Suryaa.co.in

Features

పరిసరాల పరిశుభ్రత – డ్రైనేజీ వ్యవస్థ

– పారిశుధ్య రంగంపై ఒక పరిశీలన!

ఇంటిలో, ఇంటి పరిసరాలలో, ఆసుపత్రులలో, రోడ్లపైన, పని ప్రదేశాల్లో, వాణిజ్య సముదాయాల్లో, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, పార్కుల్లో, జన సంచారం ఉన్న బహిరంగ ప్రదేశాలన్ని చోట్లా పరిశుభ్రతను పరిరక్షించుకొంటే, కాలుష్యాన్ని అరికట్టవచ్చు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుంది. ఈ చైతన్యం పౌరులకు ప్రాథమిక అవసరం. ప్రాథమిక విద్య స్థాయిలోనే ఈ చైతన్యాన్ని పౌరులకు కల్పించాలి.

మన దేశ జనాభా 143 కోట్లకు చేరుకోబోతున్నది. జనాభా రీత్యా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవబోతున్నది. పేదరికం, నిరక్షరాస్యత ఎక్కువ. సామాజిక అసమానతలు అన్ని రంగాలలో ప్రగతికి అవరోధంగా ఉన్నాయి. పారిశుధ్య రంగంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు సంక్లిష్టమైనవే!
యు.కె. జనాభా ఆరున్నర కోట్లకుపైగా ఉన్నది. పౌరుల ఆర్థిక స్థితిగతులు, విద్య, సామాజిక పరిస్థితులు మెరుగైన స్థితిలో ఉండవచ్చు! శీతల దేశం.

రెండూ భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, చారిత్రక నేపథ్యం ఉన్న దేశాలు. ఈ అంశాలను గమనంలో ఉంచుకొనే పారిశుధ్య రంగాన్ని పరిశీలించడం అవసరమే!

మహాత్మాగాంధీ పరిసరాల పరిశుభ్రతపై భారతీయుల్లో అవగాహన పెంచడానికి కృషి చేశారు. ఆయన ఇంగ్లాండులో విద్య నార్జించారు. భారత్ – ఇంగ్లండ్ దేశాల్లోని పారిశుధ్య రంగాలపై ఆయన అధ్యయనం చేసి ఉండవచ్చేమో! మోడీ అన్నింటినీ రాజకీయ అస్త్రాలుగా వినియోగించుకోవడంలో దిట్ట. “స్వచ్ఛ భారత్” నినాదంతో ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టి, నిధులు కేటాయించారు. కానీ, ప్రచార ఆర్భాటానికి తగ్గట్టు అమలులో చిత్తశుద్ధి కనబరచలేదు. పర్యవసానంగా ఆశించిన సత్ఫలితాలు కనపడడం లేదు.

“స్వచ్ఛ సర్వేక్షన్ స్టడీ టూర్”లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 80 మంది పారిశుధ్య విభాగం ఉద్యోగులు, కార్మికుల బృందం ఇండోర్ కు వెళుతున్నామని 1975-80 మధ్య కాలంలో ఏఐఎస్ఎఫ్ ఉద్యమ నిర్మాణంలో నా సహచరుడు, మునిసిపల్ వర్కర్స్ యూనియన్ (ఏ.ఐ.టి.యు.సి) రాష్ట్ర నాయకుడు కా.బి.తులసేంద్ర ఒక మెసేజ్ పంపారు. ఈ పోస్టు పెట్టడానికి ఒక విధంగా ఆ మెసేజ్ కూడా కారణమయ్యింది.

యు.కె.లో మా అమ్మాయి ఉన్న ‘లీమింగ్టన్ స్పా” మధ్య తరహా పట్టణం. మార్నింగ్ వాక్ లో ఒక స్థానిక పౌరుడితో మాట్లాడినప్పుడు ఈ పట్టణాన్ని గురించి చెప్పారు. కొంత కాలం క్రితం మూడు వేల జనాభాతో ఒక గ్రామంగా ఉండేది. జాగ్వార్ కార్ల కంపెనీ, టాటా సంస్థ, అలాగే ఇతర సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించడంతో గ్రామం, పట్టణంగా మారిపోయిందని, ప్రస్తుతం పదహైదు లక్షలకుపైగా జనాభా ఉన్నదని చెప్పారు.

ఈ పట్టణంలో అనేక విశాలమైన పార్కులు, రోడ్డులు, పుట్ పాత్ లు, ఇళ్ళు, ప్రణాళికా బద్ధంగా నిర్మించబడ్డాయి. నివాస ప్రాంతాల్లోను, పని ప్రదేశాల్లోను, విశాలమైన రోడ్లపైన, పార్కుల్లోను, షాపింగ్ మాల్స్, ఎక్కడ గమనించినా పరిసరాల పరిశుభ్రత ముచ్చటేస్తుంది.

మా అమ్మాయి ఉన్న డూప్లెక్స్ ఇంటిలో ఒకే ఒక్క టాయిలెట్ ఉన్నది. అది కూడా పైభాగంలో ఉన్న గదులకు అనుబంధంగా ఉన్నది. దానికి లోపలి నుండి బోల్ట్ పెట్టడానికి కూడా ఏర్పాటు లేదు. ఇక్కడ అన్ని ఇళ్లలో ఇదే తరహా నిర్మాణాలు ఉంటాయట. ఒక్క టాయిలెట్ సరిపోదని మా అమ్మాయి స్థానిక పురపాలక సంస్థకు విజ్ఞప్తి చేసి, అద్దె చెల్లించి, ఇంటి బయట ఒక మొబైల్ టాయిలెట్ ను తాత్కాలికంగా ఏర్పాటు చేయించింది. అలా ఏర్పాటు చేసుకొనే సౌలభ్యం ఉన్నది. దాన్ని పారిశుధ్య కార్మికులు వారానికి ఒకసారి ఆధునిక యంత్ర సామగ్రిని వెంట తీసుకొచ్చి, శుభ్రం చేసి వెళుతున్నారు.

నేను పారిశుధ్య శాఖ కార్మికుల పనితీరును గమనించాను. వారి పనిని నియంత్రించడానికి సూపర్ వైజర్ లేడు. కార్మికులే జవాబుదారీతనంతో, బాధ్యతాయుతంగా వారి పని వారు చేసుకుపోతున్నారు. వారి పని సంస్కృతిని, వృత్తి నైపుణ్యాన్ని గమనించాను.

నివాస ప్రాంతాల్లో, రోడ్ల మీద పెద్దపెద్ద చెత్త బాక్స్ లు పెద్ద సంఖ్యలో ఉండడం చూశాను. ప్రతి ఇంటికి నాలుగు చెత్త బాక్స్ లు(రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రాట్) పెట్టారు. ఇళ్ళ ముందే వాటిని చూసి చికాకుపడ్డాను. కారణం, వాటి మీదుగా నడిచే సమయంలో భరించలేని వాసన వస్తుందని భావించాను. మన దగ్గర మునిసిపాలిటీ వాళ్ళు పెట్టిన చెత్త బాక్సులున్న ప్రాంతాల్లో ముక్కులు మూసుకోకుండా నడవడం కష్టం కదా! అందుకే, చికాకుపడ్డాను.

కానీ, అనుభవం భిన్నంగా ఉన్నది. వాటి నుండి ఏ మాత్రం దుర్గంధపూరితమైన వాసనలు రావడం లేదు. కారణం, చెత్తను రవాణా చేసే వాహనాలతో, ఉదయాన్నే ఇంటింటికీ వచ్చి, క్రమం తప్పకుండా చెత్తను తీసుకెళ్ళుతున్నారు. వాటిలో నిల్వ ఉండడం లేదు.

డ్రైనేజీ వ్యవస్థలో మ్యాన్‌హోల్స్/జెక్షన్స్ ముఖ్యమైనవి. డ్రైనేజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను తనిఖీ చేయడానికి, శుభ్రపరచడానికి, మరమ్మతులు చేయడానికి ఇవి యాక్సెస్ పాయింట్లు. డ్రైనేజీ నిపుణులు ఆ పనులు చేస్తారు. ఒక రోజు ఉదయం మేమున్న ఇంటి ముందు మరియు ఇటు, అటు, మూడు మ్యాన్‌హోల్స్ దగ్గర ముగ్గురు డ్రైనేజీ నిపుణులు(కార్మికులు) మరమ్మత్తు పనులు చేస్తుండడాన్ని గమనించాను. ముగ్గురూ, రెండు పెద్ద వ్యాన్లలో మరమ్మత్తు సామాగ్రిని వెంట తీసుకొచ్చారు.

ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాన్ హోల్ ను ఓపెన్ చేశారు. పారలతో మట్టి తవ్వి బయటికి తీసి పోశారు. రిపేర్ వర్క్ పూర్తి చేసి, మళ్ళీ మ్యాన్ హోల్స్ మూసేశారు. అంత చకచకా, చక్కగా మరమ్మత్తు పనులు పూర్తి చేసి వెళ్ళిపోయారు. అటుపై మ్యాన్ హోల్స్ ను చూస్తే, అసలు అక్కడ మరమ్మత్తు చేసిన ఆనవాళ్ళు కూడా కనపడలేదు. అంత నాణ్యతతో పని చేశారు.

మన దగ్గర మరమ్మత్తు పనులు చేయరు, చేయడం మొదలుపెట్టినా త్వరితగతిన పూర్తి చేయరు, అరకొరా చేసి వదిలేస్తారు. కార్మికుల కొరత, నిధుల కొరత, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక, మరమ్మత్తు పనులు అలా నెలల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. ప్రజలు అసౌకర్యానికి గురవుతూ, ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వర్షా కాలం వచ్చిందంటే హైదరాబాదు మహానగరంలో మ్యాన్ హోల్స్ లో పడిపోయి చనిపోయిన వార్తలను తరచూ వింటూనే ఉంటాం.

చెత్త తీసుకెళ్ళిన కార్మికులు, డ్రైనేజీ మరమ్మతు పనులు చేసిన కార్మికులు, యూనిఫాం, చేతులకు గ్లౌజ్ లు, బూట్లు వేసుకొని ఉన్నారు. బలంగా, ఆరోగ్యకరంగా ఉన్నారు. నేను గమనించిన వాళ్ళందరూ పురుషులే. మహిళలు లేరు. మన దగ్గర మున్సిపల్ కార్మికుల్లో అత్యధికులు మహిళలే ఉంటున్నారు. మన మున్సిపల్ కార్మికుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఉపాథి భద్రత, సామాజిక భద్రత, పని సంస్కృతిలో ఉన్న వ్యత్యాసాలు గుర్తుకొచ్చాయి.

కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించి, పనిముట్లు అందజేసి, న్యాయబద్ధమైన జీత భత్యాలు సకాలంలో చెల్లిస్తూ కార్మికుల సంక్షేమానికి, భద్రతకు అవసరమైన కార్యాచరణ అమలు చేయడంలో మన ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో యంత్ర సామగ్రితో చేయాల్సిన పనులను కూడా మున్సిపల్ కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు.

డ్రైనేజీ మరమ్మత్తులు చేసే కార్మికులను ఇంగ్లాండులో డ్రైనేజీ నిపుణులుగా గుర్తిస్తున్నారు. శ్రమను గౌరవించే సంస్కారం మన వ్యవస్థలో కొరవడింది. మున్సిపల్ కార్మికులను చిన్న చూపు చేసే దౌర్భాగ్య పరిస్థితి కొనసాగుతున్నది.

మన ప్రభుత్వాలు 73, 74 రాజ్యాంగ సవరణలను అమలు చేసి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన స్థానిక సంస్థలకు ఆర్థిక పరిపుష్టి కల్పించి, అధికారాలను, బాధ్యతలను చట్టబద్ధంగా బదిలీ చేసి, వాటిని స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించి, సమర్థవంతంగా పని చేయడానికి అవకాశం కల్పించాలన్న రాజకీయ సంకల్పమే పూర్తిగా కొరవడింది.

బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తున్న ఘటనలను ఇంగ్లాండులో చూడలేదు. మన దగ్గర బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన సర్వసాధారణమైన ఘటనలుగా చూస్తుంటాం. ఆ వెసులుబాటు, స్వేఛ్చ మన సమాజంలో ఉంది! దుర్గంధం భరించలేక ఎవరైనా కాస్త అడిగితే రుసరుసలాడిపోతాం! మా అమ్మాయి ఇంటి ముందు ఏర్పాటు చేయించుకొన్న తాత్కాలిక టాయిలెట్ ను వినియోగించుకోవడానికి ఒక పారిశుధ్య కార్మికుడు బుద్ధిగా వచ్చి, అనుమతి తీసుకొని వాడుకున్నాడు.

అలాంటి వాతావరణం నెలకొల్పబడింది. చాలా అరుదుగా రోడ్ల ప్రక్కన పబ్లిక్ టాయిలెట్స్ బోర్డులు కనపడ్డాయి. ప్రజలు ఎక్కువగా సందర్శించే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, రైల్వేస్టేషన్లు, పెట్రోల్ బంక్స్, పర్యాటక ప్రదేశాల్లో టాయిలెట్స్ విధిగా ఏర్పాటు చేయబడ్డాయి.

విజయవాడ బస్టాండులో మూత్ర విసర్జనకు ఐదు రూపాయలు వసూలు చేస్తుంటే, అన్యాయమనిపించింది. ఇంగ్లాండులో ఒక చోట టాయిలెట్స్ వాడుకోవడానికి అర్థ పౌండ్ (రు.52) వసూలు చేశారు. మిగిలిన చోట్ల ఉచితమే. ఇంగ్లాండులో మాత్రం ఉచితంకాదని మిత్రులు చెప్పారు.

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

LEAVE A RESPONSE