ఎంత దాహమేసినా సరే… సర్కారువారి కొళాయి నీటిని నేరుగా తాగాలంటే హడలెత్తిపోతాం మనం! గుక్కెడు నీళ్ళు తాగినా… గొంతు నొప్పి రావడం నుంచి అతిసారం బారినపడటం దాకా ఏమైనా జరగొచ్చని భయపడిపోతుంటాం.
కానీ ప్రఖ్యాత జగన్నాథ క్షేత్ర నగరం పూరీకి వెళితే ఇకపైన అలా భయపడక్కర్లేదు. మున్సిపాలిటీ కొళాయిల్లో ఫిల్టర్ నీటికన్నా నాణ్యమైన శుద్ధజలాన్ని అందిస్తున్నారక్కడ. మనదేశంలో అలా అందిస్తున్న తొలి నగరంగా రికార్డుకెక్కడమే కాదు లండన్, న్యూయార్క్, సింగపూర్ నగరాల సరసనా చేరింది… పూరీ!
ఒడిశా మనదేశంలో వెనకపడ్డ రాష్ట్రాల్లో ఒకటి! ఆ రాష్ట్రంలోని పూరీ నగరం మాత్రం తాగునీటి విషయంలో ప్రపంచ నగరాల సరసన చేరడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఐదేళ్ల కిందటిదాకా ‘అసలు వీధులన్నింటికీ పైపులు వేయగలిగితే గొప్ప’ అనుకున్న నగరం… ఇప్పుడు ఆ కొళాయిల్లో అతిస్వచ్ఛమైన నీటిని సరఫరా చేసే స్థాయికి ఎదగడం విశేషం.
దీని వెనక ఆ రాష్ట్రముఖ్యమంత్రి దార్శనికతా, దాన్ని నిక్కచ్చిగా అమలు చేసిన ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధతా ఉన్నాయి. 2017లోనే ఇంటింటికీ తాగునీటి కనెక్షన్ పేరుతో ఒడిశాలో ఓ కొత్త పథకాన్ని ప్రారంభించి… రెండేళ్లలోనే ఆ పనులు పూర్తిచేయగలిగారు. అందులోనూ పూరీ నగరంలో 76 శాతం కనెక్షన్లు ఇచ్చి రికార్డు సృష్టించారు… ఈ సంఖ్య హైదరాబాద్‌లో 50 శాతం, విశాఖలో 40 శాతమే మరి! ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో సుజల్ మిషన్ అనే సరికొత్త పథకాన్ని రూపొందించారు #నవీన్_పట్నాయక్.
సర్కారు తాగునీటి పైపుల ద్వారా…
మార్కెట్లో దొరికే వాటర్ బాటిళ్లని తలదన్నేస్థాయి నీటిని సరఫరా చేయడమే ఈ పథకం లక్ష్యం. దీన్ని ముందుగా-పూరీలోనే ప్రయోగపూర్వకంగా అమలు చేయాలనుకున్నారు. ఎనిమిది ‘జోన్’లలో మొదలుపెట్టి… అన్ని ప్రాంతాలకీ విస్తరిస్తూ ఇటీవలే వందశాతం మైలురాయిని అందుకున్నారు.
కేవలం ఇంటింటి కనెక్షన్‌లే కాదు… పూరీ ప్రఖ్యాత పర్యటక క్షేత్రం కూడా కాబట్టి నగరంలోని 400 కేంద్రాల్లో పెద్ద ఎత్తున తాగునీటి కొళాయిల్ని ఏర్పాటుచేశారు. వీటిల్లో 24 గంటలూ నీళ్లొస్తాయి. ఈ నగరానికి వచ్చినవాళ్లు ఎవరైనా సరే… షాపుల్లో బాటిళ్లు కొనాల్సిన అవసరం లేకుండా ఆ నీటిని నిర్భయంగా తాగేయొచ్చు. అంతెందుకు, ముఖ్యమంత్రి కూడా ఇక్కడకొస్తే… ఈ కొళాయి నీళ్లే తాగుతున్నారు!
చక్కటి సాంకేతికత…
పూరీకి ఆ నగరం మధ్యలో ప్రవహించే మంగళా నది ద్వారానే నీటిని సరఫరా చేస్తుంటారు. ఇందుకోసం మంగళా ఘాట్ దగ్గర తాగునీటి శుద్ధికరణ కేంద్రం ఉంది. ఈ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ని అత్యంత నాణ్యమైన నీటిని అందించేలా ఆధునికీ కరించారు. అక్కడి నుంచి పూరీలోని చిట్టచివరి ఇంటిదాకా వెళ్లే పైపులైన్‌లని ప్రతి వందమీటర్లకోసారి పర్యవేక్షించేలా ఆటోమెటిక్ సెన్సర్‌లని ఏర్పాటు చేశారు.
నీటి రంగు, వాసనతోపాటూ ప్రవాహవేగంలోనూ ఏ చిన్న తేడా వచ్చినా సరే… ఈ సెన్సర్‌లు ప్రధాన సర్వర్ కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తాయి. అది అలాంటి సమస్యల్ని తక్షణం సరిచేయడానికి ఏర్పాటైన ‘ల్యాబ్ ఆన్ వీల్స్’ ప్రత్యేక బృందాన్ని హెచ్చరిస్తుంది. వాళ్లు సెన్సర్‌లు చూపే ప్రాంతానికి వెళ్లి అప్పటికప్పుడు సమస్యని పరిష్కరిస్తారు.
సెన్సర్‌లతోపాటూ ప్రజలు కూడా రోజులో ఎప్పుడైనా ఫోన్ చేసి ఫిర్యాదుచేసేలా ప్రత్యేక కాల్ సెంటర్‌నీ ఏర్పాటుచేశారు. ఈ ఏర్పాట్లతో ఏమాత్రం కాలుష్యంలేని స్వచ్ఛమైన నీటిని అందించ గలుగుతున్నారు. ఇక్కడి నీటి రంగూ రుచీ వాసనా లవణాలూ క్షారాలూ(పీహెచ్) తదితర 30 అంశాల ఆధారంగా ఈ నీటిని పరీక్షించిన భారత నాణ్యతా ప్రమాణాల మండలి(బీఐఎస్) స్వచ్ఛమైన తాగునీటికి ఇచ్చే ‘బీఐఎస్ 10500’ సర్టిఫికెట్‌ని అందించింది!
వాళ్లే కీలకం…
దాదాపు 24 కోట్ల ఖర్చుతో ఈ పథకాన్ని పట్టాలకెక్కించింది ఒడిశా ప్రభుత్వం. అందుకే ఒక్క నీటి బొట్టూ వృథాకాకుండా ఇంటింటికీ నీటిమీటర్లని తప్పనిసరి చేసింది. ఒక్క నీటి కనెక్షన్‌కీ రూ.3600 తీసుకుంటోంది. అందుకోసం నెలకి రూ.100 చొప్పున వడ్డీలేని వాయిదాల పథకాన్నీ తెచ్చింది. కనెక్షన్‌లకి అంత డబ్బు వసూలు చేయడమేంటని మొదట్లో వ్యతిరేకత వచ్చినా… స్థానిక మహిళా స్వయం ఉపాధి బృందాల ద్వారా వారిని చైతన్యపరిచి ఒప్పించింది!
ఈ బృందాలని ‘జల్ సాథీ’లని పిలుస్తున్నారక్కడ. కనెక్షన్‌లని కేటాయించడం, మీటర్ రీడింగ్, నీటి పన్నుల వసూళ్లు వంటి బాధ్యతలన్నీ ఈ మహిళలే చూస్తున్నారు. పూరీకి ఏటా రెండుకోట్ల మంది పర్యటకులు వస్తుంటారని అంచనా. వీళ్లవల్ల కనీసం మూడుకోట్ల వాటర్ బాటిళ్లు చెత్తలో చేరిపోతాయట. పైపుల్లోనే స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ద్వారా ఆ బాటిళ్ల సంఖ్యని సగానికి సగం తగ్గించగలిగినా… 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టినట్లవుతుందని అంచనా వేస్తున్నారు! స్వచ్ఛమైన తాగునీటికి అదనంగా… ఒనగూరే మరో ప్రయోజనమిది…