Suryaa.co.in

Features

అమ్మ ముడుపు!

( శ్రీపాద శ్రీనివాస్)

తాను పుచ్చుకునేది రెండు రూపాయలే… కానీ తిరిగి ప్రసాదించేది అపారమే .ఇదే షిర్డీ సాయి తత్వంలోని ఇమిడి ఉన్న అంశం. ఇక్కడ రెండు రూపాయలు అంటే.. ఒకటి భక్తి..రెండోది విశ్వాసం! ఈ రెండు సమర్పించిన వారి ఇంట, అంతా తానై వ్యవహరిస్తానని బాబా మాటల్లో నిగూఢమై ఉన్న పరమార్ధం.

అందుకే అనుకుంటాను.. నిత్యం బాబా ఆరాదనలో ఓం సాయి అని మననం చేసుకుంటూ, అమ్మ కాలం వెళ్ళబుచ్చేది …అని శ్రీరామ్ తన మనస్సులో అనుకుంటున్నాడు.

మరోవైపు తాను ఎక్కిన రైలు షిర్డీ వైపు పరుగులు తీస్తోంది….కానీ ఇదేమి పట్టనట్టుగా అమ్మ తాలూకు ఆలోచనల్లోకి జారుకుంటున్నాడు శ్రీరామ్.

ఆ రోజు గురువారం…

ఏరా….మన వాడ లోకి బాబా గారి బండి వచ్చిందేమో చూడు అంటూ, తన కొడుకు శ్రీరామ్ కి పురమాయిస్తోంది అనసూయ..

అబ్బబ్బ…ఏమిటి నీ హడావుడి…ప్రతి వారం ఆ బండి వచ్చేది కదా..ఎందుకు అంత కంగారు పడతావు..అంటూ శ్రీరామ్ తన అమ్మ మీద ప్రతిగా అరుస్తున్నాడు.

అయినా నీ పిచ్చికాని బాబా గారి బండిలోని హుండిలో వేసే రెండు రూపాయలు, ఈ రోజుల్లో ఏపాటి…దేనికి సరిపోతుందని…బాబా గారి జీవించి ఉన్న రోజుల్లోని పరిస్ధితుల అనుగుణంగా, ఆ మొత్తం గురించి సదరు రచయిత గ్రంధంలో పేర్కొని ఉంటాడు. చాదస్తంగా దాన్నే పట్టుకుని కూర్చున్నావు నువ్వు.

రెండు రూపాయలు కాకుండా ..ఇంకొంచెం మొత్తం ఎక్కువ వేయోచ్చు కదా అంటూ, శ్రీరామ్ పరిహాసం ఆడుతున్నట్టుగా అమ్మవైపు చూస్తూ, చిరునవ్వులు చిందిస్తున్నాడు.

ఆ మాటలకు కాస్త నొచ్చుకున్నట్టుగానే శ్రీరామ్ కేసి చూస్తోంది అనసూయ. ఆ మాత్రం నాకు తెలియదని నీ ఉద్దేశమా? బాబా గారికి రెండు రూపాయలు సమర్పించే విషయంలో ఎంత పరమార్ధం దాగి ఉందో నీకు తెలుసా అసలు? అవేమి తెలియని నువ్వు అజ్ఞానంతో మాట్లడుతున్నావు!

బాబా గారికి రెండు రూపాయలు సమర్పించడం అంటే, భక్తిని మరియు భగవంతుని పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ, నాణేల రూపంలో ఆ రెండింటిని సమర్పించడమే.. ఆ విధంగా సమర్పింపబడ్డ వాని ఇంట, ఏదో ఒక రూపంలో బాబా అంతా తానే వ్యవహరిస్తాడు. అయినా భగవంతునికి ధనంతో ఏమిటి పని… ఆయన మన చేత చేయించే ప్రతి కార్యంలోను ఓ పరమార్ధం దాగి ఉంటుంది. ఇలాంటి విషయాలను గ్రహించ కలిగే వయస్సు లేని నువ్వు , అజ్ఞానం తో మాట్లాడుతున్నావు అని శ్రీరామ్ ని సుతిమెత్తగా మందలిస్తోంది అనసూయ.

ఆ మాటలను అంటునంతసేపు అమ్మ కళ్ళలో ఆద్యాత్మికమైన తన్మయత్వాన్ని గమనిస్తూనే వున్నాడు శ్రీరామ్. ఆలోచనల ఏమారుపాటుతో మనస్సులో కలిగిన ఆటుపోట్ల ప్రబావం కాబోసు, ఒక్కసారి వర్తమానంలోకి వచ్చాడు శ్రీరామ్. రైలు మాత్రం బాబాగారి సన్నిధికి భక్తులను చేర్చేందుకు ఉవ్విళ్లూడుతున్నట్లుగా ముందుకు పరుగులు తీస్తూనే ఉంది..

శ్రీరామ్ మాత్రం ఓ మారు తన బ్యాగ్ ని తడుముకుని చూసుకుంటున్నాడు. బాబా గారికి అమ్మ చెల్లించాల్సిన ముడుపుల మూట చేతికి తగిలింది. ఆ మూటలో తన మరణానికి ముందు బాబాగారికి చెల్లిద్దామని, అమ్మ దాచి పెట్టిన రెండు రూపాయల నాణెం చేతికి తగిలింది శ్రీరామ్ కి.

వారాంతంలో వాడలోని తన గుమ్మం ముందుకు వచ్చే బాబా గారి బండిలోని హూండిలో వేయడానికి, అమ్మ దాచుకున్న రెండు రూపాయల నాణెం అది. ఆ సమయంలో ఒక్కసారి దుఖ్ఖం ముంచుకొచ్చింది శ్రీరామ్ కి. తన మరణానికి ముందు రోజు బాబా గారి బండి తన ఇంట ముంగిటకు వచ్చినా సరే కదలలేని పరిస్ధితి. ఈ కారణంగా బాబా గారి హూండికి చేరాల్సిన రూపాయి అట్లానే ఉండి పోయింది. అమ్మ మాత్రం దేవుని వద్దకు వెళ్ళిపోయింది.. శ్రీరామ్ ని ఒంటరిచేసేసి వెళ్ళిపోయినట్టే, ఆ రెండు రూపాయల నాణెన్ని కూడ వదిలి వెళ్ళి పోయింది.

అప్పటి నుండి ఆ నాణెన్ని తాకి నప్పుడల్లా, అమ్మ చేతిని తాకిన చల్లని అనుభూతి తనకి కలుగుతూనే ఉంది శ్రీరామ్ కి. దుఖ్ఖం తో వచ్చే కనీళ్ళనుండి అయినా తన బాధను మరిపించుకుందామని..అందుకే ఒక్కసారి గట్టిగా ఏడ్చేయాలని శ్రీరామ్ కి అనిపిస్తోంది.

కానీ ఒక్కసారి తన మనస్సులో ఏదో తటాపయింపు…ఆ తటపాయింపులో అమ్మ మాటలు తన చెవిని తాకుతున్నాయి శ్రీరామ్ కి. నీ ప్రతి అడుగులోను నేనుంటాను. ఏదో ఒక రూపంలో నిన్ను నడిపిస్తూనే ఉంటాను. నేను లేననే బాధతో నిస్పృహకు గురవ్వొద్దు…అట్లాంటి నిస్పృహతో విడిచిన కనీళ్ళ నుండి నేను జారిపోతాను. నీకు దూరమై పోతాను. అని అమ్మ చివరిసారిగా పలికిన మాటలు, శ్రీరామ్ ని తాకాయి. వెనువెంటనే ఉబికి వస్తున్న బాధను తనలోనే అణుచుకుంటూ, తడిబారిన కళ్ళను తుడుచుకోడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీరామ్..
. …..

షిరిడి చేరుకున్న ట్రైన్ లో నుంచి దిగిన శ్రీరామ్, నెమ్మదిగా స్టేషన్ బయటకు చేరుకున్నాడు. స్టేషన్ కి ఇరువైపులా పరికించి చూస్తున్నాడు.

గతంలో కూడా అమ్మను శ్రీరామ్ షిరిడీకి తీసుకొచ్చాడు. కొత్త ప్రాంతం..పైగా బాష తెలియని ప్రాంతం. ఆ బెరుకుతో తన కొడుకు శ్రీరామ్ చేతిని గట్టిగా పట్టేసుకుంది అనసూయ. అంత బె రుకులోను బాబాగారి సన్నిధి కోసం ఆతృతగా పరికించి చూసింది. అబ్బబ్బా ఒక్కమారు చెయ్యిని వదులు. లగేజీ ని ఆటో ఎక్కించాలి అని అప్పట్లో శ్రీరామ్ రుసరుసలాడేడు.

సరిగ్గా అదే సమయంలో బాబాగారి పల్లకి ఊరేగింపు, షిరిడి పుర విధుల్లో తిరుగుతోంది. తన ప్రమేయం లేకుండానే అనసూయ, తన కొడుకు శ్రీరామ్ చేతిని వదిలేసి బాబా పల్లకి వైపు తన రెండు చేతులను జోడించి నమస్కరించుకుంది.

ఒరేయ్ శ్రీరామ్… సాక్షాత్తూ సాయినాధుడు సంచరించిన ప్రాంతానికి తీసుకొచ్చావు. అటువంటి సద్గురు తిరగాడిన ఈ విధుల్లో నడుస్తూనే , సాయినాధుని సన్నిధికి చేరుకుందాం. ఆటోలు.. టాంగాలు వద్దు. ఆనందంతో అనసూయ అంటోంది. అంత పెద్ద వయసులోనూ, అమ్మ కు కలిగిన ఉత్సహాన్ని చూసి ఆశ్చర్యం వేసింది అప్పట్లో శ్రీరామ్ కి.

స్టేషన్ లో నుండి బయటకు వచ్చి చుట్టూ పరికించి చూస్తున్న శ్రీరామ్ కి , నాటి ఈ సందర్భం గుర్తుకు వచ్చింది. ఆ క్షణంలో తనలో కలిగిన బాధను అనుచుకోడానికి “ఓం సాయిరాం” అని తన మనస్సులో అనుకుంటున్నాడు శ్రీరామ్. తదుపరి షిరిడి పుర వీధులలోనే నడుచుకుంటూ వెళ్తూ, సాయినాధుని సన్నిధికి చేరుకున్నాడు శ్రీరామ్.

* * *

సాయినాధుని సన్నిధిలోని ద్వారాకమయి లోకి ప్రవేశించాడు శ్రీరామ్. తన జేబులో ఉన్న అమ్మ ముడుపు తాలూకు రెండు రూపాయల నాణేన్ని హుండీలో వేసి, బాబాకి నమస్కరించు కుంటున్నాడు శ్రీరామ్.
ఓ సాయినాధా మా అమ్మ కడగంటి వరకు నీ నామ స్మరణ, ఆరాధనతోనే జీవితాన్ని గడిపింది. తన చివరి రోజుల్లో నీకు చెల్లించాలి అనుకున్న ముడుపును కూడా, ఈ రోజు చెల్లించాను
పుట్టిన వాడు గిట్టక మానడు అనేది అనివార్యమే. కానీ ఇంత త్వరగా నాకు అమ్మను దూరం చేయడం నీకు భావ్యమా సాయినాదా? అని మనస్సులో అనుకుంటూ.. చెమరిస్తున్న తన కళ్ళను తుడుచుకుంటున్నాడు శ్రీరామ్.
ఓ సాయినాథా… పుట్టినవాడు గిట్టక తప్పదు అట్లాగే పోయినవాడు తిరిగి జన్మించక తప్పదు అనేది వాస్తవమే అయితే…ప్రతి జన్మలోనే మా అమ్మ కడుపునే నన్ను పుట్టించు తండ్రి… అంటూ రెండు చేతులు జోడిస్తూ, బాబా విగ్రహం కేసి దీనంగా చూస్తున్నాడు మోహన్.

సరిగ్గా ఆ క్షణంలో సాయినాధుని విగ్రహం మొహంలో చిరునవ్వు తొణికసలాడినట్టు అనిపించింది శ్రీరామ్ కి.

” ఓరి వెర్రివాడా ఆమె నీకు మాత్రమేనా అమ్మ… నాకు కాదా? అయినా నీకు సాయి తత్వం తెలియదా? నన్ను శరణాగతి చేసినవారి ఇంట అంతా నేనై వ్యవహరిస్తాను.ఆ ఇంటి పెద్ద కొడుకు మాదిరి బాధ్యతగా వ్యవహరిస్తాను. ఇంత కాలం అమ్మ నీ దగ్గరే ఉంది. ఈ రోజుతో తన ముడుపును చెల్లించి పెద్ద కొడుకును అయినా నా దగ్గరకు చేరుకుంది. ఇకపై అమ్మ బాధ్యత నాదే. పెద్ద కొడుకుగా నా బాధ్యతను కూడా నిర్వర్తించని. నువ్వు ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. ద్వారాకమాయి కి నీవు ఎప్పుడు వచ్చినా మీ అమ్మ చెంతకు వచ్చినట్లే…ఇక్కడ కానీ..మరెక్కడైనా కానీ నాపేరున అన్న ప్రసాదాన్ని నువ్వు స్వీకరిస్తే , అమ్మ చేతి కమ్మటి గోరు ముద్దలను నువ్వు తిన్నట్టే”
అని సాయిబాబా తనని ఊరడిస్తున్నట్టుగా శ్రీరామ్ కి అనిపించింది.

అమ్మ ఇకనుండి బాబా గారి దగ్గరే నిశ్చింతగా ఉండబోతోంది అనే భరోసా తన మనస్సుకు కలిగింది శ్రీరాంకి.. ఆ భరోసా భావనతో బాబా గారికి మరొక్కమారు నమస్కరిస్తూ వెనుతిరిగాడు శ్రీరామ్.

LEAVE A RESPONSE