Suryaa.co.in

Political News

వైసీపీలో పెరుగుతున్న ముఠాల మఠాలు

– ఎంపీ-ఎమ్మెల్యేలది ఎవరి దారి వారిదే

అధికార వైసీపీలో పెరుగుతున్న ముఠాల మఠాలు జగన్‌కు శిరోభారంగా మారాయి. మూడు, నాలుగేసి జిల్లాలకు ఒక సమన్వయకర్తను నియమించినప్పటికీ, ముఠా తగాదాలను పరిష్కరించడంలో వారూ చేతులెత్తేశారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ముఠా తగాదాలతో పార్టీ నేతలు రోడ్డెక్కుతున్న సంఘటనలు పార్టీ ప్రతిష్ఠకు మచ్చ తెస్తున్నాయి. ప్రధానంగా గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా ఎంపీలు-ఎమ్మెల్యేల మధ్య విబేధాలు ముదురుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఎంపీలయితే పార్టీకి దాదాపు దూరంగా ఉంటున్న పరిస్థితి.

ప్ర‌కాశం జిల్లాలో ఓ వైపు తెలుగుదేశం బ‌లం పుంజుకుంటుంటే వైసీపీ రోజుకో గ్రూపు..పూట‌కో వివాదంగా బ‌ల‌హీన‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పూర్తిగా పార్టీకి దూరం అయ్యారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి వైసీపీతో త‌న‌కు సంబంధ‌మే లేన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యే త‌న గ‌న్‌మెన్ల‌ను స‌రెండ‌ర్ చేసి ఫోన్ల‌కి కూడా అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. చీరాల‌లో టిడిపి నుంచి వ‌చ్చిన క‌ర‌ణం బ‌ల‌రాం..అంత‌కుముందే వైసీపీలో చేరిన ఆమంచి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి కూడా వేయ‌కుండా భ‌గ్గుమంటోంది. ఇక జ‌గ‌న్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, ఆయ‌న బావ‌మ‌రిది బాలినేని శ్రీనివాస‌రెడ్డి మ‌ధ్య వైరం ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఏ క్ష‌ణంలోనైనా రాజీనామా చేయొచ్చ‌ని హింట్ ఇచ్చారు.

చిత్తూరు జిల్లాలో తంబ‌ళ్ల‌ప‌ల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వార‌కానాథ్‌రెడ్డిని ప్ర‌శ్నిస్తే చాలు సొంత పార్టీ వారైనా లోప‌లేయిస్తున్నార‌ని వైసీపీ జెడ్పీటీసీ భ‌ర్త కొండ్రెడ్డి రోడ్డెక్కారు. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం వైసీపీ నేత‌ల‌దీ ఇదే మాట‌. పెద్దిరెడ్డి బ‌స్సుల్లో ఓట్లు త‌ర‌లించినా వారితో ఓట్లేయించేది మేమేనంటూ తొడ‌గొడుతున్నారు.
న‌గ‌రి ఎమ్మెల్యే రోజాది మ‌రీ దారుణ‌మైన ప‌రిస్థితి. త‌న‌కు పోటీగా ఎదుగుతున్నార‌ని వైసీపీ నేత‌ల్ని స‌స్పెండ్ చేయిస్తే, వారు పెద్దిరెడ్డి ఆశీస్సుల‌తో సొంతంగా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. దీనిపై రోజా ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

అనంత‌పురం జిల్లాలో వైసీపీ నేత‌లు మ‌ధ్య వైరం తీవ్రం అవుతోంది. ఎంపీ రంగ‌య్య‌, క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉష‌శ్రీచ‌ర‌ణ్ మ‌ధ్య గొడ‌వ‌లు ముదిరి పాకాన‌ప‌డ్డాయి. క‌దిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప‌ద‌వులు అమ్ముకున్నార‌ని వైసీపీ నేత‌లే ఆరోపించ‌డంతో వివాదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి… త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌లో లోక‌ల్ మాఫియాలు దోచుకుంటున్నాయ‌ని ఆరోపించారు. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల‌కు- మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌కి అస్స‌లు పొస‌గ‌డంలేదు. గూడురు, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని.. సెకండ్‌ క్యాడర్‌ నేతలు ఆరోపించారు. స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్థ‌న్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట‌కి మ‌ధ్య వివాదం కేసుల వ‌ర‌కూ చేరింది.

గుంటూరు జిల్లాలో న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు కృష్ణ‌దేవ‌రాయలు చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జినితో విభేదాలు తీవ్ర‌మ‌య్యాయి. కృష్ణ‌దేవ‌రాయ‌లు పూర్తిగా పార్టీకి దూర‌మ‌య్యే ఆలోచ‌న‌లో వున్నార‌ని స‌మాచారం. వైసీపీలో మొద‌టి నుంచీ ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్, త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై వైరాగ్యంతో తిరిగి న్యాయ‌వాదిగా ప్రాక్టీసుకి వెళ్లిపోయారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, బాప‌ట్ల ఎంపీ సురేష్ మ‌ధ్య వాటాల తేడాతో గొడ‌వ‌లు ముదిరి రోడ్డున‌ప‌డ్డాయి. శ్రీదేవిని హైద‌రాబాద్‌కే ప‌రిమితం కావాల‌ని అధినేత ఆదేశించార‌ని వైసీపీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

కృష్ణా జిల్లాలో వైసీపీలో చేరిన టిడిపి నేత‌ల మ‌ధ్య విభేదాల‌తో ఒక‌రినొక‌రు త‌మ‌కే సాధ్య‌మైన పాత‌త‌రం పాలిటిక్స్‌తో త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నారు. కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలు….దేవినేని అవినాష్‌ని టార్గెట్ చేసి మ‌రీ కొట్టారు. వంగ‌వీటి రాధ హ‌త్య‌కి అవినాష్ ఆంత‌రంగికుడు అర‌వ స‌త్యం రెక్కీ నిర్వ‌హించ‌డంతో పార్టీలో లుక‌లుక‌లుని బ‌య‌ట‌పెట్టింది. మ‌రోవైపు పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌, మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ల మ‌ధ్య విభేదాలు తీవ్ర‌మ‌య్యాయి.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్‌, ఎమ్మెల్యే ఎలీజా మ‌ధ్య ఉన్న గ్యాప్ స్థానికసంస్థ ఎన్నిక‌ల్లో బ‌ట్ట‌బ‌య‌లైంది. మంత్రి ఆళ్ల‌నానితోనూ ఎమ్మెల్యేలు, నేత‌ల‌కు బాగా దూరం పెరిగింది.
తూర్పుగోదావ‌రి జిల్లాలో ఎంపీ భ‌ర‌త్‌, ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా మ‌ధ్య వివాదం రాజుకుంది. ఒక‌రినొక‌రు ఎప్పుడు దెబ్బ‌కొట్టుకుందామా అని ఎదురు చూస్తున్నారు.

విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి దెబ్బ‌కి వైసీపీ నేత‌లు పూర్తిగా తెర‌మ‌రుగ‌య్యారు. ఇటీవ‌లే వైసీపీ జెండా క‌ప్పుకున్న వాసుప‌ల్లి గ‌ణేష్ అల‌క‌బూనారు. అలాగే మంత్రి అవంతి తీవ్ర అసంతృప్తితో వున్నారు. పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకి స్థానిక వైసీపీ నేత‌ల‌కి మ‌ధ్య చాలారోజుల్నించి వివాదాలు న‌డుస్తూనే వున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో ధ‌ర్మాన కృష్ణ‌దాసు వ‌ర్గం, త‌మ్మినేని వ‌ర్గం, సీదిరి స్వ‌తంత్రంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతూ…ఇది మునిగిపోయే ప‌డ‌వ‌…మీ దారి మీరు చూసుకోండ‌ని అనుచ‌రుల‌కు చెబుతున్నార‌ని స‌మాచారం.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ హ‌వాకి అడ్డుక‌ట్ట వేయ‌డానికి ఆయ‌న మేన‌ల్లుడు చిన్న‌శ్రీనుని జ‌గ‌న్ పావులా వాడుకోవ‌డంతో ఒకే ఇంట్లో రెండు కుంప‌ట్లులా రాజుకుంటోంది రాజ‌కీయం.

రాష్ట్రంలో 13 జిల్లాల్లోనూ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల నుంచి గ్రామ‌స్థాయి వ‌ర‌కూ గ్రూపులుగా వైసీపీ వ‌ర్గ‌పోరాటం సాగుతోంది. దీనిపై దృష్టి పెట్టే ఆలోచ‌న అధిష్టానం చేయ‌క‌పోవ‌డంతో ఇంటి పోరు ఇంతింత కాద‌యా అనే రేంజుకి చేరింది.

LEAVE A RESPONSE