ఆందోళన, ప్రభుత్వవర్గాలను కలవరపరుస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు.. నానా పాట్లు పడుతున్న జగన్ సర్కారుకు, ఉద్యోగుల సెగ ఉక్కిరిబిక్కిరి చేసేదేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిధుల విడుదలే వారి సమస్యలకు ఏకైక పరిష్కారం. మరి ప్రతి నెల 20 వ తేదీ వరకూ జీతాలిస్తున్న ఏపీ సర్కారుకు, అన్ని నిధులు ఎక్కడ నుంచి వ స్తాయన్నదే ప్రశ్న.
తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం.. రోడ్డెక్కనున్న ఏపీ ఉద్యోగుల ఆందోళన, ఎటు దారితీస్తుందన్న చర్చకు తెరలేచింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల.. ఆర్ధిక-ఆర్ధికేతర సమస్యల పరిష్కారంలో, నాలుగేళ్లపాటు విఫలమవుతున్న జగన్ సర్కారుకు..ఎన్నికల ఏడాదిలో ఉద్యోగ సంఘాలు పెడుతున్న పొగ, పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఈ నాలుగేళ్లపాటు ఎవరినీ లెక్కచేయకుండా, ఏ వ్యవస్థనూ ఖాతరు చేయకుండా వ్యవహరించిన జగన్ సర్కారు దూకుడుకు.. ఉద్యోగ సంఘాలు సైతం భయపడ్డాయి. ఉమ్మడి రాష్ట్రం, ఆ తర్వాత విభజిత రాష్ట్రంలో ముఖ్యమంత్రులను వణికించిన ఉద్యోగ సంఘాలు.. ఒక ప్రత్యేక పరిస్థితిలో జగన్ సర్కారును చూసి, వణికిపోవడం అన్ని వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్టీఆర్ అంతటి మొండివాడు సైతం.. ఉద్యోగుల దెబ్బకు రోడ్డుపై బైఠాయించగా, జగన్ మాత్రం ఉద్యోగ సంఘాలను కంటిచూపుతో శాసించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇది ఉద్యోగులను వ్యతిరేకించే వర్గాలను మెప్పించింది. దానితో ‘ఏపీ ఉద్యోగులకు జగనే సరైనోడు’ అన్న భావన ఏర్పడింది. చంద్రబాబు హయాంలో అతిగా ప్రవర్తించిన ఉద్యోగ నేతల తోకలను జగన్ కత్తిరించారన్న భావన అటు ప్రజల్లో కూడా బలపడింది.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చాంబరుకు అవలీలగా వెళ్లి, సమస్యలపై చర్చించేంత స్వేచ్ఛ ఉన్న ఉద్యోగ సంఘాల నేతలను, జగన్ నాలుగేళ్లలో అసలు లెక్కచేయలేదు. బాబు కూడా ఉద్యోగులకు భయపడి.. నేతలకు మర్యాద ఇచ్చేవారు. ఆ రకంగా చంద్రబాబు భయాన్ని ఉద్యోగ నేతలు బాగానే సద్వినియోగం చేసుకున్నారు.
అయితే రెండు, మూడు సందర్భాల్లో తప్ప.. సీఎం జగన్ ఉద్యోగ నేతలను కలిసింది లేదు. దీనికి సంబంధించి.. సోషల్‌మీడియాలో ఒక కార్టూన్ వైరల్ అవుతోంది. చంద్రబాబును మా డీఏ సంగతి ఏం చేశావ్? ఓ ఉద్యోగి కాళ్ల మీద కాళ్లేసుకుని ప్రశ్నిస్తాడు. పక్కనే మరో చిత్రంలో జగన్ కాళ్లు పట్టుకుని ‘మాకు డీఏలు వద్దు. జీతాలెప్పుడిస్తారు చెప్పండి సార్’ అని ప్రాధేయపడుతున్న కార్టూన్.. ఏపీలో ఉద్యోగుల దుస్థితికి అద్దం పడుతోంది.
ఇక సచివాలయ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డి ఒక్కరే, సీఎం క్యాంపు ఆఫీసులో కనిపిస్తారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ఇటీవలి కాలం వరకూ నేతలతో చర్చించేవారు. అయితే, ఆయనతో కూడా లాభం లేదని ఉద్యోగ సంఘ నేతలు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో .. సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్ హామీని ఉద్యోగ సంఘ నేతలు గుర్తు చే స్తుంటే, ఇంతవరకూ దానిపై సీఎం జగన్ స్వయంగా స్పందించిన దాఖలాలు లేవు. పైగా తమకు సీపీఎస్ రద్దుపై అవగాహన లేకుండా, ఆ హామీ ఇచ్చినట్లు సజ్జల చేసిన ప్రకటన.. వైసీపీని అభాసుపాలు చేసింది. మాట తప్పం-మడమ తిప్పమని చెప్పే జగన్, సీపీఎస్ విషయంలో మడమ ఎందుకు తిప్పారని.. అటు విపక్షం కూడా ముప్పేట దాడి చేస్తోంది.
దానితో మంత్రుల కమిటీతో చర్చించినప్పటికీ, సమస్యలపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో, ఉద్యోగ సంఘ నేతల విశ్వసనీయతపై.. ఉద్యోగుల్లో సహజంగానే అనుమానాలు ఏర్పడ్డాయి. ఉద్యోగ నేతలు సర్కారుతో కుమ్మక్కయినందుకే, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, నేతలు తమ ప్రయోజనాల కోసం తమను తాకట్టు పెడుతున్నారన్న అసంతృప్తి-ఆగ్రహం ఉద్యోగుల్లో కట్టలు తెంచుకుంది.
తాజాగా గవర్నర్‌ను కలసిన ఉద్యోగ సంఘ నేతలపై.. వేటు వేసేందుకు సర్కారు చేసిన ప్రయత్నాలు, ఇచ్చిన షోకాజ్ నోటీసులు ప్రభుత్వానికి- ఉద్యోగుల మధ్య పూడ్చలేనంత దూరం పెంచాయి. తెలంగాణలో ఉద్యోగ సంఘాలు, గవర్నర్‌ను కలిసిన వైనాన్ని గుర్తు చేస్తున్న ఉద్యోగులు.. ఇదంతా తమ నేతల చేతకాని, చేవలేని తనం వల్ల జరుగుతున్న అవమానమని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమపై ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆగ్రహం- అసంతృప్తి గ్రహించిన నేతలు, సరిగ్గా ఎన్నికల ఏడాది ముందు.. తాము జమ్మిచెట్టుపై దాచిన అస్త్రాలను కిందకు దించడంతో కథ కొత్తమలుపు తిరిగింది. తమ ఆందోళన ప్రభుత్వానికి వ్యతిరేకం కాదంటూనే.. తమకు ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఉద్యోగ సంఘ నేతలు జిల్లా పర్యటనల్లో ఏకరవు పెడుతుండటం ప్రస్తావనార్హం.
9 నుంచి చేపట్టే ఆందోళన ఆషామాషీగా ఉండదని, ప్రభుత్వం దిగిరాకపోతే ఏప్రిల్ 5న కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని, అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించడం గమనార్హం. కోవిడ్ సమస్యలతో రాష్ట్ర ప్రభుత్వ ఇబ్బందులను గ్రహించి, ఇప్పటిదాకా తాము ప్రభుత్వానికి సహకరించామని ఆయన గుర్తు చేశారు.
నిజానికి ఉద్యోగుల డిమాండ్లు కొత్తవేమీ కాదు. తాము దాచుకున్న డబ్బు తమకు ఇవ్వడానికి అభ్యంతరాలేమిటన్నది వారి ప్రశ్న. లక్షలాది రూపాయల డిఏ అరియర్స్ ఇచ్చినట్లే ఇచ్చి, వెనక్కి తీసుకోవడాన్ని ఉద్యోగులు సహించలేకపోతున్నారు. సీపీఎస్ రద్దు చేస్తానన్న జగన్ హామీని, ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు. సీపీఎస్‌పై సాకులు చెబుతున్న ప్రభుత్వం..ఓసారి చత్తీస్‌ఘడ్, రాజస్థాన్‌కు వెళ్లి, అక్కడ ఇస్తున్న పాత పెన్షన్ విధానాన్ని పరిశీలించాలని దెప్పిపొడుస్తున్నారు. ఎన్నికల సమయంలో అవుట్‌సోర్సింగ్-కాంట్రాక్టు ఉద్యోగులను, రెగ్యులరైజ్ చేస్తానన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ ద్వారా వైద్యం అందడం లేదన్నది ప్రధాన ఆరోపణ. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో, కార్పొరేట్ ఆసుపత్రులు డబ్బులు కట్టించుకున్న తర్వాత నే, వైద్యం చేస్తున్నారని ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. అసలు తాము దాచుకున్న డబ్బును, వేరే అవసరాలకు మళ్లించే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నది వారి మరో ప్రశ్న. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్లు, పెండింగ్ డీఏలు లేవు.
ఆర్టీసీలో ఇస్తున్న ఓటీ అలవెన్సులు కూడా నిలివేశారు. వీటిని పక్కనపెడితే… అసలు ప్రతినెల 1వ తేదీన రావాల్సిన జీతాలు, పెన్షన్లు 20వ తేదీ తర్వాత కూడా ఇస్తుండటమే ఉద్యోగుల ఆగ్రహానికి అసలు కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడం వల్లే, పదవీ విరమణ వయసును పెంచారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే తమ ఆందోళన ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వ హామీలు-బాధ్యత గుర్తు చేసేందుకే ఆందోళన చేస్తున్నామని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు స్పష్టం చేశారు. ‘అసలు మా ఉద్యోగుల కోసం బడ్జెట్‌లో కేటాయించిన డబ్బుతోపాటు మేం దాచుకున్న డబ్బు ఏమైంది? మా అనుమతి లేకుండా వాటిని మళ్లించే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఒకటవ తేదీన ఉద్యోగులు-పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు ఎందుకివ్వరు? 20వ తేదీవరకూ జీతాలు ఇస్తూనే ఉన్నారు కదా? ఇదేం పద్ధతి? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మా సమస్యలపై ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తాం’ అని బొప్పరాజు వ్యాఖ్యానించారు.
అయితే.. ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలతో ప్రజలు ఇబ్బంది పడితే తమకు సంబంధం లేదని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. 9 వ తేదీ నుంచి ఏప్రిల్ 3 వరకూ దశలవారీ పోరాటం చేస్తామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఏప్రిల్ 5న జరిగే సమావేశంలో, కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని బొప్పరాజు హెచ్చరించారు.