అందని ద్రాక్షగా మిగిలిన రైతు సంక్షేమం  

గత నాలుగు సంవత్సరాలుగా  ఒక్కటంటే ఒక్క పథకం రైతులకు పనికొచ్చేది లేదు.  నాబార్డ్  ద్వారా 2019లో  సోలార్ కోల్డ్ స్టోరేజి ఉమ్మడి జిల్లాలో కేవలం నలుగురు మోతుబరి రైతులకు  ఇచ్చారు. నాబార్డ్ ఆఫీస్ ఎక్కడుందో జిల్లా అధికారులకు తెలియదు. అతి కష్టం మీద ఎవరైనా అక్కడికి చేరుకోగలిగితే వారు ఇచ్చే సమాధానం ఈ సంవత్సరం రైతులకు ఏ పథకం లేదు.  ప్రతి  పథకానికి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ రిజిస్టర్ అయి ఉండాలి.

జిల్లాలో కార్పొరేటు వ్యవసాయం అది గిట్టుబాటు కాకపోతే ఆర్గానిక్ విలేజ్, అదీ గిట్టుబాటు కాకపోతే  ఫార్మ్ హౌస్ రియల్ ఎస్టేట్ లో దిగుతున్న రైతులకు అన్ని పథకాలు వర్తింప చేస్తున్నారు.  పేద మధ్య తరగతి రైతుకు నయా పైసా ఉపయోగం లేకుండా పోయింది.  నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అని గొర్రెల, కోళ్ల పెంపకానికి ఉద్దేశించిన పథకం  అది అప్ప్లై చేస్తే నెల తిరక్కుండానే అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లు మొబైల్ కు సంక్షిప్త సందేశం పంపుతున్నారు. గేదెలు ఆవులు పెట్టుకోడానికి ప్రోత్సాహం లేదు.  పావు పాలు దొరకని గ్రామాలలో బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు పెట్టడానికి శ్రీకారం చుడుతున్నారు. పాలు ఎవరికి పిండుతారు, పాలు ఎలా సేకరిస్తారో అర్థం కాక ప్రజలు సతమతమవుతున్నారు.

మూడు సంవత్సరాల క్రింద  రాష్ట్రంలో  చిన్న సన్నకారు కౌలు రైతుల సంక్షేమం కోసం  ప్రవేశపెట్టిన కష్టమర్  హైరింగ్ సెంటర్ పథకం అటకెక్కింది.  కేవలం ఒక వర్గం ప్రయోజనం కోసం ఆర్బికే  వెలసినట్లు కనిపిస్తుంది. ఆర్ బి కే ద్వారా విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు, రసాయనాలు మరియు రైతులకు పనిముట్లు, వ్యవసాయ ఉపకరణాలు తక్కువ ధరలకు అందించే విధంగా రూపకల్పన చేసాము అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఏవి సక్రమంగా నిర్వహించక అభాసు పాలైంది.  విత్తన పంపిణీలో దోపిడి, 4 మూటలు వేరుశెనగ విత్తన కాయలు ఇవ్వాల్సిన కేంద్రాలు  3 మూటలతో సరిపెట్టి, జెర్మినేషన్ కాని నాసిరకం విత్తనాలు ఇచ్చి రైతులను నిండా ముంచారు.

అవసరమైన డి ఏ పి, యూరియా , విత్తన శుద్ధి చేసే ఫంగిసైడ్ సరఫరా చేయదు.  రైతు సంక్షేమము కొరకు రైతు సంఘాల ద్వారా గుంటకలు, పల్టార్, గొర్రు, రోటవేటర్, ట్రాక్టరు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పిన ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్లికేషన్ స్వీకరించి కేవలం ఒక వర్గం రైతులకే కష్టమర్ హైరింగ్ సెంటర్లు ఇవ్వడం జరిగింది.  రైతు సంఘంలో విభిన్న కులాలు ఉండాలి, సంఘంలో సభ్యులు ఒకే కులము మరియు బంధువులు, రక్త సంబంధీకులు ఉండకూడదు. కానీ  చాల మండలాల్లో కేవలం ఒకే కులానికి చెందిన వారు రైతు సంఘాన్ని, కస్టమర్ హైరింగ్  సెంటర్లను లీడ్ చేస్తున్నారు. నిబంధనలన్నీ త్రుంగలో త్రొక్కి నాంకేవాస్తే ఇతర కులాలను రైతు సంఘంలో ఉన్న వారి పాత్ర నామమాత్రం. రైతు భరోసా కేంద్రాలు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల కనుసన్నలలో నడుస్తున్నాయి. స్థానికి యం ల్ ఏ, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ  ఇంచార్జులు లబ్దిదారులను సెలెక్ట్ చేస్తున్నారు.  కష్టమర్ హైరింగ్ సెంటర్లలో లీడ్ తీసుకునే వారు వెనుకబడిన తరగతులకు, షెడ్యూలు కులాలు , షెడ్యూలు తరగతులకు చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనము ఉండేట్లు ప్రభుత్వ పథకాలు ఉండాలి, లేకపోతే ప్రయోజనం ఉండదు.  ఉమ్మడి జిల్లాలో 857 హైరింగ్ సెంటర్లు ప్రతిపాదన పంపారు. ఇంతవరకు మంజూరు కాలేదు.  ఇప్పుడు జిల్లాలో 91 డ్రోన్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు.  డ్రోన్ల వినియోగం రైతులకు  వ్యవసాయ అధికారులకు తెలియదు.

పెద్ద వాళ్ళ ఇళ్లల్లో శుభకార్యాలకు డ్రోన్లు ఫోటోలు తీస్తుంటే చూడడం తప్ప వీటిని  మందుల పిచికారీకి ఉపయోగిస్తారా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు.  డ్రోన్ల వినియోగంపై వ్యవసాయ అధికారులకు శిక్షణ లేదు, ఇంతవరకు వీటిని చూసిన పాపాన అధికారులు చేయలేదు.  బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ లో కానీ రాష్ట్ర బడ్జెట్ అవుట్ కమ్ లో డ్రోన్ల ప్రస్తావన లేదు.  గత నాలుగు సంవత్సరాలుగా  భూసార పరీక్షలు చేయలేదు. గతంలో మట్టి నమూనాలు సేకరించకుండా  సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేశారు. 2018 వరకు కేంద్ర ప్రభుత్వ గ్రిడ్ పథకం ద్వారా సాయిల్ హెల్త్ కార్డులు జారీచేశాం తరువాత భూసార పరీక్షలు నిర్వహించలేదని  చెపుతున్న అధికారులు,  2021 బడ్జెట్ లో  రైతులకు భూసార పరీక్షలకు తర్ఫీదు ఇచ్చాము, అందుకు బడ్జెట్ కేటాయించాము.  రైతు సంక్షేమం కోసం ఏర్పడ్డ ప్రభుత్వం గ్రామీణ వలంటీర్ల ద్వారా  600  పైగా సర్వీసులు నిర్వహిస్తున్నదని సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు.

బడ్జెట్ కేటాయింపులు లేని ప్రభుత్వ పథకాలు కేవలం ప్రచార ఆర్భాటాలకే తప్ప  నిజమైన గ్రామాభ్యుదయమే కనపడుటలేదు. రైతులకు తక్షణమే పంట నష్టం అంచనా వేసి, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ , ఇంటరెస్ట్ సుబ్వెన్షన్, ప్రాంప్ట్ రీ పేమెంట్ ఇన్సెంటివ్ రైతుల ఖాతాల్లోకి జమ చేయాలి.  రైతులకు నాణ్యమైన విత్తనాలు, మైక్రో ఇరిగేషన్లో  భాగమైన డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్లు, లాడర్ పంపిణీ చేయాలి. వ్యవసాయ పనిముట్లకు భారీగా రాయితీ ఇవ్వాలని  రైతులు కోరుతున్నారు. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని జబ్బలు చరుచుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం దగ్గర  అప్పు పుడితే చాలు సంస్కరణల పేరుతో  రైతులకు ఉరితాళ్లు బిగించడానికి సిద్ధంగా ఉన్నట్లు  తెలుస్తోంది.

మూడున్నర  సంవత్సరాల క్రింద అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి ఆర్థిక, సాంకేతిక, సుస్థిరమైన శక్తివంతమైన సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించాలి అన్న మాటలకు విరుద్ధంగా పనిచేస్తున్నది. మొదట్లో మేకపోతు గంభీర్యం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణలల్లో భాగమయ్యింది. నిర్దేశిత మూడు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసి, మధ్యప్రదేశ్‌ తర్వాత విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అమలు చేసిన రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. తద్వారా జీఎస్‌డీపీలో 0.15 శాతం మేర అంటే రూ.1,515 కోట్ల మేర అదనపు రుణాలు స్వీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి పొందింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ అమలు చేసిన సంస్కరణల కారణంగా రూ.9,190 కోట్ల మేర అదనపు రుణాలకు అర్హత లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది.

ఏపీతోపాటు పది రాష్ట్రాలకు అదనంగా అప్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్నందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించింది.  కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. అదనంగా అప్పు చేసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోయినా, విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సుమారు 25వేల కోట్ల నష్టం వచ్చినప్పటికీ తాము కేంద్ర విద్యుత్ సంస్కరణలను అమలు చేయలేమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అదనంగా అప్పులు చేసుకునేందుకు అనుమతిచ్చిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం లేదని తెలుస్తోంది. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తెచ్చేందుకు ముందుకు రాని రాష్ట్రాలకు రుణాలివ్వడం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థలను ఆదేశించింది. తెలంగాణ జెన్‌కోకు జాతీయ విద్యుత్‌ ఆర్థిక సంస్థ(పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుత్‌ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ)ల నుంచి రూ.20 వేల కోట్ల రుణాల పంపిణీ నిలిచిపోయింది.

కేంద్ర ప్రభుత్వ నూతన సంస్కరణలు రైతుల పాలిట శాపంగా మారనున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కేంద్రం చెప్పిన సంస్కరణలు అమలు చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు అందుతుండడంతో ఈ సంస్కరణలు తప్పనిసరి అయ్యాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద రుణాల కోసం ఈ నిబంధనలు తప్పనిసరిగా మారాయి. ఇన్నాళ్లు రైతులకు ఉచిత విద్యుత్‌ అందగా కేంద్ర సంస్కరణలతో మోటార్లకు మీటర్లు బిగించనున్నారు. దీంతో వ్యవసాయ విద్యుత్‌కు ఇక నుంచి లెక్క పక్కా కానుంది. ఇప్పటికే విద్యుత్‌ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్‌ లెక్కను తేల్చేపనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్‌ అందించే ట్రాన్స్‌ఫార్మర్‌లకు మీటర్ల బిగింపు కార్యక్రమం మొదలైంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ బోర్లకు మీటర్లను బిగిస్తే రైతులకు ఉచిత విద్యుత్‌ అందుతుందా? లేదా? మీటర్లు బిగిస్తే రైతులు బిల్లులు చెల్లించాల్సిందేనా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లకు మీటర్లు బిగిస్తే ఒక్కో బోరు మోటారు ఎంత విద్యు త్‌ను వినియో గిస్తోందన్న లెక్కలు తేలడంతో పాటు అందుకు సంబంధించిన బిల్లులు సైతం రానున్నాయి. దీంతో రైతులకు కొత్త చిక్కులు ఎదురుకానున్నాయి.

ఉచిత విద్యుత్‌కు బ్రేకులు పడితే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఎంతైనా ఉంది.  బీజేపీ ప్రభుత్వం గద్దె నెక్కేందుకు బూటకపు హామీలు ఇచ్చి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు అందుకు విరుద్ధంగా నడుచుకుంటుంది. పెట్రోలు, డీజిల్, రవాణా రేట్లు, వ్యవసాయ పెట్టుబడి రెట్టింపు అయ్యాయి, దిగుబడి, గిట్టుబాటు ధరలు తగ్గాయి. రాబోయే రోజులలో  వ్యవసాయం కష్టంగా మారనున్నది.  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, మరోవైపు అతివృష్టి అనావృష్టితో పంట నష్టం ఎక్కువగా ఉంది, ఈ పరిస్థితుల్లో  రాష్ట్ర ముఖ్యమంత్రి  వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్‌ మీటర్లను బిగించేందుకు సిద్ధమవ్వడం దుర్మార్గమైన చర్య. రైతులు వినియోగించే విద్యుత్‌కు అయ్యే ఖర్చును రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. రైతులకు 9 గంటలు విద్యుత్‌ అందించాల్సిందిపోయి, 7 గంటలు మాత్రమే అందిస్తున్నారు.   రైతులు విద్యుత్ సంస్కరణలు క్షున్నంగా అధ్యయనం చేసి వాటిని ఉపసంహరించుకునే  వరకు ఉద్యమ బాట పట్టాలి.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

Leave a Reply