( మార్తి సుబ్రహ్మణ్యం)
ఈయనెవరో ఓసారి జాగ్రత్తగా చూడండి. దేవుడు లేడు..దెయ్యం లేదు. హిందుత్వం అనేది ఒక మతోన్మాదం అంటూ వాదించి, ఇతర మతాలపై జరిగే దాడులను ఎప్పటికప్పుడు ఖండించి, హిందువులపై దాడులు జరిగినప్పుడు మాత్రం.. నవరంధ్రాలూ మూసుకుంటారనే విమర్శలున్న ఈయనను ఇంకా గుర్తుపట్టలేదా? ఓకే. ఓకే. ఫర్వాలేదు.
ఈయన పేరు తెలుగు సినిమాల్లో విలన్, తండ్రి పాత్రలు వేసే క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రకాష్‌రాజ్. అయితే ఏంటి అనుకోకండి. ఆయనేదో చెరువులో దిగితే ఈ రచ్చ రంబోలా ఏందని రుసరుసలాడకండి. ఎందుకంటే అది చెరువు కాదు స్వామీ.. మహాకుంభమేళా సందర్భంలో ప్రయాగరాజ్‌లో ప్రకాష్‌రాజ్ చేసిన నదీస్నానం. వార్నీ.. మరి ఇప్పటిదాకా కేసీఆర్ మాదిరిగా, హిందూ లేదు బొందూ లేదని రంకెలు వేసిన ప్రకాష్‌రాజ్‌జీకి హటాత్తుగా దేవుడెలా గుర్తుకొచ్చారబ్బా? బుద్దుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయమయినట్లు, మన ప్రకాష్ రాజన్నకు ప్రయాగరాజ్‌లో జ్ఞానోదమయిందా ఏందని వెధవ లాజిక్కు ప్రశ్నలు వేయకండి.
ఎక్కడో అక్కడ! జ్ఞానోదయమయిందా? లేదా అన్నదే కదా పాయింటు?! ఎప్పుడు వచ్చావు కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ అన్న మహేష్‌బాబు డైలాగు లెక్క.. ఎప్పుడు జ్ఞానోదయమయిందన్నది కాదు లెక్క. అసలు జ్ఞానోదమయిందా? లేదా అన్నదే పాయింట్. ఇంత సుత్తి ఎందుకు? ప్రకాష్‌రాజ్‌కు ప్రయాగరాజ్‌లో జ్ఞానోదమయమయిందని ఒక్క ముక్కలో చె ప్పొచ్చు కదన్నయ్యా అంటే.. మరి ముందు మన ప్రకాష్‌రాజ్ గొప్పతనం, ఆయన వేసిన హిందూ వ్యతిరేక రంకెల గురించి చెప్పుకోవాలి కదా తమ్ముడూ?! టైటిల్స్ లేకుండా సినిమా ఏత్తారేటి?
‘‘ నేను నాస్తికుడినంటావ్. రోజూ హిందువులపై పడి ఏడుస్తుంటావ్. మళ్లీ ప్రయోగరాజ్‌కు వెళ్లి స్నానం చేస్తావ్. నిన్ను ఏమనాలి..నీ దుంపతెగ’’ అంటూ నెటిజన్లు ప్రకాష్‌రాజ్ ప్రయాగ స్నానంపై తెగ తెగ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో రచ్చరంబోలా చేస్తోంది.